హైదరాబాద్, ఫిబ్రవరి 1 (నమస్తే తెలంగాణ): దేశవ్యాప్తంగా కోట్ల మంది కూలీల కడుపు నింపుతున్న గ్రామీణ ఉపాధి హామీ పథకం ఉసురు తీసేందుకు కేంద్రం కుట్ర పన్నుతున్నది. ఏటా నిధుల కేటాయింపులు పెంచాల్సిన కేంద్రం.. తగ్గిస్తుండటంతో ఉపాధి హామీ భవిష్యత్తుపై అనుమానం వ్యక్తమవుతున్నది. దేశవ్యాప్తంగా 9.90 కోట్ల మంది ఉపాధి హామీ పనుల్లో పాల్గొంటున్నారు. వీరికి ఏటా గరిష్ఠంగా 100 రోజుల పనిదినాలను కల్పించాల్సి ఉన్నది. ఈ నేపథ్యంలో పథకానికి నిధులను పెంచాల్సిన కేంద్ర సర్కారు క్రమేణ తగ్గిస్తున్నది. 2020-21లో ఉపాధి హామీకి రూ.1.15 లక్షల కోట్లను కేటాయించింది. 2021-22లో రూ.98 వేల కోట్లు, 2022-23లో రూ.73 వేల కోట్లకే పరిమితం చేసింది.
తెలంగాణకే అత్యధిక నష్టం
ఉపాధి హామీని అత్యధికంగా సద్వినియోగం చేసుకొనే రాష్ర్టాల్లో తెలంగాణ ఒకటి. కూలీలకు పని కల్పించడంతోపాటు గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు గతేడాది అత్యధికంగా 15.79 కోట్ల పనిదినాలను రాష్ట్ర ప్రభుత్వం కల్పించింది. కరోనా సమయంలో పట్టణాల నుంచి గ్రామాలకు వలసపోయిన ప్రజలు అక్కడ ఉపాధి పనులు చేశారు. కేంద్ర నిర్ణయంతో తెలంగాణ ఎక్కువ నష్టపోయే అవకాశాలు ఉంటాయని ఆందోళన వ్యక్తమవుతున్నది.
ఊసే లేని పట్టణ ఉపాధి హామీ పథకం
పట్టణ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టాలని కోరుతూ రాష్ట్ర మున్సిపల్‌శాఖ మంత్రి కేటీఆర్ కేంద్రానికి లేఖ రాశారు. ఈ పథకాన్ని ప్రవేశపెట్టాలని కేంద్ర కార్మికశాఖ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ కూడా కేంద్రానికి సిఫారసు చేసింది. సీఐఐ కూడా ఉపాధి అవకాశాల కోసం పట్టణ ఉపాధి హామీ పథకం అత్యవసరమని కేంద్రాన్ని కోరింది. ఈ సంవత్సరం కనీసం ప్రయోగాత్మకంగానైనా దేశంలో ఈ పథకానికి శ్రీకారం చుడుతారని అంచనా వేశారు. కరోనా నేపథ్యంలో పట్టణాల్లోనే అధికంగా ఉపాధి కోల్పోయారు.