నల్లగొండ ప్రతినిధి, సెప్టెంబర్ 24(నమస్తే తెలంగాణ): యాదాద్రి పవర్ ప్లాంట్‌పై సీఎం రేవంత్‌రెడ్డి తో పాటు ప్రభుత్వం చెప్తున్న విషయాలన్నీ అబద్ధాలని మరోసారి తేటతెల్లం అయ్యింది. పవర్ ప్లాంట్‌నే వృథా అన్నట్టు, 40 వేల కోట్ల అదనపు భారం అంటూ బుధవారం సీఎం చేసిన రివ్యూలో సైతం తప్పడు ప్రకటనలు చేసిన విషయం తెలిసిందే. జీ9 గ్రేడ్ బొగ్గుతోనే యాదాద్రి పవర్ ప్లాంట్ నడుస్తున్నదని, ఆ బొగ్గు కొరతతో ఉత్పత్తి చేయలేకపోతున్నట్టు ప్రభుత్వం పేర్కొన్నది.
కానీ గురువారం మాజీ మంత్రి జగదీశ్‌రెడ్డి నేతృత్వంలోని మాజీ ఎమ్మెల్యేల బృందం పర్యటనలో ప్రభుత్వం చెప్తున్న మాటలు, చేస్తున్న ప్రకటనలన్నీ పచ్చి అబద్ధాలని తేలిపోయింది. స్వయంగా ప్లాంట్‌లోని అధికారులు, ఇంజినీర్లతో జగదీశ్‌రెడ్డి బృందం సమావేశమై ప్లాంట్ పరిస్థితిపై ఆరా తీశారు. గతంలో తానే విద్యుత్ మంత్రిగా పనిచేయడం, యాదాద్రి థర్మల్ ప్లాంట్ నిర్మాణంలో ప్రముఖ పాత్ర పోషించడంతో ప్లాంట్ పై తనకు ఉన్న అవగాహనతో అధికారులతో మాట్లాడారు. జగదీశ్‌రెడ్డి అడిగిన ఒక్కో విషయానికి సమాధానమిస్తూ అధికారులు వాస్తవాలు ఏంటో వెల్లడించారు. జీ9 గ్రేడ్ బొగ్గు సరఫరాపై చర్చిస్తూ… జీ7- జీ13 గ్రేడ్ వరకు ప్లాంట్ నడపొచ్చు కదా అని అడగ్గా… రన్ చేయొచ్చు అని అధికారులు చెప్పారు.
ప్లాంట్ నిర్మాణం సమయంలో జీ9 బొగ్గు సరఫరా కోసం ఒప్పందం జరిగిందని తెలిపారు. కానీ ఇప్పుడు హఠాత్తుగా సింగరేణి గ్రేడ్ జీ9 బొగ్గు సరఫరా ఆపేసిందని చెప్పారు. అందుకే విద్యుత్ ఉత్పత్తి తగ్గిందని ఇంజినీర్లు వివరించారు. ఒక్కో యూనిట్ సామర్థ్యం 800 మెగావాట్లు ఉండగా ప్రస్తుత బొగ్గుతో కేవలం ఒక్కో యూనిట్ లో 600 మెగావాట్లే ఉత్పత్తి చేయగలుగుతున్నామని చెప్పారు. జనరల్ గా ప్లాంట్ లో 20 రోజుల విద్యుత్ ఉత్పత్తికి సరిపడా బొగ్గు స్టాక్ ఉండాల్సి ఉండగా, కేవలం నాలుగు రోజులకే ఉన్నట్టు తెలిపారు. ఇక గతంలో సింగరేణి ఒప్పందం ప్రకారం… గ్రేడ్ డిక్లరేషన్ డాక్యుమెంట్లో 13 బ్లాకుల్లో గ్రేడ్ 9 బొగ్గు ఉత్పత్తి చేస్తామని ఉందని తెలిపారు. కానీ జీ 9 గ్రేడ్ బొగ్గుకు బదులు ప్రస్తుతం జీ 11- జీ 13 గ్రేడ్ బొగ్గు వస్తున్నదని తేలింది.