Rice ATM | హైదరాబాద్, ఆగస్టు 12(నమస్తే తెలంగాణ):రాష్ట్రంలో ‘రైస్ ఏటీఎం’లను ఏర్పాటు చేసేందుకు కసరత్తు జరుగుతున్నది. తొలుత గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో వీటిని ఏర్పాటు చేయనున్నట్టు సమాచారం. ఇందుకోసం ఇప్పటికే దాదాపు 20 మంది రేషన్ డీలర్లను ఢిల్లీకి పంపి, శిక్షణ ఇప్పించినట్టు తెలిసింది. రేషన్ బియ్యం పంపిణీ విధానాన్ని మార్చడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం రైస్ ఏటీఎంను ప్రవేశపెట్టింది. 3 రోజుల క్రితం ఒడిశాలో ప్రయోగాత్మకంగా దీన్ని ప్రారంభించారు. దశలవారీగా దేశమంతటా ఏర్పాటు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగానే తెలంగాణలోనూ రైస్ ఏటీఎంలను ప్రవేశపెట్టనున్నట్టు తెలిసింది.
ఎలా పనిచేస్తుందంటే..
ఏటీఎం నుంచి డబ్బులు తీసుకునేందుకు పిన్ నంబర్ ఎంటర్ చేసినట్టుగా రైస్ ఏటీఎం లో రేషన్‌కార్డు నంబర్‌ను ఎంటర్ చేయగానే కుటుంబసభ్యుల సంఖ్య ఆధారంగా రేషన్ బియ్యం వస్తాయి. రైస్ ఏటీఎంలను ఏర్పాటు చేస్తే ప్రజల నుంచి వ్యతిరేకత వ్యక్తం కావచ్చని ప్రభుత్వం భావిస్తున్నది. అందుకే రైస్ ఏటీఎంల ఏర్పాటు అంశాన్ని గోప్యంగా ఉంచుతున్నది. ఇటీవల దాదాపు 20 మంది రేషన్ డీలర్లను ఢిల్లీకి తీసుకెళ్లి రహస్యంగా శిక్షణ ఇప్పించినట్టు సమాచారం. కానీ, విషయం బయటకు తెలియడంతో మల్టీస్టోర్ షాపులను కొనసాగించేందుకు అవసరమైన శిక్షణ ఇప్పించినట్టు అధికారులు చెప్తున్నారు. దీంతో ఆ మాత్రం దానికి ఢిల్లీ వరకు తీసుకెళ్లి శిక్షణ ఇప్పించాల్సిన అవసరం ఏమొచ్చిందని పలువురు రేషన్ డీలర్లు ప్రశ్నిస్తున్నారు.