హైదరాబాద్, జూన్7 (నమస్తే తెలంగాణ): కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఇరిగేషన్‌శాఖ ఇంజినీర్లలో కలవరం మొదలైంది. అధికారంలోకి వచ్చిన నాటి నుంచీ నీటిహక్కులపై ఇష్టారాజ్యంగా రాజకీయ ప్రకటనలు చేస్తుండటం వారిని ఆందోళనలోకి నెట్టేసింది. తమను మాటమాత్రమైన సంప్రదించకుండా, వివరాలేవీ చెప్పకుండా రాష్ర్టానికి అత్యంత సున్నితమైన అంశాలపై రాజకీయ నిర్ణయాలను తీసుకుంటుండటంపై అసంతృప్తి నెలకొన్నది. వద్దు వద్దంటున్నా బనకచర్లపై చర్చలకు వెళ్లడం, పాలమూరు వాటా కుదింపు, ఇంటర్‌స్టేట్ అధికారుల్లేకుండానే కమిటీని ఏర్పాటు చేయడం, ఏపీ ముందుకు తెస్తున్న పోలవరం నల్లమలసాగర్ లింకుతో పాటు కర్ణాటక బరాజ్లపైనా రేవంత్ సర్కార్ వ్యవహారశైలి అధికారుల్లో చర్చనీయాంశంగా మారింది. ఇవి ట్రిబ్యునల్‌లో కృష్ణా జలహక్కులకు ఎక్కడ అడ్డంకిగా మారుతాయోనని అధికారులు అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.
ఏపీ ప్రభుత్వం గోదావరి జలాలను కొల్లగొట్టేందుకు బనకచర్లను తెరమీదికి తీసుకురాగానే కేంద్ర సంస్థలైన సీడబ్ల్యూసీ, ఎన్‌డబ్ల్యూడీఏ, జీఆర్ఎంబీ, కేఆర్ఎంబీ తదితర సంస్థలే తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. తెలంగాణ ప్రభుత్వం కూడా వ్యతిరేకిస్తుందని ఇంజినీర్లు భావించారు. అందుకు భిన్నంగా ఏపీతో చర్చలకు సిద్ధమంటూ సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించడంతో ఇంజినీర్లు నాడు విస్మయం వ్యక్తం చేశారు. చర్చలు వద్దంటూ హితవు పలికారు. అయినప్పటికీ రేవంత్ ప్రభుత్వం అవేవీ పట్టించుకోలేదు. గతంలో తెలంగాణ లేవనెత్తిన అంశాలన్నీ దాదాపు కృష్ణా జలాలకు సంబంధించిన పాలమూరు రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల డీపీఆర్‌లకు అనుమతులు, నీటివినియోగ పరిణామాల నమోదుకు టెలిమెట్రీల ఏర్పాటు, ఏపీ చేపట్టిన రాయలసీమ లిఫ్ట్ విస్తరణ, ఔట్‌బేసిన్‌కు జలాల మళ్లింపు అంశాలు తదితర రాష్ట్ర విభజన నాటి నుంచీ తలెత్తుతున్న జలవివాదాలపై చర్చలంటూ మభ్యపెట్టింది. వాస్తవంగా అవన్నీ కూడా ట్రిబ్యునల్ అవార్డు అమల్లోకి వచ్చినప్పుడే పరిష్కారం లభించే ఆస్కారముందని ఇంజినీర్లు మొదటి నుంచీ తెలుపుతున్నారు. ఏపీ చేపట్టిన రాయలసీమ లిఫ్ట్‌తోపాటు, ఇతర వివాద అంశాలు కూడా న్యాయస్థానాల్లో ఉన్నాయి. సూటిగా చెప్పాలంటే ట్రిబ్యునల్ కేటాయింపులు పూర్తయితే తప్ప తెలంగాణ లేవనెత్తిన అంశాలకు పరిష్కారం లభించబోదనేది ఇంజినీర్లు తేల్చిచెప్పారు. ఈ విషయాన్ని ఇప్పటికే కేఆర్ఎంబీ సైతం పలు సందర్భాల్లో తేల్చిచెప్పిందని గుర్తుచేశారు. కాంగ్రెస్ సర్కార్ తీరు ఏపీ చేపట్టనున్న పోలవరం నల్లమలసాగర్ లింకు ప్రాజెక్టుకు మార్గం సుగమం చేసేందుకు తప్ప మరేమీ కాదని ఆదిలోనే అనుమానం వ్యక్తం చేశారు.
రేవంత్‌రెడ్డి ప్రభుత్వం అంగీకారం తెలిపిన అనంతరం తెలంగాణ, ఏపీ రాష్ర్టాల మధ్య జలవివాదాల పరిష్కారానికి 13మంది అధికారులతో కేంద్రం ప్రత్యేక నిపుణుల కమిటీని ఏర్పాటు చేసింది. అందులో తెలంగాణ అంతర్రాష్ట్ర నదీజలాల విభాగం నుంచి కీలకమైన అధికారులకు సైతం చోటు కల్పించకపోవడం గమనార్హం. కేంద్ర జలసంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ నేతృత్వంలో ఏర్పాటు చేసిన ఈ కమిటీలో తెలంగాణ నుంచి రాష్ట్ర ఇరిగేషన్‌శాఖ ప్రభుత్వ సలహాదారుడు, ఇరిగేషన్‌శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, ప్రత్యేక కార్యదర్శి, ఈఎన్సీకి, ఏ పీ నుంచి ఆ రాష్ట్ర జలవనరులశాఖ ప్రత్యేక ప్ర ధాన కార్యదర్శి, ఏపీ జలవనరులశాఖ ప్రభు త్వ సలహాదారు, ఈఎన్సీ, అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం సీఈ, అదేవిధంగా కృష్ణా, గోదావరి రివర్ మేనేజ్మెంట్ల బోర్డు (కేఆర్ఎంబీ)ల చైర్మన్లు, నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ (ఎన్‌డబ్ల్యూడీఏ), సీడబ్ల్యూసీ సీఈలను సభ్యులుగా నియమించింది. ఈ కమిటీలో ఏపీ నుంచి అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం అధికారికి చోటు కల్పించిన కేంద్రం, తెలంగాణ అంతర్రాష్ట్ర నదీజలాల విభాగం అధికారులకు చోటు కల్పించకపోవడం గమనార్హం. వాస్తవంగా నదీ జలాలకు సంబంధిం చి వివాదాలు, ట్రిబ్యునల్ అవార్డులు, నిబంధనలు, పొరుగు రాష్ర్టాలతో ఉన్న ఒప్పందా లు, ప్రాజెక్టులు తదితర అంశాలను అంతర్రా ష్ట్ర జలవనరుల విభాగం ఆధ్వర్యంలోనే కొనసాగుతాయి. కోర్టు పిటిషన్లు, ట్రిబ్యునల్ వాదలకు ఆ విభాగం అధికారులే కీలకంగా వ్యవహరిస్తారు. అయినప్పటికీ ఆ విభాగానికి చెంది న ఏపీ సీఈకి అవకాశం కల్పించిన కేంద్రం, తెలంగాణ అంతర్రాష్ట్ర జలవనరుల విభాగం అధికారులకు చోటు కల్పించలేదు. దీనిపై రేవంత్ ప్రభుత్వం అభ్యంతరం చెప్పకపోవడంపై ఇంజినీర్లు రగిలిపోతున్నారు.
ఇదిలా ఉంటే కమిటీలో రాష్ట్రం నుంచి ఆదిత్యానాథ్దాస్కు చోటు కల్పించడంపై ఇంజినీర్లు ఇప్పటికీ గుర్రు మీదనే ఉన్నారు. వాస్తవంగా ఆదిత్యానాథ్ దాస్‌ను సలహాదారుడిగా నియమించడంపైనే గతంలో రాష్ట్ర ఇంజినీర్లు తప్పుబట్టారు. రాష్ట్ర విభజన అనంతరం విశ్రాంత ఐఏఎస్ ఆదిత్యానాథ్‌దాస్ ఏపీకి కేటాయించబడ్డారు. తొలుత చంద్రబాబు హయాంలో ఐదేండ్లు, ఆ తరువాత జగన్మోహన్రెడ్డి సమయంలో చీఫ్‌సెక్రటరీగా పనిచేశారు. విరమణ పొందిన అనంతరం ఢిల్లీలో ఏపీ ప్రభుత్వ ప్రతినిధిగా కొనసాగారు. మొత్తంగా గడిచిన పదేండ్ల పాటు ఏపీ ప్రభుత్వ సేవలోనే ఉన్నారు. ఆ పదేండ్ల కాలంలో తెలంగాణ నీటిహక్కులను కాలరాసేందుకు ఏపీ ప్రభుత్వం తరపున ఆయన కీలకంగా పనిచేశారు. తెలంగాణ చేపట్టిన పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతలు, కాళేశ్వరం, సమ్మక్కసాగర్ ఇలా ప్రతి ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ కేంద్రానికి ఏపీ ప్ర భుత్వం తరపున అనేక లేఖలను రాశారు. కృష్ణా జలాల వాటాల విషయంలోనూ కొర్రీలు వేశారు. జగన్మోహన్రెడ్డి హయాంలో ఏకంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం చేపట్టడంలోనూ ఆయన కీలకంగా పనిచేశారు. అ లాంటి ఆయనను తెలంగాణ ప్రభుత్వం ఇరిగేషన్‌శాఖకు ప్రభుత్వ సలహాదారుడిగా నియమించుకుంది. కేంద్రం ఏర్పాటు చేసిన కీలకమైన కమిటీలోనూ ఆయనకే చోటు కల్పించా రు. ప్రస్తుతం కేంద్ర జల్శక్తిశాఖతో, ఏపీతో ఆదిత్యానాథ్ చర్చలు కొనసాగిస్తున్నారు. ప్ర భుత్వం సైతం ఆయనకే పెద్దపేట వేస్తూ, తెలంగాణ ఇంజినీర్లు, కీలకమైన అంతర్రాష్ట్ర నదీజలాల విభాగం అధికారులను దూరం పెడుతున్నది. నల్లమలసాగర్‌పై ఇటీవల నిర్వహించిన చర్చలన్నీ దాస్ కనుసన్నల్లో కొనసాగాయి.
ఏపీతోనే కాదు పొరుగున కర్ణాటకతోనూ కాంగ్రెస్ పెద్దలు ఏకపక్షంగా చర్చలు జరుపడంపై ఇంజినీర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. కృష్ణా, తుంగభద్ర, భీమా నదులపై కర్నాటక సర్కార్ ఇప్పటికే ఇబ్బడిముబ్బడిగా బరాజ్‌లను సైతం నిర్మించేందుకు సిద్ధమవుతున్నది. పలు ప్రాజెక్టుల సామర్థ్యాన్ని విస్తరించేందుకూ పూనుకుంటున్నది. కర్ణాటక ప్రతిపాదనలు అమలయితే రాష్ర్టానికి తీరని నష్టం వాటిల్లనున్నది. ఆ ప్రణాళికలు అమలైతే భవిష్యత్‌లో తుంగభద్ర నుంచి కృష్ణాలోకి వచ్చే జలాలు పూర్తిగా తగ్గిపోతాయి. ఫలితంగా కృష్ణా జలాలపైనే పూర్తిగా ఆధారపడిన తెలంగాణకు తీరని నష్టం వాటిల్లే ప్రమాదముందని ఇక్కడి ఇంజినీర్లు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కర్నాటక సర్కార్ ప్రతిపాదనలు ఎట్టి పరిస్థితుల్లో ఒప్పుకోబోమని నాటి బీఆర్ఎస్ సర్కార్ అనేకమార్లు తేల్చిచెప్పిందని, తాజాగా వాటిపై చర్చలకు రాష్ట్ర సర్కార్ కర్ణాటక నేతలను ఆహ్వానించడం, కొన్ని ప్రతిపాదనలపై చర్చలకు సంయుక్త కమిటీని ఏర్పాటు చేయడంపై అధికారులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
అవేకాదు పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం ప్రాజెక్టును 90టీఎంసీల నుం చి 45టీఎంసీలకు కుదించడం, వ్యతిరేకత వెల్లువెత్తడంతో మళ్లీ సవరించుకున్నది. గ తంలో కృష్ణాలో 500టీఎంసీలను రాసిస్తే తెలంగాణకు చాలంటూ ఇష్టారీతిన సీఎం రేవంత్ ప్రకటనలు చేయడంపై ఇంజినీర్లు మండిపడుతున్నారు. గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం సుదీర్ఘ పోరాటం ఫలితంగా కృ ష్ణా జలాలకు సంబంధించి కేంద్రం కీలక మార్గదర్శకాలను జారీ చేసిందని గుర్తుచేస్తున్నారు. ట్రిబ్యునల్1, ట్రిబ్యునల్ 2 రెం డింటి ద్వారా ఉమ్మడి ఏపీకి కేటాయించిన కృష్ణా జలాలు 1005టీఎంసీలతోపాటు, పోలవరం డైవర్షన్ వచ్చే ఉమ్మడి ఏపీకి 45 టీఎంసీలు మొత్తంగా 1050టీఎంసీలను పునర్విభజన చట్టంలోని సెక్షన్ 89 ప్రకా రం గాకుండా నూతన మార్గదర్శకాల ప్రకా రం విచారణ కొనసాగుతున్నది. ప్రస్తుతం వాదనలన్నీ కీలకదశకు చేరుకున్నాయి. తెలంగాణకు పరీవాహక, సాగుభూమి, కరువు పీడిత ప్రాంతాలు ఇలా ఏ ప్రామాణికాలను తీసుకున్నా మొదటి ప్రాధాన్యతగా అత్యధిక మొత్తంలో జలాలు ఇచ్చే అ వకాశముంటున్నదని తెలుపుతున్నారు. ప్రభుత్వం గుట్టుగా రాజకీయపర నిర్ణయాలను తీసుకుంటుండటంపై ఇంజినీర్లలో ఆందోళన నెలకొన్నది.