న్యూఢిల్లీ, డిసెంబర్ 22 : ఆరావళిపై తన నిర్ణయాన్ని పునః పరిశీలించాలని కోరుతూ న్యాయవాది, పర్యావరణ కార్యకర్త జితేంద్ర గాంధీ భారత ప్రధాన న్యాయమూర్తి(సీజేఐ)కి సోమవారం లేఖ రాశారు. స్థానిక భూమి ఉపరితలం నుంచి 100 మీటర్లు లేదా అంతకుమించి ఎత్తున ఉన్నవి మాత్రమే ఆరావళి పర్వతాలుగా పరిగణించబడతాయని, అంతకన్నా తక్కువ ఎత్తున ఉన్నవి ఆరావళి పర్వత శ్రేణుల పరిధిలోకి రావంటూ సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన తీర్పు దేశవ్యాప్తంగా నిరసనలకు దారి తీసింది.
ఎత్తు ప్రాతిపదికన పర్వతాన్ని నిర్ణయించడం వల్ల అనాలోచితంగా అది వాయువ్య భారతదేశం వ్యాప్తంగా పర్యావరణ పరిరక్షణను బలహీనపరుస్తుందని రాష్ట్రపతికి కూడా పంపిన తన లేఖలో జితేంద్ర పేర్కొన్నారు. సుప్రీం తీర్పుతో ఆరావళి పర్వత శ్రేణుల్లో 90 శాతం పర్వతాలు రక్షణను కోల్పోతాయని, మైనింగ్, రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు విచ్చలవిడిగా సాగి పర్యావరణ విధ్వంసం జరుగుతుందని, థార్ ఎడారి ఢిల్లీ వరకు విస్తరించి భూగర్భ జలాల రీచార్జ్ నిలిచిపోవడంతోపాటు జీవ వైవిధ్యం దెబ్బతింటుందని పర్యావరణవేత్తలు హెచ్చరిస్తున్నారు.