e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Saturday, November 27, 2021
Home News కోతల్లేని కరెంటుకు ఏడేండ్లు

కోతల్లేని కరెంటుకు ఏడేండ్లు

  • అన్నిరంగాలకు నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా
  • అలుపెరగకుండా శ్రమించిన కార్మికులు, ఉద్యోగులు

హైదరాబాద్‌, నవంబర్‌ 25 (నమస్తే తెలంగాణ): ఒకవైపు సొంత రాష్ట్రం సాధించుకున్నామనే ఆనందం.. మరోవైపు తెలంగాణ వస్తే కటిక చీకట్లలో మగ్గుతారనే శాపనార్థాల కసి.. వీటన్నింటి మధ్య విద్యుత్తు రంగం అనూహ్య రీతిలో వెలుగులు విరజిమ్ముతున్నది. నిజానికి చిమ్మ చీకట్లలోనే తెలంగాణ రాష్ట్రం ఏర్పాటయ్యింది! ఇదే అదనుగా సీమాంధ్రులు వికృతచేష్టలకు దిగారు. సీలేరు జల విద్యుత్తును రాకుండా చేశారు. కృష్ణపట్నం విద్యుత్తును నిలిపివేశారు. విద్యుత్తు కొనుగోలు ఒప్పందాల (పీపీఏ)ను ఏకపక్షంగా రద్దు చేశారు. రాష్ట్రం ఏర్పడేనాటికి హైదరాబాద్‌లో రోజుకు కనీసం 4 గంటలపాటు విద్యుత్తు కోతలు.. పరిశ్రమలకు వారానికి రెండు రోజులపాటు పవర్‌ హాలిడే.. జిల్లా కేంద్రాల్లో రోజుకు 6 గంటలు.. మండల కేంద్రాలు, మున్సిపాలిటీల్లో ఎనిమిది గంటలకుపైగా విద్యుత్తు కోతలుండేవి.

గ్రామాల్లో ఉదయం 6 నుంచి సాయంత్రం 6 వరకు విద్యుత్తు ఆచూకీ దొరికేది కాదు. వ్యవసాయం పడకేసింది. పేరుకే ఆరు గంటల విద్యుత్తు. పరిశ్రమలు పక్క రాష్ర్టాలకు తరలివెళ్లడానికి సిద్ధంగా ఉన్నాయనే ప్రచారం జోరుగా సాగుతున్న రోజులవి. అలాంటి పరిస్థితి నుంచి కేవలం ఆరు నెలల్లోనే గృహ, వాణిజ్య, పారిశ్రామికరంగాలకు 24 గంటలపాటు నిరంతరాయంగా విద్యుత్తును సరఫరా చేసి చూపించారు ముఖ్యమంత్రి కేసీఆర్‌. విద్యుత్తు సంస్థల కార్మికులు, ఉద్యోగులు, అధికారుల నిరంతర శ్రమతో గృహ, వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు 24 గంటల విద్యుత్తును గడిచిన ఏడేండ్లుగా నిరంతరాయంగా అందిస్తూ చరిత్ర సృష్టించింది తెలంగాణ రాష్ట్రం. అరవై ఏండ్ల దుఃఖాన్ని, కష్టాన్ని.. ఆర్నెళ్లలోనే తీర్చిన ఘనతను తెలంగాణ విద్యుత్తు సంస్థలు సాధించాయి.

మొదటి జీవో.. మొదటి సమావేశం..

- Advertisement -

అధికారం చేపట్టగానే ముఖ్యమంత్రి కేసీఆర్‌ తొలి ప్రాధాన్యమిచ్చింది విద్యుత్తు రంగానికే. తెలంగాణ ప్రభుత్వం జారీ చేసిన మొదటి జీవో ట్రాన్స్‌కో, జెన్‌కో సీఎండీగా దేవులపల్లి ప్రభాకర్‌రావును నియామకానికి సంబంధించినదే. ముఖ్యమంత్రి కేసీఆర్‌ తొలి సమీక్ష సమావేశాన్ని విద్యుత్తుపైనే నిర్వహించడం విశేషం. స్వరాష్ట్రంలో నిరంతరాయంగా విద్యుత్తును సరఫరా చేసేందుకు వీలుగా సరఫరా, పంపిణీ నెట్‌వర్క్‌ను బలోపేతం చేశారు. తెలంగాణ పరిధిలోని థర్మల్‌ విద్యుత్తు కేంద్రాల్లో ప్లాంట్‌ లోడ్‌ ఫ్యాక్టర్‌ (పీఎల్‌ఎఫ్‌)ను 55-60 శాతం నుంచి 85 శాతానికిపైగా పెంచారు. సీఎం కేసీఆర్‌ మార్గదర్శకాల ప్రకారం విద్యుత్తు కొనుగోలు చేశారు.

