అధికార గర్వం అన్నదాత పాదాల ముందు మోకరిల్లింది. తమ నిర్ణయాలకు తిరుగులేదని విర్రవీగిన అహంకారం.. కర్షకలోకం ముందు వీగిపోయింది. రైతుల గుండెల్లో ‘నల్ల చట్టాలు’ రగిల్చిన అగ్నిగుండం బీజేపీ సర్కారు పీఠానికి సెగ తగిలించింది. 750 మందికి పైగా రైతన్నల ప్రాణత్యాగానికి ఫలితం లభించింది. వివాదాస్పద మూడు వ్యవసాయ చట్టాలు.. రద్దు కానున్నాయి.
రైతుల మేలు కోసం.. ముఖ్యంగా సన్నకారు రైతులకు ప్రయోజనాలు అందించాలని మూడు సాగు చట్టాలను తెచ్చాం. ఎన్ని ప్రయత్నాలు చేసినా కొన్ని వర్గాల రైతులకు వీటిపై సర్ది చెప్పలేకపోయాం. దీంతో ఆ చట్టాల్లో సవరణలకు అంగీకరించాం. రెండేండ్లపాటు అమలును నిలిపేస్తామన్నాం. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టుకూ చెప్పాం. అయినా పరిస్థితిలో మార్పు లేదు. ఇవన్నీ చూశాక.. దీనిని పొడిగించడం ఇక నాకు ఇష్టంలేదు. ఈ సందర్భంగా దేశ ప్రజలను క్షమాపణలు కోరుతున్నా. నిర్మలమైన మనస్సుతో, పవిత్ర హృదయంతో చెప్తున్నా. మూడు సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించాం. పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో దీనిపై ప్రకటన చేసి, రాజ్యాంగ ప్రక్రియ మొదలుపెడతాం. ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులందరూ ఇండ్లకు, పొలాల్లోకి తిరిగి వెళ్లండి. కుటుంబసభ్యులతో కలిసి మళ్లీ కొత్త జీవితాన్ని ప్రారంభించండి. – ప్రధాని నరేంద్రమోదీ
మట్టిమనుషుల ముట్టడిలో ఢిల్లీ ఓడిపోయింది. కేంద్రం అహంకారం రైతన్నల ఆగ్రహాగ్నిలో మాడిపోయింది. అన్నదాతకు సున్నం పెట్టేందుకు తెచ్చిన నల్లచట్టాలు వీగిపోయాయి. స్వతంత్ర భారతంలో అద్వితీయమైన, అపూర్వమైన పోరాటం సాగించిన రైతులు అజేయులై నిలిచారు. దుమ్మెత్తిపోసినా, కత్తులు దూసినా చలించకుండా.. సాగించిన చరిత్రాత్మక పోరాటంలో అంతిమంగా రైతులే గెలిచారు. గడ్డిపోచలు కలిసి గజమును బంధించిన తరహాలో కుల, మత, ప్రాంతీయ అవధులు దాటి ఏకమైన రైతన్నలు జరిపిన సుదీర్ఘ పోరాటం మెడలు వంచగా ప్రధాని మోదీ ఓటమి ఒప్పుకున్నారు. కార్పొరేట్లకు వ్యవసాయం కట్టబెట్టాలని చేసిన ప్రయత్నాలు ఘోరంగా బెడిసి కొట్టడంతో దేశప్రజలకు విధిలేక క్షమాపణలు చెప్పుకున్నారు. రైతులు చీకొట్టిన మూడు వివాదాస్పద చట్టాలను వెనుకకు తీసుకుంటానని ప్రకటించారు. ఆరుగాలం, ఆరుబయట ప్రకృతి శక్తులతో పోరుసలిపే రైతన్న ఓపికను పరీక్షిస్తే ప్రళయం తప్పదని తెలుసుకున్న కేంద్రం చేతులు కాలిన తర్వాత దిగివచ్చింది. ఇది రైతు విజయం. ప్రజా విజయం.
