హైదరాబాద్, జూలై 25 (నమస్తే తెలంగాణ): రాష్ట్రంలోని ఉద్యోగులు, పెన్షనర్లకు వైద్య భరోసా కింద ప్రభుత్వం జారీచేసిన ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్ఎస్) కార్డులు పనిచేయడం లేదు. దవాఖానల్లో ఈ కార్డు చూపిస్తే వైద్యం చేయడం లేదు. మొత్తంగా ఈ స్కీమ్ కార్పొరేట్ దవాఖానల్లో అమలు కావడంలేదు. అత్యవసర పరిస్థితుల్లో వైద్యం కోసం వెళ్తే.. డబ్బులు కట్టి చికిత్స చేయించుకోవాలని ఆ దవాఖానల సిబ్బంది తేల్చిచెప్తున్నారు. ఈహెచ్ఎస్ కార్డు తీసుకుని దవాఖానలకు వెళ్లిన ఉద్యోగులు, పెన్షనర్లకు ఉచిత వైద్యం అందకపోవడంతో చికిత్స కోసం లక్షల రూపాయలు వెచ్చించాల్సి వస్తున్నది.
దీంతో ప్రభుత్వం వైద్య భరోసా పేరిట చెల్లని కార్డులిచ్చి చేతులు దులిపేసుకున్నదని ఉద్యోగులు, పెన్షనర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. తమ నుంచి రెండు నెలల ప్రీమియం ఎందుకు వసూలు చేశారని ప్రశ్నిస్తున్నారు. ఇంకో 3-4 రోజులు గడిస్తే మూడో ప్రీమియం కట్ చేయబోతున్నారని, ఈహెచ్ఎస్ కార్డులు చెల్లనప్పుడు వాటిని ఎందుకిచ్చారని నిలదీస్తున్నారు. ఈ విషయమై పలువురు ఉద్యోగులు ట్రస్టు బోర్డులోని ఉద్యోగ సంఘాల నేతలకు ఫోన్లు చేసి మీకు బాధ్యతలేదా? ఇంత జరుగుతున్నా ఎందుకు మౌనంగా ఉన్నారు? అంటూ ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు.
రాష్ట్రంలోని 8 లక్షల మంది ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లకు నగదురహిత చికిత్సలు అందించేందుకు ప్రభుత్వం ఈ నెల 17న ఈహెచ్ఎస్ను ప్రారంభించి, కొందరు ఉద్యోగులకు డిజిటల్ హెల్త్‌కార్డులను అందజేసింది. ఉద్యోగుల కుటుంబసభ్యులు కలిపి మొత్తంగా 29.80 లక్షల మంది లబ్ధిదారులకు నగదురహిత వైద్యం అందిస్తామని రేవంత్‌రెడ్డి సర్కార్ గొప్పలు చెప్పింది. కానీ, ఈ పథకం ప్రారంభమై వారం రోజులు దాటినా ఈహెచ్ఎస్ కార్డులు ఇంకా యాక్టివేట్ కావడం లేదు. ఆర్థిక శాఖ నుంచి ఈహెచ్ఎస్కు బదిలీ చేసిన ఉద్యోగుల డాటాలో చనిపోయిన వారి పేర్లు, పాత అడ్రస్‌లతోపాటు అనేక పొరపాట్లు ఉన్నాయి. ఉద్యోగుల కుటుంబసభ్యుల వివరాలు లేవు కేవలం ఉద్యోగి పేరుతో హెల్త్‌కార్డు జనరేట్ అయ్యింది. వారి కుటుంబసభ్యుల పేరిట కాలేదు. కొందరు ఉద్యోగుల ఈహెచ్ఎస్ కార్డులు డౌన్లోడ్ కావడంలేదు. దీంతో డాటాను అప్డేట్ చేసేందుకు ఆ వెబ్‌సైట్‌ను నిలిపివేశారు.
