గజ్వేల్, సెప్టెంబర్ 18: సిద్దిపేట జిల్లా ఎర్రవల్లి దళితులు సాగు చేసుకుంటున్న సర్వే నంబర్ 325లోని 388 ఎకరాల్లో శుక్రవారం రెండోరోజు కూడా రెవెన్యూ అధికారులు పోలీస్ బందోబస్తు మధ్య సర్వే చేపట్టారు. వ్యవసాయ పొలాల వద్ద సర్వే చేసేందుకు వచ్చిన అధికారులతో రైతులు మాట్లాడుతూ.. ప్రాణాలు పోయినా తమ భూములు ఇచ్చేదిలేదని తెగేసి చెప్పారు. తాతల కాలం నాటి నుంచి సాగు చేసుకుంటున్న భూములను కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొని మరెవరికో ఇస్తామంటే మేమెట్లా ఊరుకుంటామని మండిపడ్డారు.
రాళ్లు, రప్పలు, గుట్టలు ఉన్న బీడు భూములను చదును చేయించి పంటలు వేసుకునేలా నీళ్ల సౌకర్యం కల్పించిన కేసీఆర్ తమకు మంచి చేశారు తప్ప, ఆయన తమ భూముల జోలికి రాలేదని స్పష్టంచేశారు. ఇప్పుడు పంటలు పండుతున్నయంటే కేసీఆర్ చలువేనని కృతజ్ఞతాభావం వ్యక్తంచేశారు. కేసీఆర్ వ్యవసాయ భూమి రోడ్డుకు అవతల వైపున ఉంటే, తమకు గతంలో ప్రభుత్వం ఇచ్చిన భూములు ఇవతల వైపున ఉన్నాయని వివరించారు. ‘సారు భూమికి, మాకు చాలా దూరం. పాండురంగ చెరువును మరమ్మత్తు చేసి కాలువ తీసి నీళ్లు అందించడంతోనే పంటలు సాగవుతున్నాయి. కేసీఆర్ చొరవతోనే భూమి అంతా సారవంతంగా మారింది.
ఆయన కృషితో నేడు దళితులం పంటలేసుకొని బతుకుతున్నం’ అని చెప్పారు. శుక్రవారం తెల్లవారుజాము నుంచి పొలాల వద్ద రెవెన్యూ అధికారులు సర్వే చేస్తున్న విషయం తెలుసుకున్న ఎర్రవల్లి గ్రామ దళితులు అక్కడికి చేరుకొని తమకు తెలియకుండా సర్వే ఎందుకు చేస్తున్నరని ఆగ్రహం వ్యక్తం చేశారు. రెండో రోజు ఏడీ సుదర్శన్ రాథోడ్ ఆధ్వర్యంలో పోలీస్ బందోబస్తు మధ్య సర్వే నంబర్ 325లోని 388 ఎకరాల విస్తీర్ణం చుట్టూ హద్దులను గుర్తించే పనిలో పడ్డారు. రైతులు మాత్రం తమ ఊరికి కేసీఆర్ రాకతోనే తమకు మంచి రోజులొచ్చాయని, ఇప్పుడేమో మీరొచ్చి సర్వే పేరుతో గందరగోళం చేస్తున్నరంటూ అధికారులపై మండిపడుతున్నారు.
మేము దళితులమే. మా తాతల నుంచి చూస్తున్న.. ఇక్కడే పంటలు పండించుకొని బతుకుతున్నాం. మా భూములు వేరే వాళ్లకు ఇస్తమంటే ఎట్లా బతుకుతాం? ముఖ్యమంత్రి కొత్త వారికి ఇస్త్తమంటే ఇక్కడి రైతులకు ఏమి కావాలె? మా భూములు మాకే కావాలె. ఎప్పటి నుంచో సాగులో ఉన్న భూములు కాదు; ఊర్లోని దళితుల్లో ఇంకా భూమి లేనివారు ఉన్నారు. వాళ్లకు ఎక్కడైనా ఇచ్చేలా ముఖ్యమంత్రి చూడాలె. మా భూములకు, కేసీఆర్కు ఎలాంటి సంబంధం లేదు. ఆయన రాకతోనే సాగు నీళ్లు వచ్చాయి. చెరువును బాగు చేసి నీళ్లు ఇచ్చారు. ఏదైనా మాట్లాడే ముందు నిజం తెలుసుకొవాలె. వరి, కూరగాయలు వేసుకొని 200 కుటుంబాలు బతుకుతున్నాయి.
-ఎడమ కరుణాకర్, రైతు, ఎర్రవల్లి, సిద్దిపేట జిల్లా
కొన్నేండ్లుగా రాళ్లు, రప్పలతో ఉన్న మా భూములను కేసీఆర్ వచ్చినంకనే పెద్ద పెద్ద మిషన్లు పెట్టించి సక్కగా చేసిండు. కేసీఆర్ వచ్చినంకనే మా భూముల్లో పంటలు బాగా పండించుకుంటున్నం. మా భూముల పక్కన ఉన్న పాండురంగ చెరువును బాగు చేసి నీళ్లు ఇచ్చిన దేవుడు కేసీఆర్ సారు.
– ఎడమ చంద్రయ్య, రైతు, ఎర్రవల్లి, సిద్దిపేట జిల్లా
మా ఊర్ల కేసీఆర్ భూములు కొనుకున్న తరువాత గవర్నమెంట్ రాగానే మా భూములకు సౌలత్ చేసిండు. కేసీఆర్ వచ్చినంక గుంట జాగ కూడా బీడుగా లేదు. ఎటుచూసినా పంటలే కన్పిస్తాయి. మాల, మాదిగోళ్లం అందరం వరి, కూరగాయలు పెట్టుకొని బతుకుతున్నం. కేసీఆర్ మా భూముల్లోకి వచ్చిండంటూ మాట్లాడటం చాలా తప్పు.
– బెజనమైన లావణ్య, రైతు, ఎర్రవల్లి, సిద్దిపేట జిల్లా
కేసీఆర్ సారు వచ్చినంకనే మంచిగా బతుకుతున్నం. ఆయన మా భూములు బాగు చేసిండు కానీ ఎక్కడా తీసుకోలేదు. ఆయన మా భూములు తీసుకున్నడని రేవంత్రెడ్డి మాట్లాడుడు తప్పు. ఎక్కడా గుంట జాగ మా దళితులది పోలేదు. రాళ్లు, బండలు ఉన్న భూములను సక్కగా చేసిండు.
-బైలంపూర్ యాదగిరి, రైతు, ఎర్రవల్లి, సిద్దిపేట జిల్లా