కట్టంగూర్, ఫిబ్రవరి 27 : వార్డు సభ్యులు ప్రజా సమస్యల పరిష్కానికి కృషి చేయాలని కట్టంగూర్ ఎంపీడీఓ పెరుమాళ్ల జ్ఞానప్రకాశ్ రావు అన్నారు. గత ఐదు రోజులుగా కట్టంగూర్ మండల పరిషత్ కార్యాలయంలో కొనసాగుతున్న గ్రామ పంచాయతీ వార్డు సభ్యుల రెండో విడత శిక్షణ కార్యక్రమం శుక్రవారం ముగిసింది. ఈ సందర్భంగా ఆయన పాల్గొని మాట్లాడుతూ.. గ్రామీణాభివృద్ధి, పారదర్శక పరిపాలన, పంచాయతీ రాజ్ వ్యవస్థలపై వార్డు సభ్యులకు శిక్షణ ద్వారా అవగాహన కల్పించినట్లు తెలిపారు. గ్రామాల అభివృద్ధి కోసం ప్రణాళికలు రూపొందించడం, నిధుల వినియోగం, ప్రజా సమస్యల పరిష్కారం, పారిశుధ్య చర్యలు, సంక్షేమ పథకాల అమలు అంశాలపై సభ్యులకు వివరించినట్లు వెల్లడించారు. అనంతరం శిక్షణ పూర్తి చేసుకున్న వార్డు సభ్యులకు సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమంలో మండల పంచాయతీ అధికారి స్వరూపారాణి, మండల పరిషత్ పర్యవేక్షకులు చింతమల్ల చలపతి, పంచాయతీ కార్యదర్శుల సంఘం మండల అధ్యక్షుడు పెద్దయ్య యాదవ్, ప్రధాన కార్యదర్శి వడ్లకొండ అశోక్, టీఓటీలు వెంకన్న, మల్లేష్, నర్సింహ్మ, స్వామి, సైదులు పాల్గొన్నారు.