హైదరాబాద్, సెప్టెంబర్ 24 (నమస్తే తెలంగాణ): ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటును సుప్రీంకోర్టు సమర్థించడంతో ఉపఎన్నిక సమరభేరి మోగడానికి రంగం సిద్ధమైనట్టేనని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీ తరఫున శాసనసభ్యుడిగా గెలిచి, కాంగ్రెస్ పార్టీ బీ ఫారంపై ఎంపీగా బరిలోకి దిగిన దానం నాగేందర్‌పై తెలంగాణ హైకోర్టు అనర్హత వేటు వేసిన విషయం తెలిసిందే. ఆయన కాంగ్రెస్ అభ్యర్థిగా లోక్‌సభకు నామినేషన్ దాఖలు చేసిన 2024 ఏప్రిల్ 23వ తేదీ నుంచే ఈ అనర్హత అమల్లోకి వస్తుందని హైకోర్టు తేల్చి చెప్పింది.. హైకోర్టు ఇచ్చిన తీర్పును గురువారం సుప్రీంకోర్టు సమర్థించడంతో నాగేందర్ సభ్యత్వం పూర్తిగా రద్దయింది.
ప్రజాప్రాతినిధ్య చట్టం-1951 ప్రకారం స్థానం ఖాళీ అయిన నాటి నుంచి ఆరు నెలల్లోగా ఎన్నికల ప్రక్రియను పూర్తి చేయాల్సి ఉండటంతో, అసెంబ్లీ సెక్రటేరియట్ నుంచి ఖైరతాబాద్ స్థానం ఖాళీ అయినట్టు అధికారిక నోటిఫికేషన్‌ను కేంద్ర ఎన్నికల సంఘానికి త్వరలోనే పంపించే అవకాశం ఉన్నదని చెప్తున్నారు. సాధారణంగా నియోజకవర్గం ఖాళీ అయిన తేదీ నుంచి ఆరు నెలల గడువును లెకిస్తారని, కోర్టు ఆదేశాల ప్రకారం 2024 ఏప్రిల్ 23 నుంచే ఈ ప్రభావం ఉన్నందున ఎన్నికల సంఘం జాప్యం లేకుండా రంగంలోకి దిగాల్సి ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. దీంతో ఈ నెల చివరిలో కానీ, లేదంటే వచ్చే అక్టోబర్ మొదటి వారంలో కానీ కేంద్ర ఎన్నికల సంఘం ఉపఎన్నిక నోటిఫికేషన్‌ను విడుదల చేయవచ్చని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. అక్టోబర్ చివరి వారంలో ఎన్నికలు నిర్వహించి నవంబర్ మొదటి వారంలో ఓట్ల లెక్కింపు చేపట్టే అవకాశం ఉన్నదని అధికారిక వర్గాలు అంచనా వేస్తున్నాయి.
గత శాసనసభ ఎన్నికల్లో బీఆర్ఎస్ అభ్యర్థిగా ఖైరతాబాద్ నుంచి గెలుపొందిన దానం నాగేందర్, రాష్ట్రంలో అధికార మార్పిడీ జరుగగానే కాంగ్రెస్ గూటికి చేరారు. అంతటితో ఆగకుండా సికింద్రాబాద్ లోక్‌సభ నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ అధికారిక అభ్యర్థిగా బీ-ఫారంపై ఎంపీగా బరిలోకి దిగడం రాజ్యాంగంలోని పదో షెడ్యూల్‌ను ఉల్లంఘించడమేనని ప్రతిపక్షాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశాయి. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, బీజేపీ శాసనసభా పక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి వేర్వేరుగా అసెంబ్లీ స్పీకర్ కార్యాలయంలో అనర్హత పిటిషన్లు దాఖలు చేశారు.
