కులకచర్ల, నవంబర్ 2 : కుటుంబ కలహాలు నలుగురిని బలిగొన్నది. ఈ దారుణ ఘటన వికారాబాద్ జిల్లా కులకచర్ల మండల కేంద్రంలో ఆదివారం తెల్లవారుజామున చోటుచేసుకున్నది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కులకచర్లకు చెందిన వేపూరి యాదయ్య(38), అలివేలు(34) దంపతులు. వీరికి అపర్ణ, శ్రావణి ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. దంపతులు తరచూ గొడవ పడేవారు. తమ మధ్య తగాదాలకు వదిన (భార్య అక్క) హన్మమ్మ కారణమంటూ ఆమెపైనా కక్షపెంచుకున్నాడు. రెండు రోజుల క్రితం కూడా దంపతుల మధ్య గొడవ జరిగింది.
ఈ క్రమంలో చెల్లెలి కాపురం చక్కదిద్దాలని భావించిన హన్మమ్మ వారి ఇంటికి వచ్చింది. కుటుంబ కలహాలు సరికాదని హన్మమ్మ యాదయ్యకు చెప్పేందుకు ప్రయత్నించింది. శనివారం రాత్రి ఇంట్లో భోజనం చేసిన తరువాత భార్య అలివేలు, పిల్లలు అపర్ణ, శ్రావణి(10), వదిన హన్మమ్మ నిద్రపోయారు. పక్క గదిలో నిద్రిస్తున్నట్టు నటించిన యాదయ్య వారు నిద్రలోకి జారుకోగానే.. పథకం ప్రకారం ముందుగా తన వదిన హన్మమ్మ(40)ను, తర్వాత భార్య అలివేలు(34)ను కత్తితో నరికాడు. అంతటితో ఆగకుండా మీరు ఇద్దరు ఉండి ఏం చేస్తారంటూ పెద్ద కూతురు అపర్ణ, చిన్న కూతురు శ్రావణి(10) పైనా దాడి చేశాడు.
పెద్ద కూతురిపై కత్తితో రెండుసార్లు వేటు వేయగా అక్కడి నుంచి చాకచక్యంగా బయటికెళ్లి ప్రాణాలను కాపాడుకున్నది. శ్రావణి అప్పటికే చనిపోయింది. అపర్ణ వెంటనే పక్కనే ఉన్న వారి బంధువు ప్రభు దగ్గరకు వెళ్లి చెప్పింది. వారిద్దరు కలిసి ఇంట్లోకెళ్లి చూడగా సీలింగ్ ఫ్యాన్‌కు యాదయ్య ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రభు వెంటనే 100 నంబర్‌కు డయల్ చేసి సమాచారం ఇచ్చాడు. డీఎస్పీ శ్రీనివాస్ వెంటనే ఘటనా స్థలానికి చేరుకొని నలుగురి మృతదేహాలను పోర్టుమార్టం నిమిత్తం పరిగి మార్చురీకి తరలించారు.
గాయపడిన అపర్ణ దవాఖానలో చికిత్స పొందుతున్నది. అలివేలు అన్న గోపాల్ ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్టు కులకచర్ల ఎస్సై రమేశ్‌కుమార్ తెలిపారు. ప్రాణాలతో బయటపడ్డ పెద్ద కూతురు అపర్ణ మాట్లాడుతూ.. చూస్తుండగానే పెద్దమ్మ, తల్లి, చెల్లినీ నాన్న కత్తితో నరికి చంపినట్టు తెలిపింది. తనపైనా దాడి చేయడంతో అక్కడి నుంచి తప్పించుకుని బయటికొచ్చినట్టు పేర్కొంది. కొంతకాలంగా తల్లిదండ్రుల మధ్య గొడవలు జరుగుతున్నాయని తెలిపింది.