
కేతేపల్లి, డిసెంబర్ 13: రైతుల గురించి ఆలోచించే సీఎం.. కేసీఆర్ అని, ఆయన చెప్పిన పంటలనే వేయాలని నిర్ణయించుకొన్నామని చెప్తున్నారు నల్లగొండ జిల్లా కేతేపల్లి మండలం చెర్కుపల్లి రైతులు. గ్రామంలో జరిగిన ఓ పెండ్లికి హాజరైన నకిరేకల్ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య తిరుగు ప్రయాణంలో ఆరుతడి పంటలు సాగు చేస్తున్న రైతులు బయ్య మల్లయ్య, మున్న నాగమ్మ, మున్న సౌడమ్మ వద్దకు వెళ్లి మాట్లాడారు. ఈ సందర్భంగా ఆ రైతులు.. ‘సీఎం కేసీఆర్ సార్ చెప్పినట్టు ఈ యాసంగిలో ఆరుతడి పంటలను సాగు చేస్తున్నాం. ముఖ్యమంత్రి మాటను గౌరవించి..ఆయన చెప్పిన పంట వేయాలని నిర్ణయించుకున్నం’ అని ఎమ్మెల్యేతో చెప్పారు. కేంద్రంలో ఉన్న బీజేపోళ్లు దొడ్డు వడ్లు కొనబోమంటూ ఇబ్బందులు పెడ్తున్నరని, రాష్ట్ర రైతులను ఆగం చేస్తున్నదని అన్నారు. ‘మన సీఎం సార్ టీవీల్లో, పేపర్లలో చెప్పినట్టు చేద్దామని కందులు, శనగలు, కుసుమ, పెసర్లు సాగు చేస్తున్నం. రైతుల మేలు కోరి మాట్లాడే సీఎం కేసీఆర్ మాటను జవదాటకుండా ఆరుతడి పంటలనే సాగు చేస్తున్నాం’ అని వ్యాఖ్యానించారు. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలో ఏ ఒక్క రైతు కూడా నష్టపోవద్దన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమని తెలిపారు. నేలల స్వభావాన్ని బట్టి ఆరుతడి పంటలను సాగు చేయాలని రైతులకు సూచించారు.