హుజూరాబాద్, అక్టోబర్ 30 (నమస్తే తెలంగాణ ప్రతినిధి): రాష్ట్రం లో అధికార టీఆర్ఎస్ను టార్గెట్ చేసే క్రమంలో కాంగ్రెస్ పత్తా లేకుం డా పోతున్నది. హుజూరాబాద్‌లో టీఆర్ఎస్ అభ్యర్థి గెలవకుండా చేసేందుకు తన ఉనికిని తానే దెబ్బతీసుకున్నది. బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్‌కు ఆ పార్టీ బహిరంగంగా మద్దతు పలికింది. ఉపఎన్నిక ప్రక్రియ మొదలైనప్పటి నుంచి బీజేపీకి మేలు చేసేలా ప్రయత్నించిన కాంగ్రెస్.. చివరికి పోలింగ్ రోజున శ్రేణులనూ సొంత పార్టీకి ఓటు వేయవద్దని చెప్పింది. కరీంనగర్ జిల్లాలోని ముఖ్య నేతలు స్వయంగా హుజూరాబాద్ కాంగ్రెస్ శ్రేణులకు ఫోన్లు చేసి బీజేపీకి మద్దతు ఇవ్వాలని చెప్పా రు. రాష్ట్రస్థాయి నుంచి ఈ ఆదేశాలు వచ్చినట్టు తమకు జిల్లా నేతలు చెప్పారని స్థానిక నాయకులు వెల్లడించారు. పోటీ టీఆర్ఎస్, బీజేపీ మధ్య ఉన్నదని, టీఆర్ఎస్ లక్ష్యంగా తమ నిర్ణయాలు ఉండాలని చెప్పినట్టు వివరించారు. దీంతో హుజూరాబాద్ నాయకులు, శ్రేణులు ఉపఎన్నికలో బీజేపీకి మద్దతు తెలిపారు. సొంత పార్టీ ఉనికిని పణంగా పెట్టి ప్రత్యర్థికి ఓట్లు వేశారు. ఉపఎన్నిక ఖరారైనప్పటి నుంచి కాంగ్రెస్ రాష్ట్ర నాయకత్వం బీజేపీకి మేలు చేసేలా నిర్ణయాలు తీసుకుంటూ వచ్చింది. నామినేషన్ దాఖలు చివరి రోజున కొత్త నేతను అభ్యర్థిగా ప్రకటించి, ప్రచారంలో మొక్కుబడిగా వ్యవహరించింది. రాష్ట్ర నాయకత్వంపై విమర్శలు రావడంతో తూతుమంత్రంగా మండల కేంద్రాల్లో సభలు పెట్టి ప్రచారాన్ని ముగించింది. సంప్రదాయ ఓట్లను కాపాడుకొనే ప్రయత్నం చేయలేదు. ఆ ఓట్లను బీజేపీ అభ్యర్థికి పడేలా పీసీసీ వ్యవహరించింది. టీడీపీ నుంచి వచ్చి పీసీసీ అధ్యక్షుడైన రేవంత్ ఇలాంటి నిర్ణయాలు తీసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రంలో ప్రధాన ప్రత్యర్థి గా ఉండే బీజేపీకి మేలుచేసేలా, కాంగ్రెస్ ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని సొంత పార్టీ నేతలే ఆరోపిస్తున్నారు. రేవంత్ సొంత లాభం కోసం హుజూరాబాద్‌లో ఓటు బ్యాంకును దెబ్బతీశారని చెప్తున్నారు. అభ్యర్థి ప్రకటనతో ఇది మొదలైందని, పోలింగ్ రోజు పార్టీ ఆదేశాలతో ఇది స్పష్టమైందని అంటున్నారు. బీజేపీ అభ్యర్థితో మిలాఖత్ అయ్యి బలహీన అభ్యర్థిని దింపేలా రాష్ట్ర నాయకత్వం వ్యవహరించిందని చెప్తున్నారు. పీసీసీకి కొత్త అధ్యక్షుడు వచ్చాక జోష్ కాకుండా క్యాడర్ ఆగమైపోయే పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.