నర్సింహులపేట, ఫిబ్రవరి 17: ‘నా 45 ఏండ్ల రాజకీయ జీవితంలో ఇలాంటి నీచమైన ప్రభుత్వాన్ని చూడలేదు.. బీఆర్ఎస్పై తొర్రూరు పట్టణ ప్రజలు నమ్మకంతో 9 మంది కౌన్సిలర్లను ఎన్నుకుంటే.. రాజ్యాంగ విరుద్ధంగా కాంగ్రెస్ దుర్మార్గం చేసింది’ అని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ఆగ్ర హం వ్యక్తంచేశారు. తొర్రూరు మున్సిపాలిటీలో జరిగిన చైర్మన్, వైస్‌చైర్మన్ ఎన్నికల నేపథ్యంలో ఎర్రబెల్లిని పోలీసులు అరెస్టుచేసి మహబూబాబాద్ జిల్లా నర్సింహులపేట పోలీస్‌స్టేషన్‌కు తరలించారు. బీఆర్ఎస్ కార్యకర్తలు పోలీస్ స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం స్టేషన్లో ఎర్రబెల్లి దయాకర్‌రావు భావోద్వేగంతో మాట్లాడుతూ కార్యకర్తలను తలుచుకొని ఒక్కసారిగా విలపించారు. రేవంత్ పాలన లో ప్రజాస్వామ్యం ఘోరంగా విఫలమైందని విమర్శించారు.
సోమవారం విప్ జారీ చేసేందుకు ఆర్డీవో, మున్సిప ల్ కమిషనర్ తమకు అనుమతి ఇవ్వలేదని చెప్పారు. తమ పార్టీ కౌన్సిలర్లకు కోట్లు ఇస్తామని ప్రలోభపెట్టి భయబ్రాంతులకు గురిచేశారని, అయినా తమ పార్టీ కౌన్సిలర్లు అమ్ముడుపోలేద ని తెలిపారు. తొర్రూరులో బీఆర్ఎస్కు పూర్తిస్థాయి మెజారిటీ ఉన్నా కాంగ్రెస్ నాయకులు అడ్డదారులు వెతుక్కొన్నారని ఆరోపించారు. ఎంపీ కావ్యకు గతంలో వరంగల్ కార్పొరేషన్లో ఓటు ఉన్నట్టు ఆధారాలు ఇచ్చేందుకు 3 రో జులుగా వెళ్లినా తమకు అనుమతి ఇవ్వలేదని తెలిపారు.
10 వేల మంది కార్యకర్తలు తిండీతిప్పలు మాని రాత్రీపగలు కష్టపడి పనిచేశారని, వేల సంఖ్యలో మద్దతు ఇచ్చారని, వారందరికీ ఏం స మాధానం చెప్పుకోవాలని, వారికి ఎలా ధైర్యం చెప్పాలంటూ ఎర్రబెల్లి విలపించారు. ఆయన వెంట బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షురాలు, మాజీ ఎంపీ మాలోత్ కవిత, మాజీ ఎమ్మెల్యే డీఎస్ రెడ్యానాయక్, మండల అధ్యక్షుడు మైదం దేవేందర్, కుంభం సువీర్రెడ్డి, గుగులోత్ రవి, అయూబ్‌పాషా, మల్లారెడ్డి, ఖాజామియా, జగదీశ్వర్, రమేశ్, వంశీ, లింగ్యా పాల్గొన్నారు.