Virosh | ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా విజయ్ దేవరకొండ-రష్మిక పెళ్లి ఫోటోలే కనిపిస్తున్నాయి. రష్మిక తన ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్న చిత్రాలు క్షణాల్లో వైరల్ అవుతూ రికార్డులు క్రియేట్ చేస్తుండడం మనం చూస్తూనే ఉన్నాం. అయితే వివాహ వేడుకలు ముగిసినా, ఆ సందడి మాత్రం ఇంకా తగ్గలేదు. అభిమానులు, సినీ ప్రముఖులు ఈ స్టార్ జంటకు పెద్ద ఎత్తున శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ వేడుకలో నటి ఈషా రెబ్బా, దర్శకుడు తరుణ్ భాస్కర్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. విజయ్–రష్మికలకు అత్యంత సన్నిహితులైన ఈ ఇద్దరూ వివాహ వేడుకను ఉత్సాహంగా ఆస్వాదించారు. ఈ సందర్భంగా తీసుకున్న పలు ఫోటోలను ఈషా రెబ్బ సోషల్ మీడియాలో పంచుకోగా, అవి ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతున్నాయి.
స్నేహితుల పెళ్లిలో ఈ జంట సంతోషంగా గడిపిన క్షణాలు అభిమానులను ఆకట్టుకుంటున్నాయి. ముఖ్యంగా ఒక క్యూట్ ఫోటోలో తరుణ్ భాస్కర్, ఈషా రెబ్బలతో పాటు దర్శకులు సందీప్ రెడ్డి వంగా,శివ నిర్వాణ తదితరులు చిరునవ్వులతో కనిపించడం విశేషం. ఆ ఫోటో చూస్తుంటే విజయ్–రష్మికల పెళ్లిలో టాలీవుడ్ వర్గం ఎంతగా సందడి చేసిందో అర్థమవుతోంది. ఇదిలా ఉండగా, తరుణ్ భాస్కర్–ఈషా రెబ్బల వివాహం గురించిన వార్తలు కొన్నాళ్లుగా వినిపిస్తూనే ఉన్నాయి. త్వరలోనే వీరిద్దరూ పెళ్లి పీటలు ఎక్కనున్నారని, అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశముందని సినీ వర్గాల్లో చర్చ సాగుతోంది. మొత్తానికి విజయ్–రష్మికల పెళ్లి సందడి మధ్య ఈ జంట కూడా హాట్ టాపిక్‌గా మారింది.
ఇక విజయ్-రష్మికలు ప్రస్తుతం తమ రిసెప్షన్ వేడుక పనులలో బిజీగా ఉన్నారని తెలుస్తుంది. మార్చి 4న తమ రిసెప్షన్ వేడుక జరగనుండగా, ఈ వేడుకకి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు భారీ ఎత్తున హాజరు కానున్నట్టు తెలుస్తుంది.