Election promises | సిరిసిల్ల టౌన్, జూన్ 30 : తెలంగాణ ఉద్యమకారులకు ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి డిమాండ్ చేశారు. తెలంగాణ ఉద్యమ కారుల ఫోరం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ముందు జిల్లా అధ్యక్షుడు వెంగళ శ్రీనివాస్ ఆధ్వర్యంలో సోమవారం శాంతియుత దీక్ష కార్యక్రమం నిర్వహించారు. బీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు జిందం చక్రపాణి ఆధ్వర్యంలో నాయకులు ఈ దీక్షా శిబిరానికి మద్దతు తెలిపి సంఘీభావం ప్రకటించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల హామీ ప్రకారం ఉద్యమకారులకు 250 గజాల ఇంటి స్థలం ఇవ్వాలని, ప్రతీ నెల రూ.25వేల ఫించన్ అందించాలని డిమాండ్ చేశారు.
అదేవిధంగా ఉద్యమకారుల కోసం ప్రత్యేక నిధి ఏర్పాటు చేసి రూ.10వేల కోట్లు కేటాయించాలన్నారు. ప్రభుత్వం ఉద్యమకారుల గుర్తింపునకు కమిటీ ఏర్పాటు చేసి, గుర్తింపు కార్డులు అందజేయాలని సూచించారు. ప్రభుత్వ పథకాల అమలులో 20 శాతం కేటాయించాలని, ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని, తదితర డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని అన్నారు. అనంతరం ఆర్డీవో కార్యాలయంలో వినతిపత్రం అందజేశారు. తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా అధ్యక్షుడు వెంగళ శ్రీనివాస్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల సమయంలో ఉద్యమకారులను ఆదుకుంటామని అనేక హామీలు ఇచ్చిందని తెలిపారు.
అధికారంలోకి వచ్చి 18 నెలలు గడుస్తున్నా కనీసం తమ సమస్యలపై స్పందించకపోవడం బాధాకరమన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తమ డిమాండ్లను పరిశీలించి వెంటనే అమలు చేయాలని అన్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి వెంగళ లక్ష్మణ్, తంగళ్లపల్లి మండల కన్వీనర్ కందుకూరి రామాగౌడ్, నాయకులు బింగి ఇజ్జగిరి, మామిడాల రమణ, కొండ శంకర్, కొక్కుల ఆంజనేయులు, గుజ్జె దత్తాద్రి, సబ్బని శాంత మోత్కు తార, కర్నె లక్ష్మీ, చిలుక శారద తదితరులు పాల్గొన్నారు.