కారేపల్లి, ఆగస్టు 15 : డోర్నకల్ జంక్షన్ నుండి భద్రాచలం రోడ్డు వరకు గతంలో రద్దు చేసిన రైళ్లను పునరుద్ధరించేందుకు రైల్వే అధికారులతో చర్చిస్తానని ఖమ్మం ఎంపీ రామసహాయం రఘురాంరెడ్డి తెలిపారు. వైరా ఎమ్మెల్యే మాలోత్ రాందాస్ నాయక్తో కలిసి ఎంపీ శుక్రవారం కారేపల్లిలో పర్యటించారు. ఈ సందర్భంగా కరోనా సమయంలో రద్దు చేసిన రైళ్లలో పలు రైళ్లను నేటికీ పునరుద్ధరించలేదని పేర్కొంటూ సామాజిక కార్యకర్త ఇందుర్తి సురేందర్ రెడ్డి ఎంపీకి వినతి పత్రం అందజేశారు. కరోనా కంటే ముందు డోర్నకల్ జంక్షన్ నుండి భద్రాచలం రోడ్డు వరకు కారేపల్లి జంక్షన్ మీదుగా రోజు ఎనిమిది రైళ్లు నడిచేవని, కరోనా సమయంలో ఈ రైళ్లను రద్దు చేసిన రైల్వే శాఖ కరోనా తర్వాత అందులో కొన్ని రైళ్లను మాత్రమే పునరుద్ధరించి మిగతా రైళ్లను నేటికీ పునరుద్ధరించలేదని తెలిపారు.
అలాగే ఈ రైల్వే లైన్లో నడిచే ప్రతి రైలు కూడా అన్ని స్టేషన్లలో ఆగేవని, కానీ ప్రస్తుతం నడిచే రైళ్లు కారేపల్లిలో తప్పా మిగతా స్టేషన్లలో ఆగడం లేదని, తద్వారా ఈ ప్రాంత గిరిజనులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నట్లు ఎంపీకి వివరించారు. సమస్యలన్నింటినీ రైల్వే శాఖ అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తానని ఎంపీ ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. అనంతరం కారేపల్లి రైల్వే స్టేషన్ను ఎంపీ పరిశీలించి స్టేషన్లో సమస్యలను అడిగి తెలుసుకున్నారు.