ముంబై, జూలై 8 : దేశవ్యాప్తంగా ఎలక్ట్రిక్ వాహనాలకు ప్రజల నుంచి విశేషస్పందన లభిస్తున్నది. గత నెలలో దేశీయంగా 1.80 లక్షల యూనిట్ల ఎలక్ట్రిక్ వాహనాలు అమ్ముడయ్యాయి. క్రితం ఏడాది ఇదే నెలలో అమ్ముడైన వాహనాలతో పోలిస్తే 28.60 శాతం అధికమని ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్ల అసోసియేషన్ (ఫాడా) తాజాగా వెల్లడించింది. ఈ-ప్యాసింజర్ వాహనాలకు డిమాండ్ అధికంగా ఉండటం ఇందుకు కారణమని తెలిపింది. ఎలక్ట్రిక్ ప్యాసింజర్ వాహన అమ్మకాలు 7,323 యూనిట్ల నుంచి 13,178 యూనిట్లకు చేరుకున్నాయి. మొత్తం వాహన విక్రయాల్లో ప్యాసింజర్ వాహనాల వాటా 4.4 శాతానికి ఎగబాకింది.
అలాగే 60, 550 యూనిట్ల ఎలక్ట్రిక్ త్రి-చక్ర వాహనాలు కాగా, 1,05,355 యూనిట్ల ద్విచక్ర వాహనాలు అమ్ముడయ్యాయి. కమర్షియల్ వాహనాలు ఏడాది ప్రాతిపదికన రెండింతలు పెరిగి 1,146 యూనిట్లకు చేరుకున్నాయి. పెట్రోల్ ధరలు గరిష్ఠ స్థాయిలో ఉండటంతో వాహన కొనుగోలుదారులు ఈవీలపై ఆసక్తి చూపుతున్నారని, అలాగే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ప్రత్యేక స్కీంలు కూడా ఆకట్టుకుంటున్నాయని ఫాడా ప్రెసిడెంట్ సీఎస్ విఘ్నేశ్వర్ తెలిపారు. చార్జింగ్ స్టేషన్లు అత్యధికంగా ఏర్పాటుకావడంతో చార్జింగ్ ఇబ్బందులు కూడా లేకుండా పోయాయన్నారు.