హనుమకొండ, అక్టోబర్ 28: రాష్ట్రంలో వేసే ప్రతి పంట, ధాన్యం మొత్తం కొనుగోలు చేస్తామని కేంద్రం నుంచి బీజేపీ ఎంపీలు ఉత్తర్వులు తీసుకురావాలి.. చేతకాకపోతే చవటలం అని ఒప్పుకొని వెంటనే ఎంపీ, కేంద్ర మంత్రి పదవులకు రాజీనామా చేయాలని పంచాయతీరాజ్‌శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు డిమాండ్ చేశారు. గురువారం హనుమకొండలో రైతుబంధు సమితి రాష్ట్ర చైర్మన్ పల్లా రాజేశ్వర్‌రెడ్డితో కలిసి మీడియాతో మాట్లాడారు.
బీజేపీ ఎంపీ బండి సంజయ్ దీక్ష అర్థంలేనిదని కొట్టిపారేశారు. ధాన్యం కొనుగోలు చేయబోమని చెప్పింది కేంద్రం కాదా?అని నిలదీశారు. రైతుల బాధలు, కష్టాలు తెలిసిన సీఎం కేసీఆర్ ధాన్యం కొంటామని చెప్తున్నారని, బండి సంజయ్‌కి దమ్ముంటే ధాన్యం సేకరించాలని కేంద్రాన్ని డిమాండ్ చేస్తూ దీక్షలు చేయాలని సవాల్ విసిరారు. వానకాలం మొదలవడానికి ముందే సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి ధాన్యం సేకరించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసినా స్పందనలేదని మండిపడ్డారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక కోసమే బీజేపీ చిల్లర రాజకీయాలు చేస్తున్నదని ధ్వజమెత్తారు. వడ్లు కొనకుండా రైతులను ఇబ్బందులకు గురిచేస్తూనే మరోవైపు ధర్నాలు, నిరసనలు చేస్తామంటున్న బండి సంజయ్‌కి సిగ్గుందా? అని మండిపడ్డారు.
బీజేపీది రైతు వ్యతిరేక వైఖరి
ధాన్యం కొనుగోలు విషయంలో బండి సంజయ్ అసత్య ప్రచారాలు చేస్తున్నారని పల్లా రాజేశ్వర్‌రెడ్డి మండిపడ్డారు. 2014 నుంచి పుష్కలంగా నీరు, విద్యుత్తు, పంటపెట్టుబడి అందించి తెలంగాణను సీఎం కేసీఆర్ దేశ ధాన్యాగారంగా మార్చారని అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రైతులను అనేకవిధాలుగా ఆదుకొంటుంటే, ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం అనేక సమస్యలు స్పష్టిస్తున్నదని మండిపడ్డారు. బండి సంజయ్‌కి నీతి, నిజాయితీ ఉంటే కేంద్రాన్ని ఒప్పించి ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. బీజేపీది రైతు వ్యతిరేక ప్రభుత్వం అని విమర్శించారు.