న్యూఢిల్లీ, నవంబర్ 19: నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతన్నలు చేపడుతున్న ఉద్యమానికి ఏడాది కావస్తున్న వేళ.. ప్రధానమంత్రి నరేంద్రమోదీ అనూహ్య ప్రకటన చేశారు. గతేడాది ఏకపక్షంగా తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలను రద్దు చేస్తున్నట్టు ప్రకటించారు. శుక్రవారం సిక్కు మత గురువు గురునానక్ జయంతిని పురస్కరించుకుని ఆయన జాతినుద్దేశించి ప్రసంగించారు. వ్యవసాయ చట్టాలపై దేశ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. అధికారంలోకి వచ్చిన తర్వాత మోదీ.. తాను తీసుకొన్న నిర్ణయంపై వెనక్కి తగ్గడం, దేశ ప్రజలను బహిరంగ క్షమాపణ వేడుకోవడం ఇదే మొదటిసారి. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఒక ప్రధాని దేశ ప్రజలకు క్షమాపణ చెప్పడం బహుశా ఇదేనేమో. రైతుల ప్రయోజనాల కోసమే ఈ చట్టాలను తెచ్చామని, అయితే వాటి ప్రయోజనాలను వివరించడంలో విఫలమయ్యామని పేర్కొన్నారు. ఈ నెలాఖరులో ప్రారంభంకానున్న పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో అధికారికంగా చట్టాలను వెనక్కి తీసుకొనే ప్రక్రియను మొదలు పెడుతామని తెలిపారు. ఢిల్లీ సరిహద్దుల్లో నిరసనలు వ్యక్తంచేస్తున్న రైతులు తమ ఆందోళనను విరమించి.. ఇండ్లకు వెళ్లాలని విజ్ఞప్తిచేశారు.
ప్రధాని ప్రకటనను రైతు సంఘాలు స్వాగతించాయి. ఢిల్లీ సరిహద్దుల్లో రైతులు సంబురాలు చేసుకున్నారు. అయితే ఆందోళనను ఇప్పటికిప్పుడే విరమించబోమని, చట్టాల రద్దుపై పార్లమెంటులో రాజ్యాంగ ప్రక్రియ పూర్తయ్యే వరకు వేచిచూస్తామని రైతు నాయకుడు రాకేశ్ టికాయిత్ తెలిపారు. కనీస మద్దతు ధర, ఇతర సమస్యలపైనా కేంద్ర ప్రభుత్వం రైతులతో చర్చించాల్సి ఉన్నదని గుర్తుచేశారు. భవిష్యత్తు కార్యాచరణపై చర్చించేందుకు శని, ఆదివారాల్లో సమావేశం కానున్నట్టు సంయుక్త కిసాన్ మోర్చా తెలిపింది. మరోవైపు, ఆలస్యంగానైనా కేంద్రం కలుపు చట్టాలను ఉపసంహరించడాన్ని విపక్షాలు స్వాగతించాయి. ఇది రైతుల విజయమని పేర్కొన్నాయి. రానున్న ఎన్నికల్లో ఓటమిని గ్రహించే మోదీ సర్కారు ఈ నిర్ణయం తీసుకొన్నదని వ్యాఖ్యానించాయి.
కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు సాగు చట్టాలకు సెప్టెంబర్ 27న రాష్ట్రపతి ఆమోదం లభించింది. వీటిని నిరసిస్తూ.. ఢిల్లీ సరిహద్దుల్లో గతేడాది నవంబర్ 26న రైతు నిరసనలు ప్రారంభమయ్యాయి. వీటిని భగ్నం చేయడానికి జరుగని ప్రయత్నాలు లేవు. లాఠీచార్జీ, కాల్పులు, అరెస్టులతో రైతులను భయపెట్టేందుకు కుట్రలేకాదు.. జల ఫిరంగులను, బాష్పవాయు గోళాలతో రైతులను తరిమి కొట్టేందుకు ప్రయత్నాలు జరిగాయి. రైతులకు ఆహార సరఫరా, వైద్య సేవలను నిలిపేశారు. అయినప్పటికీ, అన్నదాతలు పిసరంత కూడా వెరవకపోవడంతో రైతు సంఘాల మధ్య సయోధ్య లోపించినట్టు వదంతులు పుట్టించింది. ఖలిస్థాన్ ఏజెంట్లుగా, దేశద్రోహులుగా, పాకిస్థాన్ ఉగ్రవాదులుగా రైతులపై అసత్య ప్రచారం చేసింది. డబ్బు ఆశ జూపించి కొన్ని రైతు సంఘాలను తమ వైపు తిప్పుకోవాలనుకొన్నది. ఆ పాచికలు కూడా పారలేదు. దీంతో ఈ ఏడాది గణతంత్ర దినోత్సవం నాడు ఎర్రకోట సాక్షిగా జరిగిన దాడులను రైతుల కుట్రగా ఆపాదించేందుకు ప్రయత్నాలు జరిగాయి. అయితే, దేశంలోనే కాకుండా అమెరికా, బ్రిటన్, కెనడా, న్యూజిలాండ్ తదితర దేశాల్లోని వారు కూడా రైతులకు అండగా నిలిచారు. గ్రెటా థన్‌బర్గ్ వంటి పర్యావరణ ఉద్యమకారులు, రిహానా, మేరీ మిల్బెన్, సుసాన్ సరందాన్ వంటి హాలీవుడ్ ప్రముఖులు కూడా అన్నదాతలకు సంఘీభావం ప్రకటించారు. అంతర్జాతీయ పత్రికలు మోదీ సర్కారు దమనకాండపై నిప్పులు చెరిగాయి. రాజకీయంగా, వ్యక్తిగతంగా రైతు దీక్షను భగ్నం చేయాలన్న కేంద్రం కుట్రలు విఫలమయ్యాయి.
‘మేరే ప్యారే దేశ్ వాసియో.. నమస్కార్. సాతియో.. హమారీ సర్కార్ కిసానో కో కళ్యాన్ కే లియే.. కాజ్ కర్ చోటే కిసాన్ కళ్యానో కే లియే.. దేశ్కే కృషి జగత్ హిత్ మే.. దేశ్ కే హిత్ మే.. గావ్-గరీబ్కే ఉజ్వల్ భవిష్యత్ కే లియే.. పూరీ సత్య్ నిష్ఠా సే.. కిసానో కే ప్రతి పూర్ణా సమర్పన్ భావ్ సే.. నేక్ నియత్ సే ఏ కానూన్ లేకర్ ఆయీ థీ. లేకిన్ ఇత్నీ పవిత్ బాత్ పూర్ణ రూప్ సే శుద్ధ్ కిసానో కే హిత్ కీ బాత్ హమ్ అప్నే ప్రయాసోకే బావ్ జూత్ కుచ్ కిసానో కో సమ్జా నహీ పాయే. హమ్ పూరీ వినమ్రతా సే.. కూలే మన్ సే ఉన్హే సమ్జాతే రహే.. సర్కార్ ఉనే బదల్నే కే లియే తయార్ హోగయీ. దో సాల్ తక్ హమ్ నే ఇన్ కానూన్ ఓ కో సస్పెండ్ కర్నే కా ప్రస్తావ్ దియా.. ఇసీ దోరాన్ ఏ విషయ్ మాన్య్ సర్వోత్త్ న్యాయ్ లేకే పాస్బీ చలాగయా.. ఇస్ సారీ బాతే దేశ్ కే సామ్నే హే. ఇస్లియే మే ఇన్కే అధిక్ విస్తార్ మే నహీ జావుంగా. సాతియో.. మే ఆజ్ దేశ్ వాసియో సే క్షమా మాంగ్తే హుయేహే. సచ్ఛే మన్ సే.. పవిత్ హృదయ్ కే కహనా.. ఏ హమ్నే తీన్ కృషీ కానూనోకో వాపస్ లేనే కా/రిపీల్ కర్నేకా నిర్ణయ్ లియా హే. ఇస్ మహినే కే అంత్ మే షురూ హోనే జారహే.. హమ్ తీనో కృషి కానూనోకో రిపీల్ కర్నే కీ సంవిదానిక్ ప్రక్రియ ఓ పూరా కర్తేహే. సాతియో.. మే ఆజ్ అప్నే సబీ ఆందోళన్ రక్ కిసాన్ సాతియో ఆగ్రే కర్హ్రాహూ.. అబ్ ఆప్ అప్నే, అప్నే ఘర్ లౌటే.. అప్నే కేత్ మే లౌటే.. అప్నే పరివార్‌కే బీచ్‌మే లౌటే. ఏక్ నయీ షురువాత్ కర్తేహే’ అని ప్రసంగంలో తెలిపారు.
