ఎనిమిదేండ్ల నాటి మాట. న్యూయార్క్లో ఉంటున్న అనిందిత సంపత్ కుమార్ యోగా క్లాస్ నుంచి బయటికి వస్తూ చుట్టుపక్కల ఎక్కడైనా ‘ప్రొటీన్ బార్’ దొరుకుతుందా అని చూసింది. దొరకలేదు. క్రమంగా ఆమె ఆలోచనలు వ్యాపారం మీదికి మళ్లాయి. తన చెల్లెలు సుహాసినిని కూడా ఒప్పించింది. పక్కా ప్రణాళిక సిద్ధం చేసుకుని.. ఉద్యోగానికి రాజీనామా చేసింది అనిందిత. తమ దగ్గరున్న రూ.25 లక్షలతో స్ప్రౌట్ లైఫ్ ఫుడ్ అనే సంస్థను ప్రారంభించారు ఇద్దరూ. వివిధ సంస్థల నుంచి కొంతమేర పెట్టుబడులనూ సమకూర్చుకున్నారు. స్నాక్బార్తో మొదలుపెట్టి పీనట్ బటర్, ఓట్స్.. ఇలా రకరకాల ఉత్పత్తులు అందిస్తుందీ సంస్థ. చిన్నారుల కోసం ‘యోగా బేబీ బ్రాండ్’ ఉంది.
ఇప్పుడు, యోగాబార్ వందల కోట్ల బ్రాండ్. ఆరువేల రిటైల్ అవుట్లెట్స్ ఉన్నాయి. ఆరోగ్యకర ఆహార మార్కెట్ అనూహ్యంగా విస్తరిస్తుండటంతో.. యోగాబార్ మీద ఐటీసీ కన్ను పడింది. సంస్థలో 39.4 శాతం వాటా కోసం రూ.175 కోట్లు చెల్లించడానికి ముందుకొచ్చింది. ఇంకో 8.1శాతం వాటా కోసం అదనంగా రూ.80 కోట్లు వెచ్చించనుంది. ఐటీసీ ప్రతిపాదన వినగానే అక్కాచెల్లెళ్లు ఎగిరి గంతేశారు. ‘నిజమే మాకు పెద్ద మొత్తంలో డబ్బు వస్తుంది. దానికి మించి మా ఉత్పత్తులను ఐటీసీ ద్వారా మార్కెట్ చేసుకునే వీలూ ఉంటుంది’ అంటారు తోబుట్టువులలో ఒకరైన సుహాసిని. లండన్ బిజినెస్ స్కూలు నుంచి ఎంబీఏ చేసిన సుహాసినికి వ్యాపార వ్యూహాలపై తిరుగులేని స్పష్టత ఉంది. హెల్దీ పిజ్జాల వ్యాపారంలో అడుగుపెట్టాలన్నది వీరి ఆలోచన.