ములుగు/కృష్ణకాలనీ, డిసెంబర్ 14 (నమస్తే తెలంగాణ) : ములుగు జిల్లా జాకార పోలింగ్ బూత్‌లో ఎన్నికల అధికారి కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థికి ఓటు వేయాలని ప్రచారం చేసినట్టు ఫిర్యాదులు వచ్చాయి. గ్రామానికి చెందిన ఓ మహిళా ఓటు వేసేందుకు పోలింగ్ బూత్‌లోకి వెళ్లగా, సిరా గుర్తు వేసే అధికారి కాంగ్రెస్ అభ్యర్థి బ్యాట్ గుర్తుకు ఓటు వేయాలని చెప్పిందంటూ ఆమె బయటకు వచ్చి తన భర్త దాసరి రమేశ్‌కు తెలిపింది. దీంతో రమేశ్ పోలింగ్ కేంద్రంలోకి వెళ్లేందుకు ప్రయత్నించారు. బీఆర్ఎస్ నాయకులతో కలిసి గేటు వద్ద నిరసన తెలిపారు. అలాగే జయశంకర్ భూపాలపల్లి జిల్లా కేంద్రం సమీపంలోని దీక్షకుంట గ్రామంలోని పోలింగ్ కేంద్రంలోనూ అధికారులు కాంగ్రెస్ బలపరిచిన అభ్యర్థి చేపూరి స్వరూప మధుసూదన్‌రెడ్డికి ఓటు వేయాలని ఓటర్లను ప్రేరేపించారని పలువురు ఓటర్లు తెలిపారు.