వన్డే వరల్డ్ చాంపియన్ ఇంగ్లండ్ జట్టు.. పొట్టి ఫార్మాట్లోనూ కప్పు కొట్టేందుకు వడివడిగా అడుగులు వేస్తున్నది. ఆడిన నాలుగు మ్యాచ్‌ల్లోనూ అఖండ విజయాలు సాధించిన ఇంగ్లిష్ టీమ్ 8 పాయింట్లతో నాకౌట్ బెర్త్ ఖరారు చేసుకోగా.. శ్రీలంక సెమీస్ అవకాశాలను మరింత సంక్లిష్టం చేసుకుంటూ మూడో పరాజయం మూటగట్టుకుంది! బట్లర్ అజేయ శతకంతో మంచి స్కోరు చేసిన మోర్గాన్ సేన.. వరుస విరామాల్లో వికెట్లు పడగొట్టి లంకను కట్టడి చేసింది!
షార్జా: వికెట్ కీపర్ బ్యాట్స్‌మన్ జోస్ బట్లర్ (67 బంతుల్లో 101 నాటౌట్; 6 ఫోర్లు, 6 సిక్సర్లు) అజేయ శతకంతో విజృంభించడంతో టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ నాలుగో విజయం నమోదు చేసుకుంది. సూపర్-12లో భాగంగా సోమవారం జరిగిన పోరులో ఇంగ్లండ్ 26 పరుగుల తేడాతో శ్రీలంకను చిత్తు చేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్ 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. బట్లర్‌తో పాటు ఇయాన్ మోర్గాన్ (40; ఒక ఫోర్, 3 సిక్సర్లు) రాణించారు. దక్షిణాఫ్రికాతో మ్యాచ్‌లో హ్యాట్రిక్ తీసిన శ్రీలంక లెగ్ స్పిన్నర్ వణిండు హసరంగా ఈ మ్యాచ్‌లోనూ మూడు వికెట్లతో ఆకట్టుకున్నాడు. అనంతరం లక్ష్యఛేదనలో లంక 19 ఓవర్లలో 137 పరుగులకు ఆలౌటైంది. వణిండు హసరంగ (34) టాప్ స్కోరర్. ఇంగ్లిష్ బౌలర్లలో ఆదిల్ రషీద్, మెయిన్ అలీ, క్రిస్ జోర్డాన్ తలా రెండు వికెట్లు పడగొట్టారు. సెంచరీ వీరుడు బట్లర్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డు దక్కింది.
35/3 నుంచి.. 147/4
టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లంక అందుకు తగ్గట్లే ఆరంభంలో కట్టుదిట్టమైన బంతులతో ఇంగ్లండ్ బ్యాటర్లను సమర్థవంతంగా అడ్డుకుంది. లెగ్ స్పిన్నర్ వణిండు హసరంగ (3/21) విజృంభించడంతో.. జాసన్ రాయ్ (9), మలాన్ (6), బెయిర్‌స్టో (0) పెవిలియన్‌కు వరుస కట్టారు. ఫలితంగా ఇంగ్లండ్ 35 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. ఈ దశలో బట్లర్, మోర్గాన్ ఇన్నింగ్స్‌ను చక్కదిద్దే బాధ్యత తీసుకున్నారు.
ఈ క్రమంలో 45 బంతుల్లో బట్లర్ అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. టీ20 ప్రపంచకప్‌లో ఇంగ్లండ్ తరఫున ఇదే నెమ్మదైన హాఫ్‌సెంచరీ కావడం గమనార్హం. క్రీజులో కుదురుకున్నాక మాత్రం ఈ జోడీ భారీ షాట్లతో స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. ఇన్నింగ్స్ ఆఖరి బంతికి 95 పరుగుల వద్ద ఉన్న బట్లర్.. భారీ సిక్సర్‌తో పొట్టి ఫార్మాట్లో తొలి సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
సంక్షిప్త స్కోర్లు
ఇంగ్లండ్: 20 ఓవర్లలో 163/4 (బట్లర్ 101 నాటౌట్; మోర్గాన్ 40; హసరంగ 3/21), శ్రీలంక: 19 ఓవర్లలో 137 ఆలౌట్ (హసరంగ 34; రషీద్ 2/19, అలీ 2/15).