RTC Driver Shankar Goud | ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతి పట్ల మాజీ ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ ఎర్రోళ్ల శ్రీనివాస్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. “శంకర్ గౌడ్ ది ఆత్మహత్య కాదు, ముమ్మాటికి అది ప్రభుత్వ హత్యే” అని అన్నారు. ప్రభుత్వ మొండి వైఖరి వల్లే కార్మికులు బలి అవుతున్నారని మండిపడ్డారు.
శంకర్ గౌడ్ ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు ఈ కష్ట సమయంలో దేవుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని ప్రార్థించారు. ఆర్టీసీ కార్మికులు ఎవరూ ఆందోళన చెందవద్దని, క్షణికావేశంలో బలవన్మరణాల వంటి నిర్ణయాలు తీసుకోవద్దని ఆయన విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వం వెంటనే స్పందించి, ఆర్టీసీ కార్మికులను చర్చలకు పిలవాలని డిమాండ్ చేశారు. వారి సమస్యలను తక్షణమే పరిష్కరించాలన్నారు. కార్మికులు చేస్తున్న పోరాటానికి బీఆర్ఎస్ (BRS) పార్టీ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. కార్మికుల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటం ఆడటం ఆపాలని సూచించారు. ఇప్పటికైనా చర్చల ద్వారా సమస్యలను పరిష్కరించి, మరిన్ని ప్రాణాలు పోకుండా చూడాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని స్పష్టం చేశారు.