రోజురోజుకూ చలి తీవ్రత పెరుగుతున్నది. ఈ పరిస్థితి శరీరంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. రక్తనాళాలు కుచించుకుపోయి.. రక్తం గడ్డకట్టే ప్రమాదం ఉంటుంది. సరైన జాగ్రత్తలు తీసుకోకుంటే.. సమస్య మరింత ముదురుతుంది. చలికాలం వచ్చిందంటే.. కొందరిలో కాళ్లు, చేతులు ముడుచుకు పోతుంటాయి. వేళ్లలో వాపు, దురద లాంటి సమస్యలు కనిపిస్తాయి. వాతావరణంలో చలి పెరగడమే ఇందుకు కారణం. రక్త ప్రసరణపై చలి ప్రభావం వల్లే ఇలాంటి సమస్యలు ఎదురవుతాయని నిపుణుల మాట. ముఖ్యంగా మహిళల్లో ఈ సమస్య ఎక్కువ ప్రభావం చూపుతుంది. తెల్లవారుజామునే లేవడం, చలిలో వాకిలి ఊడ్చడం, కల్లాపి చల్లడం లాంటి పనులు చేస్తుంటారు.
వంట గదిలోనూ కూరగాయలు కడగడం, అంట్లు తోమడం లాంటి నీటితో చేసే పనుల్లోనే రోజంతా తలమునకలై ఉంటారు. చలి తీవ్రత, చల్లని నీటి ప్రభావం వల్ల వారి శరీరంలో సిరలు కుంచించుకుపోతాయి. దాంతో రక్త ప్రసరణ నెమ్మదిస్తుంది. కొన్నిరోజులకు రక్తం గడ్డకట్టడం మొదలవుతుంది. ఫలితంగా.. కాళ్లు, చేతుల వేళ్లలో వాపు కనిపిస్తుంది. సమస్య ముదిరితే.. దురదతోపాటు నొప్పి కూడా వస్తుంది. దీనివల్ల రోజువారీ పనులలో తీవ్రమైన ఇబ్బంది కలుగుతుంది.
చలికాలంలో చాలామందిలో కాళ్లు, చేతులలో వాపు సాధారణంగానే కనిపిస్తుంది. అయితే, నిర్లక్ష్యం చేస్తే తీవ్రమైన సమస్యగా మారుతుంది. ఎక్కువ చలిగా ఉన్నప్పుడు బయటికి రాకపోవడమే మంచిది. కాళ్లు, చేతులను కప్పి ఉంచేలా వెచ్చని దుస్తులు ధరించాలి. శరీరం డీహైడ్రేషన్‌కు గురవడం వల్లకూడా ఈ సమస్య కనిపిస్తుంది. కాబట్టి, తగినంత నీరు తీసుకోవాలి. వేళ్ల వాపును తగ్గించడానికి చిన్నచిన్న స్ట్రెచెస్, వ్యాయామాలను ఆశ్రయించాలి. సమస్య మరీ తీవ్రంగా ఉంటే.. వైద్యులను సంప్రదించాలి.