(దేశప్రజలకు నమస్కారం. రైతుల మేలు కోసం.. ముఖ్యంగా సన్నకారు రైతులకు ప్రయోజనాలు అందించాలన్న ఉద్దేశంతో మూడు సాగు చట్టాలను తీసుకొచ్చాం. అయితే, ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినప్పటికీ కొన్ని వర్గాల రైతులకు ఈ విషయంలో సర్ది చెప్పలేకపోయాం. దీంతో ఆ చట్టాల్లో సవరణలకు అంగీకరించాం. రెండేండ్లపాటు వాటి అమలును నిలిపేస్తామని చెప్పాం. ఇదే విషయాన్ని అత్యున్నత న్యాయస్థానంలో కూడా వెల్లడించాం. అయినప్పటికీ, పరిస్థితిలో మార్పు లేదు. ఇవన్నీ చూశాక.. ఈ విషయాన్ని పొడిగించడం ఇక నాకు ఇష్టంలేదు. ఈ సందర్భంగా దేశ ప్రజలను క్షమాపణలు కోరుతున్నా. నిర్మలమైన మనస్సుతో.. పవిత్ర హృదయంతో చెబుతున్నాను.. మూడు సాగు చట్టాలను వెనక్కి తీసుకోవాలని నిర్ణయించాం. ఈ నెలాఖరున మొదలయ్యే పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో దీనిపై ప్రకటన చేసి, రాజ్యాంగ పరమైన ప్రక్రియ మొదలు పెడతాం. ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళన చేస్తున్న రైతులందరూ ఇండ్లకు, పొలాల్లోకి వెళ్లిపోండి. కుటుంబసభ్యులతో కలిసి మళ్లీ కొత్త జీవితాన్ని ప్రారంభించండి)
గత ఐదు దశాబ్దాలుగా రైతుల కష్టాలను దగ్గరుండి చూశానని ప్రసంగంలో ప్రధాని మోదీ పేర్కొన్నారు. అందుకే 2014లో దేశ ప్రజలు తనను ప్రధానిని చేసినప్పుడు.. రైతుల సంక్షేమం, అభివృద్ధికి ప్రథమ ప్రాధాన్యం ఇవ్వాలని తమ ప్రభుత్వం నిర్ణయించిందని పేర్కొన్నారు. ‘దేశంలో 80 శాతం సన్నకారు రైతులే. ఈ విషయం చాలా మందికి తెలియదు. 10 కోట్ల మందికి పైగా రైతులకు రెండు హెక్టార్ల కంటే తక్కువ భూమే ఉన్నది. అదే వారికి జీవనోపాధి. అందుకే వారి సంక్షేమానికి మా ప్రభుత్వం కట్టుబడి ఉన్నది. రైతుల అభివృద్ధి కోసం ఎన్నో పథకాలను తీసుకొచ్చాం. వ్యవసాయ రంగంలో ఎన్నో సంస్కరణలు ప్రవేశపెట్టాం. తక్కువ ధరకే విత్తనాలు అందించేలా కృషి చేస్తాం. ఫసల్ బీమా యోజనను మరింత బలోపేతం చేస్తాం. 22 కోట్ల భూసార పరీక్ష కార్డులను పంపిణీ చేయబోతున్నాం. కనీస మద్దతు ధరను పెంచడమే కాదు.. రికార్డు స్థాయిలో ధాన్యం సేకరణ కేంద్రాలను ఏర్పాటు చేశాం. గత కొన్ని దశాబ్దాల్లో ఎన్నడూ లేనంతగా మా ప్రభుత్వం ధాన్యాన్ని సేకరించింది. ఇకపై రైతుల కోసం మరింత కష్టపడి పనిచేస్తాం’ అని అన్నారు. వ్యవసాయ ఉత్పత్తులకు పారదర్శకంగా మద్దతు ధర కల్పించడం కోసం కమిటీ ఏర్పాటు చేస్తామని ప్రధాని మోదీ తెలిపారు. అందులో కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు, రైతులు, శాస్త్రవేత్తలు సభ్యులుగా ఉంటారని వివరించారు.
అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రధాని మోదీ తాను తీసుకున్న నిర్ణయంపై వెనక్కి తగ్గడం, దేశ ప్రజలను క్షమాపణ కోరడం బహుశా ఇదే మొదటిసారి. తమ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాల్లో ఎంత వ్యతిరేకత వచ్చినప్పటికీ ప్రధాని మొండిగా, నిరంకుశంగా వ్యవహరించారు. పౌరసత్వ సవరణ చట్టం, ఎన్సీఆర్, ఎన్పీఆర్, ట్రిపుల్ తలాక్, విద్యుత్ సవరణ బిల్లులపై పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమైనా ఆయన పట్టించుకోలేదు.
చలికి తట్టుకోలేక, శరీరం శుష్కించి, ఆరోగ్యం చెడిపోయి, కరోనా సోకి, ప్రభుత్వం చేసిన దాడులతో దీక్షాస్థలిలో 750 మందికి పైగా రైతులు అసువులుబాసారు. ఇదే సమయంలో గత నెల 3న యూపీలోని లఖింపూర్ ఖీరీలో శాంతియుతంగా నిరసన వ్యక్తం చేస్తున్న రైతులపైకి కేంద్రమంత్రి అజయ్‌మిశ్రా కుమారుడు ఆశిష్‌మిశ్రా వాహన శ్రేణి దూసుకెళ్లి నలుగురు మరణించడం ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టింది. దీనికితోడు వచ్చే ఏడాది ఐదు రాష్ర్టాలకు ఎన్నికలు జరుగనుండటం, ప్రజల్లో అంతకంతకూ పెరుగుతున్న ప్రభుత్వ వ్యతిరేకత, ఇటీవల వారంపాటు పశ్చిమ యూపీలో పర్యటించి వచ్చిన కేంద్రహోంమంత్రి అమిత్ షా ఇచ్చిన క్షేత్రస్థాయి నివేదికలో బీజేపీకి అన్ని ప్రతికూలతలే ఉన్నట్టు తేలడం, పంజాబ్‌లో అకాలీదళ్‌తో తెగదెంపుల వ్యవహారం, సాగు చట్టాలను వ్యతిరేకిస్తున్న.. పంజాబ్‌లో గట్టి పట్టున్న మాజీ కాంగ్రెస్ నేత అమరిందర్‌సింగ్‌ను బుట్టలో వేసుకోవాలన్న ప్రయత్నాలు.. అన్నింటికీ మించి రైతుల ఆగ్రహజ్వాలకు తాళలేక కేంద్రం సాగుచట్టాలపై ఎట్టకేలకు దిగివచ్చింది. క్రమశిక్షణతో కూడిన కార్యాచరణ, ఐకమత్యం, చిన్నా-పెద్ద, ఆడ-మగ, ధనిక-పేద అని తేడాలేకుండా అకుంఠిత దీక్షతో ఏడాదిపాటు ఓ శాంతి యజ్ఞాన్ని కొనసాగించిన రైతన్నల చిత్తశుద్ధితో కూడిన సత్యాగ్రహం ముందు అహంకారం సాష్టాంగ ప్రమాణం చేయకతప్పలేదు.