అయితే, దానం నాగేందర్ బీఆర్ఎస్ పార్టీ ప్రాథమిక సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నట్టు నిర్ధారించేందుకు తగిన ఆధారాలు లేవని స్పీకర్ ఆ పిటిషన్లను కొట్టివేశారు. 2026 మార్చి 23న స్పీకర్ ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఎమ్మెల్యేలు పాడి కౌశిక్‌రెడ్డి, ఏలేటి మహేశ్వర్‌రెడ్డి హైకోర్టులో రిట్ పిటిషన్లు దాఖలు చేశారు. స్పీకర్ ఇచ్చిన ఉత్తర్వును రద్దు చేసి, పదో షెడ్యూల్లోని 2(1)(ఏ) కింద దానం నాగేందర్‌ను అనర్హుడిగా ప్రకటించాలని, 2024 ఏప్రిల్ 23న లోక్‌సభకు నామినేషన్ దాఖలు చేసిన తేదీ నుంచే అమలు కావాలని విజ్ఞప్తి చేశారు. ఇరుపక్షాల వాదనల అనంతరం తీర్పును రిజర్వ్ చేసిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అపరేశ్ కుమార్‌సింగ్, జస్టిస్ జీఎం మొహియుద్దీతో కూడిన డివిజన్ బెంచ్ 2026 సెప్టెంబర్ 18న అసెంబ్లీ స్పీకర్ ఇచ్చిన తీర్పును రద్దు చేస్తూ, ఎమ్మెల్యే దానం నాగేందర్‌ను అనర్హుడిగా ప్రకటిస్తూ ధర్మాసనం తీర్పు చెప్పిన విషయం తెలిసిందే.
కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఆయన నామినేషన్ వేసిన తేదీ నుంచే శాసనసభ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నట్టుగా పరిగణిస్తూ ఖైరతాబాద్ స్థానం ఖాళీ అయిందని అధికారికంగా ప్రకటించింది. అప్పీల్ చేసుకొనేందుకు గడువు కావాలని ఆయన చేసిన విన్నపాన్ని సైతం ధర్మాసనం తిరసరిస్తూ తక్షణమే నోటిఫికేషన్ విడుదల చేయాలని ఎన్నికల సంఘాన్ని ఆదేశించింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ దానం నాగేందర్ సుప్రీంకోర్టును ఆశ్రయించగా, అకడ కూడా ఎదురుదెబ్బే తగిలింది. ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపడుతూ, ఒకే సమయంలో రెండు పార్టీల ప్రయోజనాలు పొందాలనుకోవడం రాజ్యాంగ స్ఫూర్తికే విరుద్ధమని స్పష్టం చేసింది. ఎమ్మెల్యేగా ఉన్న భద్రతను కాపాడుకుంటూనే ఎంపీ పదవి కోసం వెంపర్లాడటం చట్ట విరుద్ధమని తీవ్ర వ్యాఖ్యలు చేసింది. హైకోర్టు ఇచ్చిన ఆదేశాలు రాజ్యాంగబద్ధంగా ఉన్నాయని నిర్ధారిస్తూ దానం దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేసింది.
సుప్రీంకోర్టు వెలువరించిన ఈ తీర్పు దానం నాగేందర్ రాజకీయ భవితవ్యంపైనే కాకుండా దేశవ్యాప్త రాజకీయ ముఖచిత్రంపై పెను ప్రభావం చూపుతుందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. ముఖ్యంగా కాంగ్రెస్ అగ్రనేత రాహుల్‌గాంధీ జాతీయ స్థాయిలో రాజ్యాంగ పరిరక్షణ పేరుతో ‘సంవిధాన్ బచావో’ నినాదాన్ని వినిపిస్తున్న తరుణంలో, తెలంగాణలో అదే పార్టీ అధికారంలో ఉంటూ బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను చేర్చుకోవడాన్ని విపక్షాలు తీవ్రంగా ఎత్తిచూపుతున్నాయి. ఢిల్లీలో రాజ్యాంగ విలువల గురించి ప్రసంగాలు చేస్తూ, గల్లీలో మాత్రం పదో షెడ్యూల్‌ను లెకచేయకుండా ఫిరాయింపులను ప్రోత్సహించడం ద్వంద్వ వైఖరికి నిదర్శనమని, ఈ పరిణామం కాంగ్రెస్ అధిష్ఠానాన్ని రాజకీయంగా తీవ్ర ఆత్మరక్షణలో పడేస్తుందని విశ్లేషకులు భావిస్తున్నారు.
