సిద్దిపేట, సెప్టెంబర్ 26( నమస్తే తెలంగాణ ప్రతినిధి): సిద్దిపేట జిల్లాలోని పట్టా భూములకు 22ఏ నిషేధిత జాబితా సెగ తగులుతున్నది. ప్రభుత్వ రికార్డుల్లో జరిగిన తప్పిదంతో వ్యవసాయ భూములు సైతం నిషేధిత జాబితాలో చేరుతుండటంతో జిల్లా వ్యాప్తం గా రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. భూమిపై హకులు ఉన్నా రికార్డుల్లో నిషేధిత జాబితాలో ఉండటంతో బ్యాంకు రుణాలు పొందడం కష్టంగా మారుతున్నది. పెట్టుబడి, వ్యక్తిగత అవసరాలకు భూమిపై రుణం తీసుకోవాలంటే ఆటంకాలు ఎదురవుతున్నాయి. ఇది ప్రస్తుతం జిల్లాలోని ఒకటి, రెండు కాదు అన్ని గ్రామాల్లో పట్టా భూముల రికార్డులపై అనుమానాలు రేకెత్తిస్తున్నది.
బ్యాంకు రుణం కోసం వెళ్తే..
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలం పాలమాకుల గ్రామానికి చెందిన రైతు ఎల్లంకి రవీందర్‌రెడ్డి తన వ్యవసాయ భూమిపై బ్యాంకు రుణం కోసం అధికారులను సంప్రదించాడు. భూమికి సంబంధించిన లీగల్ ఒపీనియన్ తీసుకురావాలని బ్యాంకు మేనేజర్ సూచించారు. దీంతో అవసరమైన పత్రాలను తీసుకొని న్యాయవాదిని సంప్రదించారు. భూ పత్రాలను పరిశీలించిన న్యాయవాది కొన్ని అనుమానాలు వ్యక్తం చేస్తూ సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం నుంచి సంబంధిత లేఖ తీసుకురావాలని రైతుకు సూచించారు. అక్కడికి వెళ్లి భూమి వివరాలను రైతు పరిశీలించగా 22ఏ నిషేధిత జాబితాలో ఉన్నట్టు తెలిసింది. దీంతో ఒక్కసారిగా అవాక్కయ్యాడు.
పాలమాకుల గ్రామంలో దాదాపు 120 సర్వే నంబర్లలో వెయ్యి ఎకరాలు 22ఏ నిషేధిత జాబితాలో ఉన్నట్టు తేలింది. పాలమాకుల గ్రామంలో మొత్తం 762 సర్వే నంబర్లు ఉండగా అన్నింటిలో కలిపి మొత్తం 3,437 ఎకరాలు వ్యవసాయ భూమి ఉన్నది. ఈ గ్రామంలో నిషేధిత జాబితాలో చేర్చిన సర్వే నంబర్లను చూసుకొని రైతులు లబోదిబోమంటున్నారు. జీపీవో నుంచి తహసీల్దార్, ఆర్డీవో, కలెక్టర్ సంతకాలు చేసి ఉన్న జాబితా చూసి రైతులు అవాక్కవుతున్నారు. సర్వే నంబర్ 97లో రోడ్డు నిర్మాణం కోసం ఒక ఎకరం ఎనిమిది గుంటల భూమి పోయింది. రోడ్డు కోసం తీసుకున్న భూమి మాత్రమే నిషేధిత జాబితాలో ఉండాల్సి ఉండగా, అదే సర్వే నంబర్లోని మిగతా భూమిని కూడా చేర్చారు. సర్వే నంబర్లో భూములు కలిగిన సుమారు 20 మంది రైతులకు 22ఏ సమస్య ఎదురైంది.

