కోర్టు తీర్పులు ఖాతరు చేయడం లేదు. రెవెన్యూ విభాగం హెచ్చరికలను అస్సలు పట్టించుకోవడం లేదు. పోలీసులు కేసులు నమోదు చేసినా బెదరడం లేదు. నగరం నడిబొడ్డున ఉన్న సర్కారు స్థలాన్ని అక్రమంగా చేజిక్కించుకోవడమే లక్ష్యంగా ఓ కబ్జారాయుడు పదే పదే ప్రయత్నం చేస్తున్నాడు. ఏకంగా అధికారులకే సవాల్ విసురుతున్నాడు. సర్కారు స్థలమని అధికారులు బోర్డు పెట్టిన మరుక్షణమే.. ఆ బోర్డును తొలగిస్తున్నాడు. ఆ స్థలం తనదిగా ప్రచారం చేసుకుంటున్నాడు. నగరం నడిబొడ్డున 300 కోట్ల విలువైన సర్కారు స్థలం కథ ఇది.
గత ఏడాది డిసెంబర్లో, ఈ ఏడాది ఫిబ్రవరిలో కూడా ఈ స్థలాన్ని ఆక్రమించేందుకు పార్థసారథి గ్యాంగ్ యత్నిస్తున్న వ్యవహారంపై నమస్తే తెలంగాణ వరుస కథనాలు ప్రచురించింది. ఈ నేపథ్యంలో జిల్లా రెవెన్యూ యంత్రాంగం, జలమండలి ఉన్నతాధికారులు రంగంలోకి దిగిన స్థలాన్ని కాపాడారు. జలమండలికి ఇచ్చిన 1.20 ఎకరాల స్థలంలో విజిలెన్స్ విభాగం నిఘా ఏర్పాటు చేశారు. ఇదిలా ఉండగా నెలరోజుల క్రితం పార్థసారథి సిటీ సివిల్ కోర్టులో వేసిన కేసులో 1.20 ఎకరాల స్థలం జలమండలిదే అని తీర్పు వచ్చింది.
రెవెన్యూ ఆధీనంలో ఉన్న మూడెకరాల ప్రభుత్వ స్థలంలో కాగా వారం రోజులుగా కొంతమంది వ్యక్తులు ప్రవేశించడంతో పాటు స్థలం బయట ఏర్పాటు చేసిన ప్రభుత్వ హెచ్చరిక బోర్డులు తొలగించారు. స్థలం బయట ఉన్న షీట్లపై రాసిన ప్రభుత్వ హెచ్చరిక బోర్డులను సైతం తుడిచివేశారు. స్థలం లోపల వేటకుక్కలను పెట్టుకుని బయటి వ్యక్తులు రాకుండా గేట్లు పెట్టుకున్నారు. స్థానికులు లోపలికి వస్తే దాడులకు తెగబడుతున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ స్థలం తమదే అని, అందుకే పొసెషన్‌లో తమ మనుషులే ఉన్నారంటూ బిల్డర్లను నమ్మించి అడ్వాన్సులు దండుకుంటున్నారనే గుసగుసలు వినిపిస్తున్నాయి. కాగా నగరం నడిబొడ్డున ఖరీదైన స్థలంలోకి పలుమార్లు చొచ్చుకు వచ్చి ఆక్రమించుకునేందుకు యత్నిస్తున్న ప్రైవేటు వ్యక్తుల ధీమాకు కారణం ఏమిటని ప్రశ్నలు వినిపిస్తున్నాయి. తెలంగాణ ప్రభుత్వంలోని కీలక వ్యక్తుల మద్దతుతోనే ఈ స్థలాన్ని ఆక్రమించుకునేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. వెంటనే రెవెన్యూ ఉన్నతాధికారులు స్పందించి ఖరీదైన ప్రభుత్వ స్థలంలోకి ప్రైవేటు వ్యక్తులు రాకుండా చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు.
బంజారాహిల్స్ రోడ్డు నంబర్ 10లో బసవతారకం క్యాన్సర్ ఆస్పత్రి ఎదురుగా 3.2 ఎకరాల ఖాళీ స్థలం ఉంది. ఇది షేక్‌పేట మండల పరిధిలోని సర్వే నెంబర్ 403/పీ లోకి వచ్చే టీఎస్ నెంబర్ 111, బ్లాక్- హెచ్, వార్డు-10లో 20 ఎకరాల ఖాళీ ప్రభుత్వ స్థలంలో భాగంగా ఉంది. ఇందులో నుంచి ఒక ఎకరం స్థలాన్ని 1998లో తట్టిఖానా సెక్షన్ జలమండలి రిజర్వాయర్‌ను నిర్మించారు. 1999లో మరో 1.20 ఎకరాల స్థలాన్ని కూడా జలమండలి కోసం కేటాయించారు. కాగా, ఈ రెండు స్థలాల మధ్యన సుమారు 3.20 ఎకరాల ఖాళీ ప్రభుత్వ స్థలం ఉంది. అయితే జలమండలికి కేటాయించిన 1.20 ఎకరాల స్థలంతో పాటు ఖాళీగా ఉన్న 3.20 ఎకరాల రెవెన్యూ స్థలాన్ని గత కొన్నేళ్లుగా బోగస్ పత్రాలతో పరుశరామ్ పార్థసారథి అనే వ్యక్తి కాజేసేందుకు పలు రకాలైన ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ స్థలం సర్వే నెంబర్ 403/52/పీగా పేర్కొంటూ సదరు స్థలంలో తిష్టవేయగా షేక్‌పేట రెవెన్యూ అధికారులు ఇచ్చిన ఫిర్యాదులతో మూడేళ్ల క్రితం పార్థసారథిపై ఫోర్జరీతో సహా పలు సెక్షన్ల కింద బంజారాహిల్స్ పోలీస్‌స్టేషన్‌లో క్రిమినల్ కేసులు నమోదు చేశారు.
బంజారాహిల్స్ రోడ్ నెం 10లోని బసవ తారకం క్యాన్సర్ ఆస్పత్రి ఎదురుగా.. జలమండలి రిజర్వాయర్ పక్కనున్న స్థలం సర్వే నెంబర్ 403/పీ లోకి వచ్చే టీఎస్ నెంబర్ 111, బ్లాక్- హెచ్, వార్డు-10లోనిది. ఈ స్థలం మొత్తం ప్రభుత్వానిదే. ఈ స్థలంలోకి ఎవరు ప్రవేశించినా చర్యలు తప్పవు. నాన్ ఎగ్జిస్టింగ్ సర్వేనెంబర్లతో బోగస్ పత్రాలు సృష్టించి స్థలాన్ని కాజేసేందుకు యత్నిస్తున్న వారిపై గతంలోనే పోలీసులకు ఫిర్యాదు చేశాం. క్రిమినల్ కేసులు కూడా నమోదయ్యాయి. అయితే ఇటీవల ప్రభుత్వ హెచ్చరిక బోర్డులు తొలగించారన్న సమాచారం రాలేదు. వెంటనే సిబ్బందిని పంపి తగు చర్యలు తీసుకుంటాం.