హైదరాబాద్, ఆగస్టు 18(నమస్తే తెలంగాణ): రాష్ట్రంలో అత్యంత వివాదాస్పదంగా మారిన 22-ఏ నిషేధిత భూముల వ్యవహారానికి రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డే ప్రధాన కారణమని రెవెన్యూ, రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులు సీఎం రేవంత్‌రెడ్డి తేల్చి చెప్పినట్టు అత్యంత విశ్వసనీయంగా తెలిసింది. ఆయనే సమస్యను మరింత జటిలం చేశారని చెప్పినట్టు సమాచారం. నిషేధిత భూముల వివాదంపై ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మంగళవారం రెవెన్యూ, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ ఉన్నతాధికారులతో కీలక సమీక్ష నిర్వహించారు.
అయితే ఈ సమీక్ష తర్వాత సీఎం రేవంత్‌రెడ్డి రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి లోకేశ్‌కుమార్, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రాజీవ్‌గాంధీ హనుమంతుతో ప్రత్యేకంగా సమావేశమయ్యారని తెలిసింది. ఈ సందర్భంగా అసలు 22-ఏ నిషేధిత భూముల సమస్య ఏమిటి?, ఈ సమస్య ఎందుకు ఉత్పన్నమైంది?, ఈ పరిస్థితికి కారణం ఎవరు? అని సీఎం ఆరా తీశారట. ఒక దశలో ఈ ఇద్దరు అధికారులపై రేవంత్‌రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేసినట్టు తెలిసింది. ఊహించని విధంగా కఠిన చర్యలు తీసుకుంటానని హెచ్చరించినట్టు తెలిసింది.
దీంతో ఇద్దరు అధికారులు కూడా ఉన్నది ఉన్నట్టు సీఎం ముందు కుండబద్దలు కొట్టినట్టు చెప్పారని తెలిసింది. ఈ సమస్యకు ప్రధాన కారణం మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి అని, ఆయన వ్యవహారశైలి వల్లే పరిస్థితి ఇంతవరకు వచ్చిందని చెప్పినట్టు తెలిసింది. తమ పనిని సరిగ్గా చేసుకోనివ్వలేదని, ఎప్పుడూ కస్సుబుస్సుమనడం, అధికారులను ఏకవచనంతో తిట్టడం, తాము చెప్పేది వినకుండానే, ఆయనే తిరిగి ఆదేశాలిచ్చేవారని, దీంతో పరిస్థితి చేయి దాటిపోయిందని పూసగుచ్చినట్టు వివరించినట్టు సమాచారం. నిషేధిత భూముల జాబితాపై ఎప్పుడు కూడా ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించలేదని, జాబితా తయారీలోనూ గందరగోళం సృష్టించారని చెప్పినట్టు తెలిసింది.