ఇనుపరాడ్డుతో తలపై మోదిన కూతురు
అమ్మమ్మ పళ్లు ఊడగొట్టిన మనవరాలు
ఆస్తి కోసం కర్కశంగా వ్యవహరించిన వైనం
వృద్ధురాలిపై దాడికి పాల్పడిన యువతికి కార్పొరేటర్ అండ
వెంగళరావునగర్, డిసెంబర్ 27: నవమాసాలు మోసి..కని పెంచి పెద్ద చేసిన కూతురు కఠినంగా మారింది. ఆస్తి కోసం కర్కశంగా వ్యవహరించింది. తల్లి తలపై ఇనుపరాడ్డుతో మోదింది. గుండెలపై ఆడించిన మనవరాలు సైతం అమ్మమ్మ పళ్లూడగొట్టింది. ఈ అమానవీయ ఘటన ఎస్ఆర్నగర్ పోలీస్స్టేషన్ పరిధిలోని అంకమ్మ బస్తీలో చోటుచేసుకుంది. అంకమ్మబస్తీలో ఉంటున్న ఏడు పదుల వయసున్న యామల నాగమ్మకు కుమారుడు, కుమార్తె సంతానం. ప్రభుత్వం ఇచ్చిన పట్టాలో పూరి గుడిసె వేసుకొని నివాసముండేది. ఆమె భర్త చనిపోయాడు. ఇండ్లల్లో పాచిపనులు చేసుకొని.. నాగమ్మ తన ఇద్దరు పిల్లల్ని సాకింది. కుమారుడు, కూతురికి పెండ్లిండ్లు చేసింది. కుమారుడు బోరబండలో నివాసముంటున్నాడు. కుమార్తె పార్వతికి కొండ, అంజమ్మ, అంకమ్మలనే ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఆమె భర్త ఎటో వెళ్లిపోవడంతో బిడ్డ పడే కష్టాలను చూడలేకపోయింది ఆ మాతృహృదయం. కూతురు పార్వతి, ఆమె ముగ్గురు పిల్లలు కొండ, అంకమ్మ, అంజమ్మలను చేరదీసింది నాగమ్మ. మనవళ్ల పోషణ కోసం మరిన్ని కష్టాలు పడి వారిని కూడా పోషించింది. అయితే అంకమ్మబస్తీలోని పట్టాభూమిని తన పేరిట రాయాలని కూతురు పార్వతి, ఆమె ముగ్గురు పిల్లలు ఒత్తిడి చేసేవారు. అందుకామె నిరాకరించింది. తన తదనంతరం ఆస్తి తీసుకోవాలని..ఇప్పుడు మీకు ఇచ్చేస్తే తనకు అన్నం ఎవరు పెడ్తారంటూ ఆ వృద్ధురాలు చెప్పింది. అమ్మ ఆస్తి ఇవ్వకపోవడంతో కూతురు కక్షగట్టింది. ఇంట్లో నిద్రిస్తున్న తల్లిపై దాడి చేసింది పార్వతి. తలపై ఇనుపరాడ్డుతో కొట్టింది. మనవరాలు అంజమ్మ దాడి చేయడంతో వృద్ధురాలి రెండు పండ్లు ఊడిపోయాయి. స్థానికులు ఆమెను వైద్యశాలలో చేర్చారు. చికిత్స తర్వాత వచ్చిన తల్లిని పార్వతి ఇంట్లోకి రానీవ్వలేదు. దీంతో రోడ్డుపైనే ఉంటూ.. ఆకలిదప్పికలతో అలమటిస్తోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
ఆకలి తీరుస్తున్న స్థానికులు..
నాగమ్మకు అన్నంపెట్టి ఆకలి తీరుస్తున్నారు స్థానికులు. తనపై కూతురు, ఆమె ముగ్గురు పిల్లలు దాడి చేసి.. ఆస్తి కాగితాలను లాక్కుని..ఇంట్లోకి రానివ్వడం లేదని వాపోతున్నది నాగమ్మ. తన మనవరాలు అంజమ్మ అమీర్పేట బీజేపీ కార్పొరేటర్ సరళ ఇంట్లో పనిమనిషిగా చేస్తున్నదని.. దీంతో సరళ నిందితులకు వత్తాసుపలికి వారికి అండదండలు అందిస్తున్నదని నాగమ్మ ఆరోపిస్తున్నది. కేసు పెట్టినా ఏం చేయలేవంటూ తన మనవరాలు అంజమ్మ తనను దుర్బాషలాడి బెదిరిస్తోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నది. న్యాయం చేయాలని కోరుతున్నది.