సిద్దిపేట, ఏప్రిల్ 9: పట్టుదలతో శ్రమిస్తే అసాధ్యం అనేది ఏదీ లేదని, నిరుద్యోగ యువత ప్రణాళికాబద్ధంగా పోటీపరీక్షలకు సిద్ధం కావాలని ఆర్థిక మంత్రి హరీశ్‌రావు సూచించారు. శనివారం సిద్దిపేట తెలంగాణ భవన్లో జడ్పీ అధ్యక్షురాలు వేలేటి రోజాశర్మ, సీపీ శ్వేత, అడిషనల్ కలెక్టర్ ముజామ్మిల్ ఖాన్‌తో కలిసి ‘కేసీఆర్ ఉచిత శిక్షణ శిబిరం’, పోలీస్ కన్వెన్షన్ హాల్లో ఉద్యోగ మేళా, పోలీస్ కానిస్టేబుల్ శిక్షణ కేంద్రాన్ని మంత్రి హరీశ్‌రావు ప్రారంభించారు. ఈ సందర్భంగా యువతతో మాట్లాడుతూ.. ‘మీరు ఉద్యోగాలు సాధించినప్పుడే మాకు మరింత ప్రోత్సాహం ఉంటుంది.
మరింత మందికి శిక్షణ ఇవ్వాలనే ఉత్సా హం వస్తుంది. శిక్షణ పొంది ఉద్యోగం సాధించినప్పుడే సార్థకత ఏర్పడుతుంది. ఈ ఉచిత శిక్షణ శిబిరంలో ఏదీ ఉచితంగా రాలేదు. ఉ ద్యోగ అభ్యర్థులంతా కష్టపడి చదవాలి. నిరాశ చెందకుండా ప్రణాళికాబద్ధంగా పోటీ పరీక్షలకు సిద్ధం కావాలి’ అని ఉద్భోద చేశారు. రాదనుకున్న తెలంగాణను 14 ఏండ్లు కొట్లాడి తెచ్చుకొన్నామని, మూడున్నరేండ్లలోనే కాళేశ్వరం ప్రాజెక్టు కట్టి, గోదావరి నీళ్లను తీసుకొచ్చి చరిత్ర తిరగరాశామని చెప్పారు. జోనల్ వ్యవస్థ తెచ్చి 95 శాతం ఉద్యోగాలు స్థానికుల కే దక్కేలా చేశామని, ఎప్పటికప్పుడు ఉద్యోగ ఖాళీలను భర్తీ చేసేందుకు ఉద్యోగ క్యాలెండర్‌ను ఏర్పాటు చేస్తామని అన్నారు.
సీఎం కేసీఆర్ 317 జీవో తెస్తే, దాన్ని బీజేపీ రాద్ధాంతం చేసిందని విమర్శించారు. ఉద్యోగాలు సాధించేవరకు అభ్యర్థులు సెల్ఫోన్లు, ఇంట్లో టీవీలను బంద్ చేయాలని సూచించారు. సోషల్ మీడియా, వాట్సాప్, ట్విట్టర్, ఫేస్బుక్ వంటి వాటి జోలికి పోవద్దని చెప్పారు.
విపంచి కళా నిలయంలో ఆశ వర్కర్లకు స్మార్ట్ ఫోన్లు అందజేసిన మంత్రి.. రాష్ట్రంలో 27 వేల మంది ఆశవర్కర్లు ఉన్నారని, ఆశ వ్యవస్థ బలంగా ఉంటేనే ప్రజల ఆరోగ్యం బాగుంటుందని చెప్పారు. ఆశ కార్యకర్తలతో తాను ప్రతి నెల 3న కాన్ఫరెన్స్ కాల్లో మాట్లాడుతానని తెలిపారు. బాగా పనిచేసిన వారికి ప్రో త్సా హం ఉంటుందని వెల్లడించారు. ప్రసవాల కోసం తెలంగాణలో సీ-సెక్షన్ ఆపరేషన్లు ఎక్కువవుతున్నాయని, రాష్ట్రంలో 62 శాతం పెద్ద ఆపరేషన్లు జరుగుతున్నాయని, దీన్ని మా ర్చాలని అన్నారు. అమెరికా లాంటి దేశాల్లో 80 శాతం నార్మల్ డెలివరీలు అవుతున్నాయ ని, ఆపరేషన్లతో తల్లీబిడ్డకు ఇబ్బందులు వస్తాయని గుర్తుచేశారు. రాష్ట్రంలో 34 శాతం మం ది శిశువులు పుట్టిన మొదటి గంటలో తల్లిపాలకు దూ రమవుతున్నారని, దీన్ని క్షేత్రస్థాయిలో మార్చాల్సిన బాధ్యత ఆశలపై ఉన్నదని అన్నారు.
జిల్లాస్థాయిలోనే అన్ని రకాల వైద్యసేవలు అందుబాటులో ఉన్నాయని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని వైద్యారోగ్యశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు సూచించారు. రోగులను అనవసరంగా హైదరాబాద్ పంపొద్దని స్పష్టంచేశారు. అత్యవసర కేసులు తమ వద్దకే పంపాలని కిందిస్థాయి దవాఖానలకు సూచించాలని తెలిపారు. హెల్త్ క్యాలెండర్లో భాగంగా శనివారం డీఎంఈ పరిధిలోని దవాఖానల పనితీరుపై మంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. గత సమావేశాల్లో నిర్ణయించుకున్న లక్ష్యాలు, సాధించిన పురోగతి తదితర అంశాలపై దవాఖానలు, విభాగాలవారీగా వివరాలు అడిగి తెలుసుకున్నారు.
ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడుతూ.. ఆర్థోపెడిక్, జనరల్ సర్జరీ, ప్రసూతి, పీడియాట్రిక్ సహా అన్ని విభాగాల్లో ఆరోగ్యశ్రీ సేవలు మరింత విస్తరించాలని చెప్పారు. ఎన్ఐసీయూ, పీఐసీయూ సేవలు అందేలా చూడాలని, అనస్తీషియా విభాగం అన్నివేళలా అందుబాటులో ఉండాలని చెప్పారు. వారానికి ఒక విభాగంవారీతో సూపరింటెండెంట్లు సమీక్షలు నిర్వహించి, పురోగతి పరిశీలించాలని, డీఎంఈ క్షేత్రస్థాయికి వెళ్లి దవాఖానలను తనికీ చేయాలని ఆదేశించారు.
ప్రతి నెలా రివ్యూ ఉంటుందని, రిపోర్టులతో సిద్ధంగా ఉండాలని తెలిపారు. ప్రజలకు మంచి చేయడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని మరోసారి స్పష్టంచేశారు. ఈ మేరకు సీఎం కేసీఆర్ ఈ ఏడాది హెల్త్ బడ్జెట్‌ను పెంచారని, వైద్యులు, సిబ్బంది సహకారం అందిస్తే ఆరోగ్య తెలంగాణ సాకారం అవుతుందని చెప్పారు. కార్యక్రమంలో హెల్త్ సెక్రటరీ రిజ్వీ, డీఎంఈ రమేశ్‌రెడ్డి, సీఎం ఓఎస్డీ గంగాధర్, అన్ని దవాఖానల సూపరింటెండెంట్లు, ప్రిన్సిపాళ్లు, హెచ్వోడీలు, ఆర్ఎంవోలు, సీఎస్ ఆర్ఎంవోలు పాల్గొన్నారు.