హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలో ప్రైవేట్ జూనియర్ కాలేజీలు అనుమతి కోసం దొంగ సర్టిఫికెట్లు సమర్పించిన వ్యవహారం అనేక మలుపులు తిరుగుతున్నది. రెండేండ్లుగా ఈ తతంగం నడుస్తున్నా అధికారులు గుర్తించలేకపోయారు. ఇంటర్‌బోర్డుకు.. విద్యాశాఖ మంత్రి చైర్మన్. కాగా ప్రస్తుతం విద్యాశాఖ ముఖ్యమంత్రి వద్ద ఉన్న సంగతి తెలిసిందే. సీఎం రేవంత్‌రెడ్డి చైర్మన్‌గా ఉన్న ఇంటర్బోర్డులో ఫేక్ ఫైర్ ఎన్వోసీల స్కామ్ ప్రకంపనలు సృష్టిస్తున్నది. ఒకటి కాదు.. రెండు కాదు ఏ కంగా 52 కాలేజీలు ఫేక్ ఎన్వోసీలు సమర్పించడం ఇంటర్బోర్డులో కలకలం రేపింది. గ్రేటర్ పరిధిలో 142 కాలేజీల్లో 52 కాలేజీలు ఫేక్ సర్టిఫికెట్లు సమర్పించినట్టు హైడ్రా తేల్చింది. అ యితే ఫేక్ ఎన్వోసీలు సమర్పించిన కాలేజీలపై చర్యలు తీసుకొనేందుకు ఇంటర్‌బోర్డు మీనమేషాలు లెక్కిస్తున్నదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
దొంగ సర్టిఫికెట్లు సమర్పించిన ప్రైవేట్ జూనియర్ కాలేజీల అఫిలియేషన్‌ను పెండింగ్‌లో పెట్టిన ఇంటర్‌బోర్డు ఒరిజినల్ ఫైర్ ఎన్వోసీ తెస్తే గుర్తింపునిస్తామంటున్నది. తప్పు చేసిన కాలేజీలపై చర్యలు తీసుకోవాల్సింది పోయి.. మళ్లీ పైర్ ఎన్వోసీ తెస్తే అనుమతినిస్తామనడమేంటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇలా అనుమతి ఇవ్వడమంటే దొంగ చేతికి తాళాలివ్వడమే అవుతుందన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఫేక్ ఎన్వోసీల వ్యవహారంలో కంచె చేను మేసిన చందంగా కొందరు వ్యవహరించినట్టు తెలిసింది. కాసులకు కక్కుర్తిపడిన హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి జిల్లాలకు చెందిన కొందరు అధికారుల పాత్రపై విచారణ జరుపాలని అధ్యాపక సంఘాల నేతలు డిమాండ్ చేస్తున్నారు. అనుమతి ఒక పేరుతో.. క్లాసులు మరో పేరుతో నడుస్తున్న కాలేజీకి ఓ అధికారి పరోక్షంగా అండదండలందిస్తున్నట్టు టాక్. ఇందుకు ప్రతిఫలంగా రెండు హాస్టళ్లను అధికారి కుటుంబసభ్యులు నిర్వహిస్తున్నారట. గ్రేటర్ జిల్లాల్లోని ఓ కాలేజీలో 90 మంది విద్యార్థులే ఉండగా, ఈ కాలేజీకి అనుమతినిచ్చేందుకు రూ.2 లక్షలు అడిగినట్టు ఆరోపణలున్నాయి. ఓ అధికారి కాలేజీ నిర్వాహకులను హోటళ్లకు పిలిపించుకొని లంచాలు పుచ్చుకుంటున్నట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి.
దొంగ సర్టిఫికెట్ల వ్యవహారం గతంలో వివాదాలకు దారితీసిన గ్లోబరినా కంటే మించిన స్కామ్. ఫేక్ సర్టిఫికెట్లు సమర్పించిన కాలేజీలపై చర్యలు తీసుకోవాలి. కాలేజీలను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాలి. క్రిమినల్ కేసులు నమోదు చేయడమే కాకుండా ఈ వ్యవహారంపై సీబీసీఐడీ, విజిలెన్స్ చేత విచారణ జరిపించాలి.
హైదరాబాద్, ఆగస్టు 6 (నమస్తే తెలంగాణ) : హైడ్రా, ఫైర్ సేఫ్టీ కమిషనర్ల సంతకాలు ఫోర్జరీ చేసి ఎన్వోసీ సర్టిఫికెట్లు పొందిన ఇంటర్ కళాశాలలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఏఐఎస్ఎఫ్ డిమాండ్ చేసింది. బాధ్యతగల అధికారుల సంతకాలు ఫోర్జరీ చేసిన ఆయా కళాశాలల గుర్తింపును వెంటనే రద్దు చేయాలని ఆ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కసిరెడ్డి మణికంఠరెడ్డి, ప్రధాన కార్యదర్శి పుట్ట లక్ష్మణ్ డిమాండ్ చేశారు. నకిలీ ఎన్వోసీలు పొందిన కళాశాలల యాజమాన్యాలపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని కోరారు.