ఎప్పటికప్పుడు సమీక్ష

శాఖాపరంగా ప్రతిరోజూ సమీక్షలు, సమావేశాలు ఉండేవి. సీఎం కేసీఆర్‌ కూడా ప్రతిరోజూ సమావేశం నిర్వహించేవారు. దీనికితోడుగా.. విద్యుత్తు వ్యవస్థపై ఉద్యోగులు, అధికారులకు నియంత్రణ సాధించారు. అంతర్గత నష్టాలను తగ్గించారు. వ్యవసాయ లోడును ప్రాంతాలవారీగా విభజించి.. మొత్తం రాష్ట్రంపై లోడు భారాన్ని తగ్గించారు. పంటలు ఎండిపోకూడదన్న లక్ష్యంతో అవసరమైన మేర విద్యుత్తును కొనుగోలు చేశారు. గృహ, వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు 2014 నవంబర్‌ 20 నుంచి నిరంతరాయంగా 24 గంటలపాటు విద్యుత్తును అందించడం ప్రారంభించారు.

చరిత్రను తిరగరాశాం

రాష్ట్రం ఏర్పడినప్పుడు గరిష్ఠ విద్యుత్తు డిమాండ్‌ 6,666 మెగావాట్లు కాగా.. ఇప్పుడది 13,688 మెగావాట్లకు (26.3.2021) చేరింది. గడిచిన ఏడేండ్లలో 7,022 మెగావాట్లు(105.34 శాతం) పెరిగింది. రాష్ట్రం వచ్చేనాటికి విద్యుత్తు వినియోగం 144.1 మిలియన్‌ యూనిట్లు ఉండగా.. నేడు అది 283.38 మిలియన్‌ యూనిట్లు (26.3.2021)కు చేరింది. అంటే 96.66 శాతం (139.28 మిలియన్‌ యూనిట్లు) వృద్ధి చెందింది. రాష్ట్రం ఏర్పడేనాటికి తలసరి విద్యుత్తు వినియోగం 1,356 యూనిట్లు ఉండగా.. 2020-21లో 2,012 యూనిట్లకు పెరిగింది.

ఇది జాతీయ సగటు వినియోగం 1,161 యూనిట్ల కంటే 73 శాతం అధికం. రాష్ట్రం ఏర్పడినప్పుడు 7,778 మెగావాట్ల స్థాపిత విద్యుత్‌ సామర్థ్యం ఉండగా.. నేడది 16,616 మెగావాట్లకు చేరింది. రాష్ట్రం ఏర్పడిన తరువాత విద్యుత్తు సరఫరా, పంపిణీ వ్యవస్థల బలోపేతానికి రూ.32,963 కోట్లను ఖర్చు పెటారు. దేశంలోనే విద్యుత్తు సరఫరా (ట్రాన్స్‌మిషన్‌)లో అతి తక్కువ నష్టాలు 2.47 శాతం ఉన్న రాష్ట్రంగా తెలంగాణ నిలిచింది. ఏ రాష్ట్రం చేయని విధంగా 23,667 మంది కాంట్రాక్టు ఉద్యోగులు, కార్మికులను రెగ్యులరైజ్‌ చేసింది తెలంగాణ ప్రభుత్వం. 2015 జనవరి 1 నుంచి వ్యవసాయానికి 9 గంటలపాటు విద్యుత్తును ఏక బిగిన అందించింది. ఇక 2018 జనవరి 1 నుంచి 24 గంటలపాటు నిరంతరాయంగా అందిస్తున్నది.

సీఎం కలను నిజం చేస్తున్నందుకు సంతోషం వేసింది..!

ఏడేండ్లుగా నిరంతరాయంగా విద్యుత్తును అందిస్తున్నామంటేనే ఒళ్ళు పులకరిస్తున్నది. ఈ ఘనత సాధించడం వెనుక సీఎం కేసీఆర్‌ మార్గదర్శకం.. మాకు ఇచ్చిన స్వేచ్ఛ.. విద్యుత్తు సంస్థల కార్మికులు, ఉద్యోగుల సంఘటిత శక్తి ఉన్నది. ముఖ్యమంత్రి కేసీఆర్‌ రోజుకు రెండు, మూడుసార్లు సమీక్షించిన రోజులున్నాయి. రాత్రి 11, 12 గంటలకు కూడా ఫోను చేసి సూచనలు ఇచ్చేవారు. నాగార్జునసాగర్‌లో నాలుగు విద్యుత్తు సంస్థల డైరెక్టర్లతో మేధోమథనం చేశాం. రాష్ట్ర అవసరాల మేరకు స్వల్ప, మధ్య, దీర్ఘకాలిక చర్యలు తీసుకున్నాం. అనుకున్న మేరకు 2014 నవంబర్‌ మూడో వారంలో గృహ, వాణిజ్య, పారిశ్రామిక రంగాలకు 24 గంటల విద్యుత్తును అందించడం ప్రారంభించాం. ఆరోజు.. సీఎం కలను నిజం చేస్తున్నందుకు చాలా సంతోషం వేసింది. వ్యవసాయానికి 24 గంటల పూర్తి ఉచిత నిరంతరాయ విద్యుత్తు సరఫరా అనేది నభూతో.. నభవిష్యత్‌..! -దేవులపల్లి ప్రభాకర్‌రావు, సీఎండీ, ట్రాన్స్‌కో, జెన్‌కో

Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement

ట్రెండింగ్‌

Advertisement