న్యూఢిల్లీ: రానున్న ప్రతిష్ఠాత్మక ప్రపంచ బాక్సింగ్ టోర్నీలో సత్తాచాటుతానని యువ బాక్సర్ నిఖత్ జరీన్ ధీమా వ్యక్తం చేసింది. ఇస్తాంబుల్ వేదికగా వచ్చే నెల 6 నుంచి మొదలయ్యే మెగాటోర్నీ కోసం 12 మందితో కూడిన భారత బాక్సర్ల బృందం బయల్దేరి వెళ్లింది. ప్రపంచ చాంపియన్‌షిప్ కంటే ముందు మే 5 వరకు సన్నాహక శిబిరంలో బాక్సర్లు శిక్షణ పొందనున్నారు. ఈ నేపథ్యంలో మెగాటోర్నీలో తన గెలుపు అవకాశాలపై రాష్ట్ర స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ మీడియాతో మాట్లాడింది. ‘టోర్నీ కోసం ఆసక్తితో ఎదురుచూస్తున్నాను. ప్రస్తుతం మంచి ఫామ్మీదున్నాను. ప్రపంచ చాంపియన్‌షిప్ కోసం పూర్తిస్థాయిలో సిద్ధమయ్యాను. ముఖ్యంగా టెక్నికల్ విషయంలో బాగా మెరుగయ్యాను. ఫిట్నెస్ పరంగానే కాకుండా..మానసికంగా ధృడంగా ఉండేందుకు ప్రయత్నిస్తాను. సాయ్ కేంద్రాల ద్వారా బాక్సర్లకు మెరుగైన వసతి సౌకర్యాలు అందుతున్నాయి. అత్యుత్తమ శిక్షణతో పాటు బాక్సర్లకు కావాల్సిన మంచి డైట్ అందుబాటులో ఉంటుంది. గతంలో టెక్నికల్‌గా ఎదుర్కొన్న సమస్యలపై దృష్టి సారించి మెరుగుపర్చుకున్నాను. ప్రపంచ టోర్నీలో అత్యుత్తమ ప్రదర్శన కనబరుస్తానన్న నమ్మకం నాకుంది’అని జరీన్ చెప్పుకొచ్చింది.