న్యూఢిల్లీ, అక్టోబర్ 4: పప్పు, ఉప్పు దగ్గర నుంచి ఫోన్, ల్యాప్‌టాప్ వరకు ఇప్పుడు చాలామంది ఆన్లైన్లోనే కొనుగోలు చేస్తున్నారు. ఇదే అదనుగా కొన్ని ఆన్లైన్ డెలివరీ సంస్థలు వివిధ చార్జీల పేరిట వినియోగదారులను దోచేస్తున్నాయి. దీనిపై సామాజిక మాధ్యమాల్లో ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై కేంద్రం స్పందించింది. క్యాష్ ఆన్ డెలివరీ (నగదు చెల్లించిన తర్వాతే సరకు బట్వాడా) ఆర్డర్స్‌పై అదనపు చార్జీలు వసూలు చేస్తున్నట్టు వచ్చిన ఆరోపణల మేరకు ఈ-కామర్స్ సంస్థలపై కేంద్రం అధికారికంగా దర్యాప్తు ప్రారంభించింది. ఇది వినియోగదారులను తప్పుదారి పట్టించే, దోపిడీ చేసే చీకటి నమూనాగా ప్రభుత్వం భావిస్తున్నది. హ్యాండ్లింగ్ చార్జీలు, ఇతర రుసుముల పేరిట జెప్టో, మరికొన్ని ఈ-కామర్స్ సంస్థలు సీవోడీ విధానంలో వినియోగదారుల నుంచి అదనపు చార్జీలు వసూలు చేస్తున్న విషయమై తమకు పలు ఫిర్యాదులు అందాయని వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషీ శుక్రవారం ఎక్స్‌లో పేర్కొన్నారు. దీనిపై సమగ్ర దర్యాప్తును ప్రారంభించామని, వాటి కార్యకలాపాలను నిశితంగా పరిశీలిస్తున్నామని చెప్పారు. ఈ-కామర్స్ వ్యాపారంలో వినియోగదారుల హక్కులను కాపాడేందుకు, పారదర్శకంగా, నిజాయితీగా లావాదేవీలు జరిగేందుకు నిబంధనలు ఉల్లంఘించే సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీనిచ్చారు. కాగా, వినియోగదారుల హక్కులను పరిరక్షించేందుకు ప్రభుత్వం 13 చీకటి నమూనాలను గుర్తించింది. వాటిని ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటున్నది.