కాళేశ్వరం, ఆగస్టు 18 : మేడిగడ్డ బరాజ్ బ్యాక్ వాటర్ ముంపు పరిహారం ఇప్పిస్తానంటూ తమ నుంచి ఓ కాంగ్రెస్ నాయకుడు రూ. 10 లక్షలు వసూలు చేశారని రైతులు ఆరోపించారు. ఈ మేరకు రైతులు మంగళవారం కన్నెపల్లిలో ప్రెస్‌మీట్ పెట్టి వివరాలు వెల్లడించారు. 2020లో మేడిగడ్డ బరాజ్ బ్యాక్ వాటర్ కారణంగా తమ భూములు ముంపునకు గురవుతాయని, ఎంజాయ్మెంట్ సర్వేలో వాటిని ఉన్నట్టు చూపించి పరిహారం ఇప్పిస్తానని కన్నెపల్లికి చెందిన లోకుల పోశం నమ్మించాడని తెలిపారు. 13 మంది రైతుల నుంచి విడతల వారీగా రూ.10 లక్షలు తీసుకున్నాడని చెప్పారు. సంవత్సరాలు గడుస్తున్నా పరిహారం ఇప్పించకపోగా, తమ వద్ద తీసుకున్న సొమ్ము తిరిగి చెల్లించకుండా కాలయాపన చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. సమస్యను మంత్రి శ్రీధర్‌బాబు దృష్టికి తీసుకెళ్లినప్పటికీ తమకు న్యాయం జరుగలేదని వాపోయారు.
రైతుల నుంచి ముంపు పరిహారం ఇప్పిస్తానంటూ డబ్బులు వసూలు చేశానన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవం. రాజకీయ కక్షతోనే స్థానిక సర్పంచ్, మరికొందరు తప్పుడు ఆరోపణలు చేయిస్తున్నారు. మేడిగడ్డ బరాజ్‌లో నీటి నిల్వపై ఎన్డీఎస్ఏ సూచనల మేరకే నిర్ణయం జరిగింది. భూములు ముంపునకు గురికాక పరిహారం మంజూరు కాలేదు. జనరల్ స్థానంలో సర్పంచ్‌గా పోటీ చేయడాన్ని కొందరు జీర్ణించుకోలేక తప్పుడు ప్రచారం చేస్తున్నారు. -లోకుల పోశం