చుంచుపల్లి, మే 13 : రైతులు పండించిన ప్రతి పంటను ఎలాంటి తరుగు లేకుండా పూర్తిస్థాయిలో కొనుగోలు చేయాలని తెలంగాణ రైతు సంఘం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రధాన కార్యదర్శి ముత్యాల విశ్వనాథం ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. చుంచుపల్లి మండలంలోని పెనగడప ఐకెపి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని తెలంగాణ రైతు సంఘం నాయకులు బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా విశ్వనాథం మాట్లాడుతూ.. కొనుగోలు కేంద్రంలో 5 కేజీల వరకు తరుగు తీస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని, ఇది రైతులకు నష్టాన్ని కలిగిస్తోందన్నారు. అలాగే వ్యవసాయ అధికారులు ఎఫ్ఏక్యూ ప్రమాణాలు వచ్చిన వడ్లనే కొనుగోలు చేయాలనే నిబంధనను ఎత్తివేసి గతంలో మాదిరిగానే తేమ శాతం ఉన్న ధాన్యాన్ని కూడా కొనుగోలు చేయాలని కోరారు. పీఆర్ రకాలకు చెందిన వడ్లను కొనుగోలు చేయడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని, ఈ విషయంలో అధికారులు మిల్లర్లతో చర్చించి రైతులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకోవాలన్నారు.
కొనుగోలు కేంద్రాల వద్ద సమయానికి లారీలు అందుబాటులో లేకపోవడం, హమాలీల కొరత కారణంగా ధాన్యం తరలింపులో తీవ్ర జాప్యం జరుగుతోందని తెలిపారు. ఐకెపి సిబ్బందికి సరైన అవగాహన లేకపోవడం వల్ల కొనుగోలు ప్రక్రియ ఆలస్యమవుతోందని, అనుభవం ఉన్న సిబ్బందితో కొనుగోలు బాధ్యతలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. రైతులను కేంద్రాల వద్ద రోజుల తరబడి వేచి ఉండే పరిస్థితి తలెత్తకుండా వెంటనే ధాన్యాన్ని లారీల ద్వారా మిల్లర్లకు తరలించాలని కోరారు. లేకపోతే వర్షాలు, గాలివానల వల్ల ధాన్యం తడిసి రైతులు నష్టపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అధికారులు వెంటనే స్పందించి రైతులకు ఇబ్బందులు లేకుండా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రైతు సంఘం జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ సలిగంటి శ్రీనివాస్, సర్పంచ్ కారం సీతారాములు, రైతులు అజ్గర్, కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు.