హైదరాబాద్ సిటీబ్యూరో, మార్చి 31(నమస్తే తెలంగాణ) : రాష్ట్రంలోని వివిధ దేవాలయాల్లో వేదపారాయణదారు పోస్టుల భర్తీకి గతంలో మాదిరిగా మౌఖిక పరీక్ష మాత్రమే నిర్వహిస్తామని దేవాదాయ శాఖ స్పష్టంచేసింది. ‘వేదపండితులకు రాతపరీక్షలా” శీర్షికతో ‘నమస్తే తెలంగాణ’ దినపత్రికలో మంగళవారం కథనం ప్రచురితమైన నేపథ్యంలో దేవాదాయ శాఖ స్పందించింది. గతంలో ఏవిధంగా పరీక్షలు నిర్వహించామో ఇప్పుడు కూడా అదే మాదిరిగా వేదపారాయణదారు పోస్టులకు మౌఖికంగానే పరీక్షలు నిర్వహిస్తామని దేవాదాయ శాఖ అడిషనల్ కమిషనర్ శ్రీనివాసరావు పేర్కొన్నారు. ‘నమస్తే తెలంగాణ’ కథనంపై మంగళవారం ఆయన ఈ మేరకు ఒక ప్రకటనలో వివరణ ఇచ్చారు. రాష్ట్రవ్యాప్తంగా 324 మతపరమైన ఉద్యోగాల భర్తీకి గత డిసెంబర్లో నోటిఫికేషన్ జారీ చేసిన దేవాదాయ శాఖ.. స్థానాచార్య, వేదపారాయణదారు, అర్చకులకు మౌఖిక పరీక్షతోపాటు రాత పరీక్ష కూడా నిర్వహిస్తామని పేర్కొన్నది. వేదపారాయణానికి రాత పరీక్షలేమిటని వేదపండితుల నుంచి తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి.
ఈ నేపథ్యంలో వేదపారాయణదారు పోస్టులకు మౌఖిక పరీక్ష మాత్రమే నిర్వహిస్తామని శ్రీనివాసరావు స్పష్టం చేశారు. దేవాదాయ శాఖ పరిధిలోని పలు దేవాలయాల్లో ఏర్పడిన మతపర ఉద్యోగ ఖాళీలను భర్తీ చేయడానికి వివిధ దేవాలయాల ఈవోలు.. అర్హత గల అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించారని తెలిపారు. ఇందులో భాగంగా వివిధ దేవాలయాల్లో 12 వేదపారాయణదారు పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేశామని వివరించారు. గతంలో వివిధ దేవాలయాల్లో ఖాళీగా ఉన్న వేదపారాయణదారు పోస్టులను ప్రత్యక్ష నియామకం ద్వారా భర్తీ చేశామని, పత్రికా ప్రకటన ద్వారా దరఖాస్తులను స్వీకరించి ఆయా వేదాల్లో నిష్ణాతులను కమిటీ సభ్యులుగా నియమించి అభ్యర్థులకు మౌఖిక పరీక్ష నిర్వహించి నియామకాలు చేపట్టామని వెల్లడించారు. ప్రస్తుతం చేపట్టనున్న నియామక ప్రక్రియ కూడా గతంలో మాదిరిగానే నిర్వహిస్తామని, ఈ ప్రక్రియ మొత్తం ప్రభుత్వం నియమించిన నిష్ణాతుల కమిటీ ఆధ్వర్యంలోనే జరుగుతుందని స్పష్టం చేశారు. దీంతో ఆయా వేద పరీక్షలకు హాజరయ్యే అభ్యర్థుల్లో ఆందోళన తొలగింది.