– అదనపు జిల్లా కోర్టు ఏర్పాటుకు సహకరిస్తా
– కోదాడ ఎమ్మెల్యే పద్మావతి రెడ్డి
కోదాడ, జూలై 30 : కోదాడ పట్టణంలో నిర్మాణంలో ఉన్న నాలుగు కోర్టు కాంప్లెక్స్‌ల భవన నిర్మాణానికి త్వరితగతిన నిధులు మంజూరు చేయిస్తానని, అలాగే స్థానికంగా అదనపు జిల్లా న్యాయస్థానం (అడిషనల్ డిస్ట్రిక్ట్ కోర్టు) ఏర్పాటుకు కృషి చేస్తానని కోదాడ ఎమ్మెల్యే ఉత్తమ్ పద్మావతి రెడ్డి స్పష్టం చేశారు. గురువారం కోదాడ బార్ అసోసియేషన్ అధ్యక్షుడు చింతకుంట్ల లక్ష్మీనారాయణ రెడ్డి ఆధ్వర్యంలో ఎగ్జిక్యూటివ్ బాడీ ప్రతినిధులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి పలు సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. న్యాయవాదులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారానికి తన వంతు సహకారం ఎల్లప్పుడూ ఉంటుందని హామీ ఇచ్చారు. నిర్మాణంలో ఉన్న కోర్టు భవనాలను త్వరితగతిన పూర్తి చేసేలా ప్రభుత్వం నుంచి నిధులు విడుదల చేయిస్తామన్నారు.
ప్రజలకు సత్వర న్యాయం అందించేందుకు అదనపు జిల్లా కోర్టు ఏర్పాటు అవసరమని, ఈ విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానన్నారు. అంతేకాకుండా, అర్హులైన న్యాయవాదులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అందేలా చూస్తానని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ఉపాధ్యక్షుడు గట్ల నరసింహారావు, ప్రధాన కార్యదర్శి రామిశెట్టి రామకృష్ణ, జాయింట్ సెక్రటరీ జానీ పాషా, ట్రెజరర్ కోడూరు వెంకటేశ్వరరావు, కల్చరల్ సెక్రటరీ గాలి శ్రీనివాస్ నాయుడు, మహిళా ప్రతినిధులు ధనలక్ష్మి, హేమలత, దుర్గ, పెద్దబ్బాయి, శ్రీను, నాగులు పాషా, సీతారామరాజు, హనుమంతరావు పాల్గొన్నారు.