నల్లగొండ రూరల్, నవంబర్ 7 : మండలంలోని అప్పాజిపేట గ్రామంలో ఏర్పాటు చేసిన ధాన్యం ఐకేపీ కేంద్రంలో కొనుగోళ్లు జరుపడం లేదని రైతులు గురువారం ధర్నా చేశారు. సీపీఎం మండల నాయకుడు పోలె సత్యనారాయణ ధర్నాలో పాల్గొని మాట్లాడుతూ కేంద్రాల్లో ధాన్యం పోసి ఇప్పటీకే రెండు నెలలు పూర్తి కావస్తున్నా కొనుగోళ్లు జరుపడం లేదని మండి పడ్డారు.
అకాల వర్షాలతో ఆరుగాలం కష్టపడి పండించిన ధాన్యం తడిసి ముద్దవుతుందని, వాటిని ఆరబెట్టినా కొనే నాథుడు లేడని ఆవేదన వ్యక్తం చేశారు. దీంతో చేసేది లేక మద్దతు ధర లేకున్నా పరవాలేదని, ధాన్యాన్ని మిల్లులకు తరలిస్తున్నారన్నారు. ప్రజా పాలన పేరు చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ.. అన్ని వర్గాలను మోసం చేసిందని ఆరోపించారు. కార్యక్రమంలో సీపీఎం సీనియర్ నాయకుడు పందుల భిక్షం, నర్సిరెడ్డి, రవీందర్‌రెడ్డి, శ్రీనివాస్‌రెడ్డి, అచ్చాలు, యాదమ్మ, వెంకటమ్మ, పార్వతమ్మ, సునీత, వెంకటమ్మ, మణికుమార్, రామలింగయ్య, గంగయ్య, గుండాల యాదయ్య పాల్గొన్నారు.