న్యూఢిల్లీ: కేంద్రం రూపొందించిన విద్యుత్తు (సవరణ)బిల్లు-2025, విత్తన బిల్లు-2025లకు వ్యతిరేకంగా పంజాబ్లో నిరసనలు హోరెత్తాయి. సోమవారం సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్కేఎం) నాయకులు నిరసనలకు పిలుపునివ్వగా, రాష్ట్ర ప్రభుత్వ విద్యుత్తు ఉద్యోగులు కూడా నిరసన ర్యాలీల్లో పాల్గొన్నారు. ముసాయిదా బిల్లులను కేంద్రం వెంటనే ఉపసంహరించుకోవాలని రైతులు, విద్యుత్తు ఉద్యోగులు కేంద్రాన్ని డిమాండ్ చేశారు. నిరసనకారులు పంజాబ్లో పలుచోట్ల రైలు పట్టాలను దిగ్బంధించారు.
మొహాలీ, హోషియార్పూర్, ముకేరియన్, దాసుయా, షామ్ చౌరాసి, మర్నేయన్ ఖుర్ద్లలో రాష్ట్ర విద్యుత్తు కార్పొరేషన్ ‘పీఎస్పీసీఎల్’ ఎదుట విద్యుత్తు ఉద్యోగులు పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. కేంద్రం రూపొందించిన ముసాయిదా బిల్లులు విద్యుత్తు రంగాన్ని ప్రైవేటీకరించడానికి దారితీస్తుందని, వినియోగదారులపై భారాన్నీ మోపుతుందని ఆరోపించారు. రద్దు చేసిన మూడు సాగు చట్టాల్లోని నిబంధనలను మరో రూపంలో తీసుకువచ్చేందుకు చేస్తున్న ప్రయత్నంగా ‘విత్తన బిల్లు’ను వారు పేర్కొన్నారు.