ఎకరం పొలం ఉంటే ఏం పంట వేద్దాం, ప్లాట్లు చేస్తే ఎంత లాభమొస్తది? అని లెక్కలేసుకొనే రోజులివి. కానీ, జాతీయ రహదారికి ఆనుకొని తనకున్న 70 ఎకరాల భూమిని చెట్లు పెంచేందుకు, మూగజీవాలకు ఆవాసంగా మార్చేశారో ప్రకృతి ప్రేమికుడు. జీవరాశులకు ఆహారం, నీళ్లు అందించాలన్న సదుద్దేశంతో రూ.కోట్ల విలువ చేసే భూమిని అడవిగా మార్చేశారు. ఆయనే.. జలసాధన సమితి పేరుతో నల్లగొండ ఫ్లోరైడ్ నీటి సమస్యపై పోరాడిన దుశ్చర్ల సత్యనారాయణ.
హైదరాబాద్, నవంబర్ 1 (నమస్తే తెలంగాణ): చిన్నప్పటి నుంచే ప్రకృతి ప్రేమలో పడిపోయారాయన. మొక్కలు నాటడం అంటే అమితాసక్తి. పక్షులంటే ఎంతో ఇష్టం. సూర్యాపేట జిల్లా మోతె మండలం రాఘవపురానికి చెందిన దుశ్చర్ల సత్యనారాయణకు ఎనిమిదేండ్ల నుంచే ప్రకృతిపై మమకారం. 1977లో బ్యాంక్ ఉద్యోగంలో చేరి వివిధ బ్యాంకుల్లో వివిధ హోదాల్లో పనిచేశారు. కొన్నేండ్లు ఉద్యోగం చేశాక ప్రకృతిపై ప్రేమతో ఉద్యోగానికి రాజీనామా చేశారు. జాతీయ రహదారికి ఆనుకొని రాఘవాపురం స్టేజీ సమీపంలో తనకున్న 70 ఎకరాల భూమిలో అడవిని పెంచాలని నిర్ణయించుకొన్నారు. ఎంతో విలువ చేసే ఆ భూమిని అడవిగా మార్చేస్తానన్న ఆయన నిర్ణయానికి బంధుమిత్రులు అడ్డుచెప్పారు.
అయినా వినకుండా,ఆ భూమిలో అడవిని పెంచారు. ఐదెకరాల్లో పక్షులు, జంతువులకు ఉపయోగపడే పంటలను సాగుచేశారు. భూగర్భజలాల పెంపు, జంతువులు, పక్షుల తాగునీటికి 7 ప్రాంతాల్లో కుంటలు తవ్వించారు. కొన్ని చోట్ల బోర్లు వేయించారు. అడవిని సృష్టించడానికి సత్యనారాయణ ఏండ్ల పాటు శ్రమించారు. వివిధ ప్రాంతాలు తిరిగి విత్తనాలు, మొక్కలు తీసుకొచ్చి నాటారు. ఎక్కడెక్కడో తిరిగి నెమళ్లు, కుందేళ్లను తీసుకొచ్చి తన అడవిలో వదిలారు. కొన్ని వందల కోతులు అక్కడ తిరుగుతున్నాయి. తామర పువ్వులు పెంచటానికే ఏడు కుంటలు తవ్వించారు. మోదుగ, తుమ్మ, జిగినిక, మొండివేప, బలుసు, మైపూచి, రావి, జువ్వి, మర్రి, జామాయిల్, సుబాబుల్, బఠానీ, విష్ణుకాంతతో పాటు వందల రకాల చెట్లు ఇక్కడున్నాయి. అనేక వనమూలికలకు కూడా ఈ అడవి నిలయంగా మారింది.
పక్షులు, జీవరాశులకు నిలయం
దుశ్చర్ల సత్యనారాయణ అటవీ క్షేత్రం వివిధ రకాల పక్షులు, జీవరాశులకు నిలయంగా నిలిచింది. నెమళ్లు, కుందేళ్లు, పెద్దపిట్ట, నీటికోళ్లు, విషసర్పాలు, ఉడుతలు, వడ్రంగి పిట్టలు, బుర్కపిట్టలు, వలస పక్షులు, మూడు రకాల కొంగలు, కోతులు, రామచిలుకలు, ఎత్రింతలు, గువ్వలు, డేగలు, గుడ్లగూబలు, తేనేపిట్టలు, ముంగిసలు, రకరకాల చిలుకలు, లకుముకి పిట్టలు, తీతలు, వాన కోకిలలు ఈ అడవిలో ఉంటున్నాయి.
ఫ్లోరైడ్ విముక్తికి పోరాటం
ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజలు తీవ్ర ఫ్లోరైడ్ సమస్యతో ఇబ్బంది పడుతున్నారని తెలుసుకొని ఉద్యోగానికి రాజీనామా చేసి, ఆ సమస్య పరిష్కారానికి 1987లో జలసాధన సమితిని ప్రారంభించారు. ఏండ్ల పాటు స్వచ్ఛమైన నీటి కోసం ఉద్యమించారు. బాధితులను మాజీ ప్రధాని వాజ్పేయి దగ్గరికి తీసుకెళ్లి సమస్యను విన్నవించారు.
ప్రతి ఒక్కరూ పర్యావరణాన్ని కాపాడాలి
ప్రతి ఒక్కరూ పర్యావరణ పరిరక్షణకు పాటుపడాలి. నేను సృష్టించిన అడవిని ఎంతో మంది సందర్శిస్తున్నారు. పూర్తిగా చూడాలంటే వారం పడుతుంది. ఈ అడవిలో ఇతర ప్రాంతాల కంటే 4 నుంచి 5 డిగ్రీల ఉష్ణోగ్రత తక్కువగా ఉంటుంది. సీఎం కేసీఆర్ చేపట్టిన హరితహారంతో పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతున్నది.