సూర్యాపేట : పట్టభద్రులైన ( Graduate ) ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కు నమోదు చేసుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి (Jagadish Reddy) కోరారు. పట్టభద్రుల (MLC) ఎన్నికలను పురస్కరించుకొని సూర్యాపేట జిల్లా కేంద్రం వాణిజ్య భవన్ సెంటర్లో ఓటర్ నమోదు కేంద్రాన్ని (హెల్ప్ డెస్క్) ఆయన ప్రారంభించి , సతీసమేతంగా ఓటు హక్కు నమోదు చేసుకున్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు, ప్రతిపక్షంలో ఉన్న బీఆర్ఎస్ పోరాట పటిమ ఎట్లా కొనసాగుతుందో ప్రతి పట్టభద్రుడు గమనించాలని సూచించారు. గతంలో ఉన్న గ్రాడ్యుయేట్ ఓటర్ లిస్టు పూర్తిగా రద్దయిం దని, పాత, కొత్త ప్రతి ఓటరు తప్పనిసరిగా తమ ఓటు నమోదు చేసుకోవాలని కోరారు.
ఉమ్మడి నల్లగొండ, ఖమ్మం, వరంగల్ జిల్లాల ఎమ్మెల్సీ ఓటు హక్కు కోసం బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రత్యేక హెల్ప్ డెస్క్ ప్రారంభించామని వెల్లడించారు. అందుకోసం కావలసిన అన్ని సౌకర్యాలు ఏర్పాటుచేశామని తెలిపారు. విశ్రాంత ఉద్యోగులు, ప్రస్తుత ఉద్యోగులు, నిరుద్యోగ యువత, వ్యాపారులు పట్టభద్రులైన ప్రతి ఒక్కరూ ఓటును నమోదు చేసుకోవాలని పిలుపునిచ్చారు.