ఈహెచ్ఎస్ అమల్లోకి వచ్చి వారం గడిచినా ఇంకా మార్గదర్శకాలు వెలువడలేదు. ముసాయిదా మార్గదర్శకాలు సిద్ధమైనా ఇంతవరకు జీవో రూపంలో విడుదల కాలేదు. ఈ విషయంలో ఆర్థిక, ఆరోగ్య శాఖల అధికారుల మధ్య సమన్వయ లోపం కొట్టొచ్చినట్టు కనిపిస్తున్నది. సాక్షాత్తూ సీఎస్ చైర్మన్‌గా ట్రస్టు ఏర్పాటైనా కార్డుల విషయంలో పురోగతి కనిపించడం లేదు. కాగా, నెట్వర్క్ దవాఖానల వాదన మరోలా ఉన్నది. ముందు తమకు రూ.570 కోట్ల పాత బకాయిలు చెల్లించడంతోపాటు ప్యాకేజీ రేట్లను సవరించాలని ఆ దవాఖానల యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి.
ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్‌లో అనేక అడ్డంకులు ఎదురవుతున్నాయని, ఈహెచ్ఎస్ కార్డులు పనిచేయడం లేదని తెలంగాణ ప్రాంత ఉపాధ్యా సంఘం (తపస్) ధ్వజమెత్తింది. కార్డులు ఇవ్వకంటే ముందే ప్రభుత్వం ఉద్యోగుల నుంచి ప్రీమియంను కట్చేసినప్పటికీ ఇంకా ఈ స్కీమ్‌ను పకడ్బందీగా అమలు చేయకపోవడం శోచనీయమని మండిపడింది. ప్రభుత్వం ఇప్పటికైనా ప్రత్యేక చొరవతో అడ్డంకులను తొలగించి, ఉచిత వైద్యాన్ని ప్రారంభించాలని సంఘం రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు వోడ్నాల రాజశేఖర్, తెల్కలపల్లి పెంటయ్య డిమాండ్ చేశారు. మూడు నెలలు గడుస్తున్నా ఈహెచ్ఎస్ కార్డులు పనిచేయకపోవడం శోచనీయమని పేర్కొన్నారు.
ఈహెచ్ఎస్ కార్డులిచ్చి వారం దాటినా ఉచిత వైద్యం ఇంకా అందుబాటులోకి రాలేదు. ఇప్పటివరకు ఈ కార్డు ద్వారా కనీసం ఒక్క ఉద్యోగి కూడా వైద్యం పొందిన దాఖలాలు లేవు. ఇప్పటికే మా నుంచి 2 నెలల ప్రీమియం వసూలు చేసిన ప్రభుత్వం తన వాటా (కంట్రిబ్యూషన్) ఇచ్చిందా? అన్నది అనుమానంగానే ఉన్నది.
– మిట్టపల్లి రాధాకృష్ణారావు, తెలంగాణ ప్రోగ్రెసివ్ టీచర్స్ యూనియన్ అధ్యక్షుడు
ఈహెచ్ఎస్ వెబ్సైట్ నుంచి హెల్త్‌కార్డులు డౌన్లోడ్ కావడం లేదు. నెట్వర్క్ హాస్పిటల్స్‌లో అత్యధికంగా ప్రభుత్వ దవాఖానలే ఉన్నాయి. రూ.2 లక్షలలోపు మాత్రమే ట్రీట్మెంట్ చేస్తారట. ఈ హెల్త్‌కార్డు కంటే ఆరోగ్యశ్రీ నయం అనిపిస్తున్నది. డీఏలు, పీఆర్సీలను పెం డింగ్‌లో పెట్టి ప్రభుత్వం చోద్యం చూస్తున్నది. నేను మూడుసార్లు కోర్టు ధిక్కరణ కేసు వేస్తే రిటైర్మెంట్ బెనిఫిట్లు ఇచ్చారు. అయినప్పటికీ రూ. 20 లక్షల వడ్డీ నష్టపోయా. పీఆర్సీ, డీఏ వస్తే నె లకు రూ.25 వేలు అదనంగా వచ్చేవి.
– డాక్టర్ సింహారావు, రిటైర్డ్ ఉద్యోగి