సాగుచట్టాలకు వ్యతిరేకంగా ఏడాది పోరాటం.. ఏడు వందల మందికిపైగా ఆత్మత్యాగం తర్వాత.. రైతులు ఏ లక్ష్యంతోనైతే సుదీర్ఘ ఉద్యమాన్ని ప్రారంభించారో ఆ లక్ష్యాన్ని సాధించుకోగలిగారు. మొండి వైఖరికి, అణిచివేత ధోరణికి పర్యాయపదంగా మారిన మోదీ సర్కార్ మీద దేశ రైతాంగం సాధించిన చరిత్రాత్మక విజయమిది. ఈ సందర్భంగా.. మోదీ ప్రభుత్వం వెనుకంజకు కారణాలేమిటన్నది ఆసక్తికరంగా మారింది. మోదీపై జనం పెట్టుకున్న నమ్మకాలు తొలగిపోతున్న వేళ, బీజేపీ సర్కార్ అణిచివేత వైఖరితో ఏకమవుతున్న విపక్షాలు, హిందీ రాష్ర్టాల్లో తగ్గుతున్న ఆదరణ, యూపీలో త్వరలో జరిగే అసెంబ్లీ ఎన్నికలు.. తదితర అంశాల వల్లే మోదీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తున్నది.
బీజేపీకి పట్టున్న ఉత్తరాదిలోనూ వ్యతిరేక పవనాలు బలంగా వీస్తున్నాయి. మరో రెండున్నరేండ్లలో లోక్‌సభ ఎన్నికలు జరుగనున్నాయి. దానికంటే ముందు ఉత్తరాదిలో పలు రాష్ర్టాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగబోతున్నాయి. ముఖ్యంగా యూపీని నిలుపుకోవటం బీజేపీకి అత్యావశ్యకం. యూపీలో ఆదిత్యనాథ్‌కు సానుకూలంగా పరిస్థితులు లేవు. ప్రతిపక్ష నేత అఖిలేశ్‌యాదవ్ ఎన్నికల సభలకు జనం పోటెత్తుతున్నారు. సాగుచట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమించిన రైతులు ప్రధానంగా యూపీ, పంజాబ్‌లకు చెందినవాళ్లే.
ఇటీవల దేశవ్యాప్తంగా 13 రాష్ర్టాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బలు తగిలాయి. 23 అసెంబ్లీస్థానాల్లో పోటీ చేసి కేవలం ఏడు సీట్లను, మూడు పార్లమెంటు స్థానాల్లో పోటీ చేసి ఒక్క సీటును మాత్రమే బీజేపీ గెల్చుకుంది. పలు సిట్టింగ్ స్థానాలను చేజార్చుకుంది. అధికారంలో ఉన్న హిమాచల్‌ప్రదేశ్‌లో చిత్తుగా ఓడిపోయింది. బెంగాల్లోనైతే మూడు చోట్ల డిపాజిట్లు కూడా దక్కించుకోలేక పరాభవం మూటగట్టుకుంది. ప్రధాని తాజా నిర్ణయం వెనుక ఈ ఉప ఎన్నికల ఫలితాలు కీలకంగా నిలిచాయి.
2014లో బీజేపీ నేతృత్వంలో తిరుగులేని రాజకీయశక్తిగా కనిపించిన ఎన్డీఏ.. నేడు జేడీయూ తప్ప మరో భాగస్వామి లేక వెలవెలబోతున్నది. మోదీ, షా ద్వయం వేసిన ఎత్తులు.. విపక్షాలు ఒక్కటై ప్రతిఘటించే పరిస్థితిని సృష్టించాయి.
మసకబారుతున్న మోదీ ప్రతిష్ఠ నేపథ్యంలో విధానాల్ని సమీక్షించుకోవాలని కేంద్ర సర్కారు పెద్దలను ఆరెస్సెస్ హెచ్చరించినట్లు తెలుస్తున్నది. ప్రత్యర్థులు సహనం కోల్పోయేంతగా వేధిస్తూ వారు ఐక్యమయ్యే పరిస్థితిని సృష్టించటం, ప్రాంతీయ పార్టీల నేతలను దూరం చేసుకోవటం వంటివి పూర్తి స్వయంకృతాపరాధాలని ఆరెస్సెస్ స్పష్టం చేసినట్లు సమాచారం. వచ్చే యూపీ ఎన్నికల్లో ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తున్నది.