Vemula Prshant Reddy | హైదరాబాద్: మా ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ప్రవర్తనపై చర్చించి నిర్ణయం తీసుకునే ఎజెండా 29 నాటి మీటింగ్‌లో ఉంది. అసలు ఎథిక్స్ గురించి మాట్లాడే అర్హత సీఎం, మంత్రులకు ఉందా?
అని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి ప్రశ్నించారు. బుధవారం తెలంగాణ భవన్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. గత అసెంబ్లీ సమావేశాల్లో పాడి కౌశిక్ రెడ్డి వ్యవహారాన్ని ఎథిక్స్ కమిటీకి నివేదిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారని అన్నారు. రేవంత్ ఆ ప్రకటన చేసే టైమ్‌కు ఎథిక్స్ కమిటీ అనేదే లేదు. ఎథిక్స్ కమిటీ అనేది ప్రతిపక్ష సభ్యులపై చర్యలు తీసుకునేందుకు ఏర్పాటు చేశారా అని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.
ఆ రోజు పాడి కౌశిక్ రెడ్డి పక్కనే అసెంబ్లీలో ఉన్నాను. కడియం శ్రీహరిని ఉద్దేశించి మీది ఏ పార్టీ అని మాత్రమే కౌశిక్ రెడ్డి అన్నారు. కావాలనే కౌశిక్ రెడ్డి వ్యవహారాన్ని ఎథిక్స్ కమిటీకి నివేదించిన తీరును ఖండిస్తున్నాం అని అన్నారు. దానం నాగేందర్ శాసన సభలో సహచర సభ్యుడి తోలు తీస్తా, హైదరాబాద్‌లో ఎట్లా తిరుగుతారో చూస్తా అన్నాడు. కాంగ్రెస్ ఎమ్మెల్యే మందుల సామేల్ కత్తుల కోలాటం చేస్తామని అన్నారు. అదేవిధంగా పొన్నం ప్రభాకర్, షాద్ నగర్ శంకరయ్య సభ్య సమాజం హర్షించతగని రీతిలో అసెంబ్లీ లో హావభావాలు ప్రదర్శించారు. వేముల వీరేశం కూడా అసెంబ్లీలో అనుచితంగా ప్రవర్తించారు. సీఎం రేవంత్ రెడ్డి బట్టలు ఊడదీసి కొడతా, బడివే, చెట్టుకు కట్టేసి కొడతా, జూబిలీ బస్‌స్టేషన్ లో బిచ్చమెత్తుకోవాలి అని సభ్యులనుద్దేశించి ఎన్నోసార్లు అసభ్యంగా మాట్లాడారు. సీఎం, కాంగ్రెస్ ఎమ్మల్యేల మాటలు ఎథిక్స్ కమిటీకి కనిపించలేదా అని మండిపడ్డారు.
ముందుగా సీఎం రేవంత్ రెడ్డినే ఎథిక్స్ కమిటీ పిలిచి వివరణ కోరాలి. తర్వాతే కౌశిక్ రెడ్డిని విచారించాలి అని కోరారు. పాలక పక్షానికి ఓ న్యాయం ప్రతిపక్షానికి ఓ న్యాయమా.. ఎథిక్స్ కమిటీ పొలిటికల్ కమిటీగా మారకూడదు. మేం లేవనెత్తిన అంశాలన్నిటినీ ఎథిక్స్ కమిటీ కచ్చితంగా పరిశీలించాలి. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై చర్యలు ఉండవు కానీ ప్రతిపక్ష సభ్యులపై ఎథిక్స్ కమిటీతో చర్యలు తీసుకుంటారా అని దుయ్యబట్టారు. హై కోర్టు, సుప్రీం కోర్టు మొట్టికాయలు వేసినా సీఎం తీరు మారడం లేదు.
ఢిల్లీలో రాహుల్ గాంధీ రాజ్యాంగ రక్షణ అని తిరుగుతుంటే రేవంత్ రెడ్డి గల్లీలో రాజ్యాంగ భక్షణ చేస్తున్నారు విమర్శించారు. కాంగ్రెస్‌లో ఈ ద్వంద్వ ప్రమాణాలు ఎందుకు. ఎథిక్స్ గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్ కు ఉందా. అవినీతిపై రాజగోపాల్ రెడ్డి, చిన్నారెడ్డి చేసిన వ్యాఖ్యలపై విచారణ కమిషన్ వేసే ధైర్యం రేవంత్ రెడ్డికి ఉందా. కొండా సుస్మిత రేవంత్ సోదరుడి షెల్ కంపెనీ గురించి మాట్లాడారు. దాని మీద ఏసీబీ విచారణ చేసే దమ్ము రేవంత్ రెడ్డికి ఉందా అని ప్రశ్నించారు.
చిన్నారెడ్డి మేఘారెడ్డి టిక్కెట్ కోసం లంచం ఇచ్చారని ఆరోపణలు చేశారు. అపుడు పీసీసీ అధ్యక్షుడిగా రేవంత్ రెడ్డే ఉన్నారు. రేవంత్ రెడ్డి తన నిజాయితీని నిరూపించుకునేందుకు విచారణ కు సిద్ధం కావాలి. పీసీసీ అధ్యక్ష పదవి కోసం రేవంత్ రెడ్డి హై కమాండ్‌కు కోట్లు ముట్టజెప్పారని కోమటి రెడ్డి ఆరోపణలు చేశారు. దమ్ముంటే వీటిపై విచారణ కమిషన్ వేసుకో రేవంత్ రెడ్డి అని ప్రశాంత్ రెడ్డి హెచ్చరించారు. బిల్లుల చెల్లింపునకు కమీషన్లు తీసుకుంటున్న అనిరుధ్ రెడ్డిపై విచారణ చేయించాలి. ఫార్మా సిటీని రద్దు చేసి ఫ్యూచర్ సిటీ పేరుతో దందాలు చేస్తున్న సీఎం సోదరులపై విచారణ జరపాలి. 22 ఏ పేరు మీద బ్రోకర్ల అవతారమెత్తి ప్రజలను లంచాలతో పీడిస్తున్న వారిపై విచారణ చేపట్టాలి. హైడ్రా పేరు మీద పేదల ఇండ్లపై ప్రతాపం చూపుతున్న దానిపై విచారణ చేయాలి అని పేర్కొన్నారు.
ఆరు గ్యారంటీలు అమలు చేయని, దేవుళ్లపై ఒట్టు వేసి రైతు రుణమాఫీని పూర్తి చేయని, ఫీజు రీయిబర్స్మెంట్పై మాట తప్పిన సీఎం నైతికత గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. డైవర్షన్ రాజకీయాల్లో భాగంగా సీఎం ఇదంతా చేస్తున్నారని ఆరోపించారు. ఈ నెల 29న ఎథిక్స్ కమిటీ మీటింగ్‌కు హాజరవుతాం. సీఎం, మంత్రులను ముందు విచారణకు పిలవాలని డిమాండ్ చేస్తాం. ఇప్పటికైనా ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు మానుకుంటే మంచిదని హితవు పలికారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, పాడి కౌశిక్ రెడ్డి, డాక్టర్ కే సంజయ్, అనిల్ జాదవ్, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ పాల్గొన్నారు.