Bala Krishna | టాలీవుడ్ స్టార్ హీరో, హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ అనారోగ్యానికి గురయ్యారనే విషయాన్ని ఆంధ్రప్రదేశ్ మంత్రి పయ్యావుల కేశవ్ అధికారికంగా వెల్లడించారు. 2025 సెప్టెంబర్ 10న అనంతపురంలో కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన ‘సూపర్ సిక్స్ – సూపర్ హిట్’ సభలో పయ్యావుల కేశవ్ మాట్లాడుతూ.. “ఈ సభకు బాలయ్యగారు, నారా లోకేష్ రావాల్సింది. అయితే కాస్త అనారోగ్యంతో ఉన్న కారణంగా బాలకృష్ణ రాలేకపోయారు,” అని తెలిపారు. ఈ ప్రకటనతోనే బాలయ్య అభిమానుల్లో ఆందోళన మొదలైంది. సోషల్ మీడియాలో ‘‘బాలయ్య ఆరోగ్యం ఎలా ఉంది?’’, ‘‘ఎక్కడ చికిత్స తీసుకుంటున్నారు?’’ అంటూ ప్రశ్నలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ఇప్పటివరకు బాలకృష్ణ ఆరోగ్యంపై ఎటువంటి అధికారిక బులెటిన్ వెలువడలేదు.
ఈ సందర్భంగా నారా లోకేష్ సభకు హాజరుకాకపోవడానికి గల కారణాన్ని కూడా పయ్యావుల వివరించారు. నేపాల్లో చోటు చేసుకున్న హింసాత్మక ఘటనల కారణంగా అక్కడ చిక్కుకుపోయిన భారతీయులు, ముఖ్యంగా తెలుగువారి రక్షణ కోసం లోకేష్ కృషి చేస్తున్నారని తెలిపారు. ‘‘లోకేష్ సచివాలయం నుండి నేపాల్ పరిస్థితులను మానిటర్ చేస్తున్నారు. అందుకే సభకు రావడం సాధ్యపడలేదు,’’ అని ఆయన వెల్లడించారు. కాని బాలయ్య ఆరోగ్యానికి ఏం జరిగింది అనే విషయంపై క్లారిటీ ఇవ్వకపోవడంతో అభిమానుల్లో టెన్షన్ మొదలైంది. ఆయన ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది అని తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు ఫ్యాన్స్.
సినీ, రాజకీయ రంగాలని బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు సాగుతున్న బాలయ్య, హిందూపురం నుంచి వరుసగా మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. సినిమాల పరంగా కూడా ఇటీవల నాలుగు వరుస విజయాలు అందుకున్నారు. భారీ మాస్ ఫాలోయింగ్ కలిగిన బాలయ్య త్వరలో అఖండ 2 చిత్రంతో ప్రేక్షకులని పలకరించబోతున్నారు. ఈ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుండగా, మూవీపై మాత్రం భారీ అంచనాలే ఉన్నాయి.