ఆందోళనలో పాలమాకుల గ్రామ రైతులు
భూభారతి వచ్చాక సిద్దిపేట- హనుమకొండ రహదారిని ఆనుకొని పాలమాకుల గ్రామ శివారు పరిధిలోని దాదాపు 120 సర్వే నంబర్లను 22ఏ జాబితాలో పెట్టారు. సర్వే నంబర్ 97/అ లోమొత్తం 19-02 ఎకరాలు ఉంటుంది. ఇందులో 1-08 ఎకరాలు రహదారి, సర్వే నంబర్ 112లో 117 ఎకరాలు భూమి ఉండగా, ఇందులో 10 గుంటలు రోడ్డు, సర్వే నంబర్ 98లో 5 ఎకరాలు ఉండగా ఇందులో 1-14 ఎకరాలు రోడ్డు, సర్వే నెంబర్ 122లో 18 ఎకరాలు ఉండగా దీంట్లో ఎకరం రహదారి పేరున ఉన్నది.
ఇలా ఒకటేమిటి 120 సర్వే నంబర్లకు పైగా పాలమాకుల గ్రామంలోని వ్యవసాయ భూములను 22ఏ జాబితాలో చేర్చారు. గతంలో ధరణి ఉన్నప్పుడు అమ్మకాలు, కొనుగోళ్లు సవ్యంగా సాగాయి. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలకు వెళ్తే మాత్రమే 22ఏ జాబితా సమాచారం వెలుగులోకి వస్తున్నదని రైతులు వాపోతున్నారు. నిషేధిత జాబితా ఒక గ్రామం, ఒక సర్వే నంబర్‌కే పరిమితమైన సమస్య కాదు. ఇది సిద్దిపేట జిల్లాలోని ఇతర గ్రామాల్లోనూ పట్టా భూముల రికార్డులపై రైతులు ఆందోళన చెందుతున్నారు. పట్టా భూములు అనవసరంగా నిషేధిత జాబితాలో చేరాయా..? రోడ్లు, ఇతర అభివృద్ధి పనుల కోసం సేకరించిన భూముల విస్తీర్ణం సరిగ్గా నమోదు చేశారా..? అనే అంశాలపై అధికారులు స్పష్టత ఇవ్వాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు.
నిషేధిత జాబితాలో ఎలా చేరుస్తారు..
సర్వే నంబర్ 97లో నాకు రెండెకరాల వ్యవసాయ భూమి ఉన్నది. ఆ భూమిలో వరి సాగు చేస్తున్న. ఎన్నో ఏండ్లుగా ఈ భూమిని నమ్ముకొని కుటుంబాన్ని పోషించుకుంటున్న. అలాంటి మా భూమిని ప్రభుత్వం నిషేధిత జాబితాలో చేర్చడం ఎంతవరకు సమంజసం? పంటలు సాగు చేసుకుంటున్న రైతులను ఇబ్బందులకు గురిచేయడం సరికాదు.
– వర్దోలు ఐలయ్య, రైతు, పాలమాకుల(సిద్దిపేట జిల్లా)
బ్యాంక్ లోన్‌కు వెళ్తే తెలిసింది
లోన్ కోసం బ్యాంకుకు వెళ్లినప్పుడే నా భూమి 22ఏ నిషేధిత జాబితాలో ఉన్నట్టు తెలిసింది. 97 సర్వే నంబర్లో రోడ్డుకు పోయిన 8 గుంటల భూమి మాత్రమే నిషేధిత జాబితాలో ఉండాల్సి ఉండగా, మిగతా భూమిని కూడా చేర్చారు. లాయర్, సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల చుట్టూ తిరిగి, వేల రూపాయలు ఖర్చు చేసినా నా భూమికి విముక్తి కలుగలేదు. రైతుల భూములను 22ఏ జాబితాలో ఏ విధంగా చేర్చారో ప్రభుత్వం సమాధానం చెప్పాలి. తక్షణమే నిషేధిత జాబితా నుంచి రైతుల భూములను తొలగించాలి.
– ఎల్లంకి రవీందర్‌రెడ్డి, రైతు,పాలమాకుల (సిద్దిపేట జిల్లా)