బాన్సువాడ రూరల్/పిట్లం/భీమ్‌గల్/జడ్చర్లటౌన్, జూన్ 5 : నిజామాబాద్, కామారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల్లో శుక్రవారం వేర్వేరుగా జరిగిన ఘటనల్లో ఎనిమిది మంది జల సమాధి అయ్యారు. కామారెడ్డి జిల్లా పిట్లం మండలం బోలక్‌పల్లి శివారులోని మంజీర తీరంలో తల్లి, కూతురితోపాటు మరో బాలిక, నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలం లింబాద్రి గుట్ట సమీపంలో నీటి కుంటలో మునిగి ముగ్గురు, మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల మండలం కిష్టంపల్లి చెరువులో ఇద్దరు మరణించారు. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. కామారెడ్డి జిల్లా పిట్లం మండలం కిష్టాపూర్‌కు చెందిన పండరి.. బోలక్‌పల్లి శివారులోని మంజీర నది వద్ద శుక్రవారం ఎల్లమ్మ పండుగ చేశారు.
ఈ కార్యక్రమానికి తన ఇద్దరు అన్నలు, అక్కాచెల్లెళ్లు వచ్చారు. పండుగ ముగించుకుని సాయంత్రం ఇంటికి తిరిగి వెళ్లే క్రమంలో పండరి కుమార్తె పవనశ్రీ (15), సోదరి అనిత (35), ఆమె కూతురు శివాని (13)తోపాటు భానుప్రసాద్, సుషాంత్ సరదాగా మంజీర నది నీటి వద్దకు వెళ్లారు. అందులో ఒకరు ప్రమాదవశాత్తు కాలి జారి నీటిలో పడిపోగా, కాపాడేందుకు ఒక్కొక్కరుగా నీటిలోకి దూకారు. వారంతా మునిగిపోతూ కేకలు వేయగా, మిగతా కుటుంబ సభ్యులు పరిగెత్తుకుంటూ వచ్చి వారిని బయటకు తీశారు. అంబులెన్స్‌లో హుటాహుటిన బాన్సువాడ దవాఖానకు తరలించారు. వైద్యులు పరీక్షించి.. అనిత, శివాని, పవనశ్రీ అప్పటికే మృతి చెందినట్టు ధ్రువీకరించారు. అపస్మారక స్థితిలో ఉన్న భానుప్రసాద్, సుషాంత్కు వైద్యం అందించడంతో ప్రాణాలతో బయటపడ్డారు.
నిజామాబాద్ జిల్లా భీమ్‌గల్ మండలంలోని ప్రముఖ పుణక్షేత్రం లింబాద్రి గుట్ట సమీపంలోని ఒడ్డెర కాలనీకి చెందిన ద్యారంగుల సురేశ్ కుమారుడు అరవింద్ (4), కంది మహేశ్ కూతురు వర్షిణి (5), కుమారుడు హరీశ్ (10) శుక్రవారం ఉదయం ఆడుకుంటూ సమీపంలోని బ్రాహ్మణ కుంట వద్దకు వెళ్లారు. ఇంటి నుంచి బయటకు వెళ్లిన చిన్నారులు ఎంతకూ తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అటవీ ప్రాంతంలో వెతికినా ఆచూకీ లభించలేదు. పిల్లలు కనిపించడం లేదని సురేశ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రంగంలోకి దిగిన పోలీసులు పరిసరాల్లో గాలించినా లాభం లేకపోయింది. చివరకు ఫైర్ సిబ్బంది, గజ ఈతగాళ్ల సాయంతో బ్రాహ్మణ కుంటలో వెతుకగా ముగ్గురి మృతదేహాలు వెలుగుచూశాయి.
మహబూబ్‌నగర్ జిల్లా జడ్చర్ల పట్టణంలోని నిమ్మబావిగడ్డకు చెందిన సోహెల్ (14), అబ్దుల్ రెహమాన్(15) మరో ఇద్దరు మిత్రులతో కలిసి శివారులోని కిష్టంపల్లి గ్రామ ఎర్రచెరువులో ఈత కొట్టేందుకు వెళ్లారు. ఈ క్రమంలో సోహెల్, అబ్దుల్ రెహమాన్‌కు ఈత రాకపోవటంతో కాలు జారి నీట మునిగారు. తోటి మిత్రులు వెంటనే వారి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది వచ్చి చెరువులో గాలించగా ఇద్దరి మృతదేహాలను బయటకు తీశారు.