మరోవైపు, స్పీకర్ల కాలయాపన వ్యూహాలకు తావులేకుండా కోర్టులే నేరుగా వేటు వేయగలవన్న ఈ పూర్వాపరాలు దేశంలోని ఇతర రాష్ట్రాల్లోనూ ప్రకంపనలు సృష్టిస్తుందని న్యాయ నిపుణులు భావిస్తున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, మధ్యప్రదేశ్ వంటి రాష్ట్రాల్లో అధికార మార్పిడీ కోసం గతంలో జరిగిన పార్టీ ఫిరాయింపుల సంస్కృతికి ఈ తీర్పు బలమైన అడ్డుకట్ట వేస్తుందని అభిప్రాయపడుతున్నారు. తెలంగాణలో ఇప్పటికే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరిన మిగిలిన తొమ్మిది మంది ఎమ్మెల్యేల పదవులకు కూడా ముప్పు పొంచి ఉన్నదని, స్పీకర్ నిర్ణయాలపై ఆధారపడకుండా హైకోర్టు తీసుకున్న కఠిన వైఖరి సుప్రీంకోర్టులో నిలబడటంతో వారి భవిష్యత్తు ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారిందని రాజకీయ పరిశీలకులు విశ్లేషిస్తున్నారు.
గ్రేటర్ హైదరాబాద్ నడిబొడ్డున ఉన్న ఖైరతాబాద్ నియోజకవర్గం ఇప్పుడు అన్ని ప్రధాన పార్టీల భవిష్యత్తు రాజకీయాల దిశానిర్దేశక కేంద్రంగా మారనున్నదని రాజకీయ పరిశీలకులు అంటున్నారు. ఈ ఉపఎన్నిక రాష్ట్రంలో అధికార కాంగ్రెస్ పార్టీకి అత్యంత ప్రతిష్ఠాత్మకమైన లిట్మస్ టెస్ట్‌గా మారనున్నదని రాజకీయ వర్గాలు భావిస్తున్నాయి. రాజధాని నగర పరిధిలో పార్టీ పట్టును నిరూపించుకోవడంతోపాటు ప్రభుత్వ పాలనపై ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టుకోవాల్సిన గురుతర బాధ్యత రేవంత్‌రెడ్డి సరార్‌పై పడనున్నదని అంటున్నారు. అయితే, స్వయంగా అధికార పార్టీ ఎంపీ అభ్యర్థిగా పోటీ చేసి అనర్హతకు గురైన దానం నాగేందర్‌కే కాంగ్రెస్ మళ్లీ టికెట్ ఇస్తుందా?
లేక కొత్త ముఖాన్ని బరిలోకి దించుతుందా? అనే అంశంపై చర్చ జరుగుతున్నది. మరోవైపు, ప్రజా తీర్పును కాలరాసి పార్టీ ఫిరాయించిన నాయకులకు ఈ ఉపఎన్నిక ద్వారా ప్రజలే గుణపాఠం చెబుతారని బీఆర్ఎస్ ధీమా వ్యక్తంచేస్తున్నది. తమ పార్టీ గుర్తుపై గెలిచిన స్థానాన్ని ఎలాగైనా తిరిగి దకించుకొని, రాష్ట్రవ్యాప్తంగా పార్టీ క్యాడర్లో నూతన ఉత్సాహాన్ని నింపాలని గులాబీదళం వ్యూహాలు రచిస్తున్నట్టు తెలిసింది. ఒక నియోజకవర్గ ఉపఎన్నికకే పరిమితం కాకుండా, రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సెమీఫైనల్‌గా మారబోతున్నదని ఎన్నికల విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.