జోగులాంబ గద్వాల: జిల్లాను డ్రగ్స్ రహిత ( Drug free) జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రతి పౌరుడు బాధ్యతగా కృషి చేయాలని జిల్లా కలెక్టర్ బీఎం సంతోష్ ( Collector Santosh) అన్నారు. మాదకద్రవ్యాల దుర్వినియోగం , అక్రమ రవాణా అంతర్జాతీయ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గురువారం జిల్లా మహిళా,శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీని ఎస్పీ శ్రీనివాసరావు ( SP Srinivas Rao) తో కలిసి ప్రారంభించారు.
అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ సమాజంపై మాదక ద్రవ్యాల వల్ల కలిగే దుష్పరిణామాలను ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు కృషి చేయాలన్నారు. ముఖ్యంగా డ్రగ్స్ వినియోగం వల్ల కలిగే దుష్పరిణామాలను విద్యార్థులు గుర్తించి అప్రమత్తంగా ఉండాలన్నారు. పాఠశాలలు, కళాశాలల్లో మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల నిరోధక కమిటీలను బలోపేతం చేయాలని సూచించారు.
మత్తుపదార్థాలు అమ్మే వారి గురించి సమాచారం అందించడం పౌరుల బాధ్యతగా పేర్కొన్నారు. డ్రగ్స్ బారిన పడిన యువతకు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రంలో మెరుగైన వైద్య చికిత్సలు అందిస్తున్నామని తెలిపారు. 17నుంచి 18 ఏళ్లలోపు యువత డ్రగ్స్ బారిన పడే అవకాశం ఎక్కువగా ఉన్నందున, ఈ దశలో వారికి సరైన మార్గదర్శకం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
జిల్లా ఎస్పీ శ్రీనివాస రావు మాట్లాడుతూ మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం ఈ దిశగా కఠినమైన చర్యలు తీసుకుంటోందని తెలిపారు. జిల్లా స్థాయిలో కూడా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో చర్యలు వేగవంతంగా కొనసాగుతున్నాయన్నారు. డ్రగ్స్ వల్ల యువత భవిష్యత్తు నాశనమవుతుందని వెల్లడించారు. ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ శాఖ అధికారిణి సునంద, డీఎంహెచ్వో సిద్ధప్ప, డీఎస్పీ మొగులయ్య, ఎక్సైజ్, పోలీస్, జిల్లా సంక్షేమ శాఖ, వివిధ శాఖల అధికారులు, పాఠశాల, కళాశాలల విద్యార్థులు, యువకులు, ప్రజా ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.