హైదరాబాద్, ఆగస్టు 18 (నమస్తే తెలంగాణ) : సీఎం రేవంత్రెడ్డి రాష్ట్రంలో ల్యాండ్ బ్రోకరింగ్కు పాల్పడుతున్నారని బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ ఆరోపించారు. రాష్ట్ర ప్రభుత్వం రియల్ ఎస్టేట్ బ్రోకర్లా మారిందని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా రేవంత్రెడ్డి ఆ బ్రోకరింగ్ను బంద్ చేయాలని హితవు పలికారు. బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడారు. మల్కాజిగిరి పరిధిలో 22 వేల ఎకరాలను 22-ఏ నిషేధిత జాబితాలో పెట్టారని తెలిపారు. పేదల వ్యవసాయ భూములు, ఇండ్లనూ నిషేధిత జాబితాలో పెట్టడం దారుణమని పేర్కొన్నారు. ప్రైవేట్ భూములను ప్రభుత్వ భూములుగా చిత్రీకరిస్తూ దోచుకోవాలని కాంగ్రెస్ నేతలు కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు.
కాంగ్రెస్ సర్కార్ తీసుకొచ్చిన భూభారతి.. రైతాంగాన్ని అగాధంలోకి నెట్టిందని ధ్వజమెత్తారు. ప్రభుత్వం లేఅవుట్లు చేసి విక్రయించిన భూములనూ 22ఏలో చేర్చడమేంది? అని మండిపడ్డారు. ప్రైవేట్ వ్యక్తులు కబ్జా చేసిన భూములకు హక్కులు కల్పిస్తూ.. ప్రభుత్వ భూముల్లో తరతరాలుగా సాగులో ఉంటున్న వారి భూములనూ గుంజుకుంటూ సీఎం రేవంత్ భూదందాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. పేదల భూములను గుంజుకోవడం ఆపి, పరిపాలనపై దృష్టి సారించాలని సూచించారు. రాష్ట్రంలో జరుగుతున్న ఈ భూదందాపై కేంద్ర దర్యాప్తు సంస్థలకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు.