హైదరాబాద్, జూలై 22 (నమస్తే తెలంగాణ) : విద్యాశాఖ.. పర్యాటక శాఖలా మారిందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. ఈ శాఖ విదేశీ టూర్ల శాఖగా మారిందన్న ఆరోపణలున్నాయి. ఈ శాఖకు చెందిన కొందరు అధికారులు అదే పనిగా టూర్లకు వెళ్తున్నారు. స్వదేశీ టూర్లతోపాటు విదేశీ టూర్లంటే చాలు క్యూ కట్టేస్తున్నారు. దీంతో మూడు టూర్లు.. ఆరు దేశాలు అన్నట్టుగా పరిస్థితులున్నాయని సాక్షాత్తు విద్యాశాఖలోనే చర్చ నడుస్తున్నది. ఏప్రిల్ 19 నుంచి 24 వరకు 40మందితో కూడిన బృందం ఫిన్లాండ్లో పర్యటించింది. జూన్ 28 నుంచి జూలై 6 వరకు జర్మనీ, స్విట్జర్లాండ్‌కు వెళ్లివచ్చారు. నెల తిరుగకుండానే ఈ నెల 25 నుంచి ఆగస్టు 2 వరకు కెనడా పర్యటనకు బయలుదేరనున్నారు. త్వరలోనే జపాన్ టూర్ ఉండనున్నది. ఆ తర్వాత సింగపూర్, వియత్నాం వంటి దేశాల టూర్లు ఉండబోతున్నాయి.
అధికారులు, టీచర్లు విదేశీ పర్యటనలకు వెళుతున్నారు. అధ్యయనం చేస్తున్నారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. ఆయా అధ్యయన ఫలితాల అమలెక్కడ అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. కొంత కాలం క్రితం 40 మంది టీచర్లు, అధ్యాపకులు, అధికారులతో కూడిన బృందం ఫిన్లాండ్లో పర్యటించింది. ఇటీవలే 30 మందితో కూడిన మరో బృందం జర్మనీ, స్విట్జర్లాండ్‌లో పర్యటించింది. అయితే ఈ పర్యటనల అధ్యయన ఫలితాలేంది..? అనేది ప్రశ్నార్థకంగా మారింది. వాటిని రాష్ట్రస్థాయిలో అమలు చేసేందుకు విధానపరమైన నిర్ణయాలు తీసుకోలేదు. పాలసీలు రూపొందించలేదు.
పుండు ఒక చోట ఉంటే.. సర్కార్ మందు మరో చోట పెడుతున్నదన్న ఆరోపణలున్నాయి. ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్, డిగ్రీ కాలేజీలు రానురాను నిర్వీర్యమవుతున్నాయి. ముఖ్యంగా సర్కార్ బడుల్లో ఎన్రోల్మెంట్ తగ్గుతున్నది. ప్రైవేట్‌తో పోల్చితే ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో చేరుతున్న వారి సంఖ్య చాలా తక్కువగా ఉన్నది. యూనివర్సిటీల్లో 70% బోధనా సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నాయి. పలు విభాగాల్లో ఒక్కరంటే ఒక్క ప్రొఫెసర్ కూడా లేరు. కేవలం జీవోను జారీచేసి చేతులు దులుపుకొన్నారు. ఇంతవరకు ఒక్క పోస్టును కూడా భర్తీచేయలేదు. ఉన్నత విద్యలో ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల సంక్షోభం తారస్థాయికి చేరింది. కాలేజీలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడంలేదు. ఈ పరిస్థితుల్లో విద్యాశాఖ అధికారుల విదేశీ టూర్లు విస్మయానికి గురిచేస్తున్నాయి. ఈ సమస్యలకు పరిష్కారం చూపాల్సింది పోయి.. వీటిని గాలికి వదిలేసి టూర్లకు వెళ్లడమేంటన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి.
రాష్ర్టానికి అవసరమైన విద్యావిధానం రూపకల్పనకు ప్రభుత్వం కమిటీలేసింది. తెలంగాణ ఎడ్యుకేషన్ పాలసీని రూపొందిస్తామన్నది. ఇది ఇంకా రూపకల్పన దశలోనే ఉన్నది. ఏప్రిల్‌లోనే ఈ పాలసీని విడుదల చేస్తామన్నారు. జూన్ వచ్చింది.. 2026 కొత్త విద్యాసంవత్సరం కూడా ప్రారంభమయ్యింది. ఇప్పటికే మూడు విద్యాసంవత్సరాలు గడిచిపోయాయి. ఈ పాలసీ ముందుకు పడుతుందా..? లేదా..? అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. రాష్ట్రంలో విద్యాప్రమాణాలు దిగజారడంతో విద్యార్థులు ఇతర రాష్ర్టాలకు వలసపోతున్నారు. సగటు విద్యార్థులు ప్రైవేట్ యూనివర్సిటీలకు క్యూ కడుతున్నారు. వీటన్నింటికి పరిష్కారాలు చూపించాల్సిన, పాలసీలు రూపొందించాల్సిన వారు విదేశీ టూర్లలో మునిగితేలుతుండటం.. మన విద్యారంగాన్ని గాలికి వదిలేయడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.