గ్లాస్గో : మల్టీ స్పోర్టింగ్ ఈవెంట్లలో భారత్ పతకాల మోత మోగించే ప్రతిష్టాత్మక క్రీడోత్సవం కామన్వెల్త్ గేమ్స్. గత రెండు దశబ్దాల నుంచి ప్రతీ ఎడిషన్‌లో మన దేశం టాప్-5లో నిలుస్తూ వస్తోంది. కానీ, స్కాట్లాండ్లోని గ్లాస్గో వేదిక 13వ ఎడిషన్ కామన్వెల్త్ గేమ్స్ గురువారం మొదలవుతుండగా మన అథ్లెట్లలో మునుపటి సందడి కనిపించడం లేదు. ఒకప్పుడు బ్రిటీష్ పాలనలో ఉన్న 74 కామన్వెల్త్ దేశాల నుంచి 3 వేల మంది క్రీడాకారులు ఈ మెగా ఈవెంట్‌కు రెడీ అయినా.. పెద్దగా హంగామా లేదు. ఈసారి పోటీల సంఖ్య సగానికి తగ్గిపోవడమే అందుకు కారణం.ఆస్ట్రేలియాలోని విక్టోరియా రాష్ట్రం ఆర్థిక కారణాలతో ఆతిథ్య హక్కులను వదులకోవడంతో గ్లాస్గో నగరం నాలుగు వేదికల్లో 10 ఆటలతోనే ఈ కావన్వెల్త్ను కానిచ్చేస్తోంది. ఇందులో ఆరు క్రీడాంశాల్లో పారా గేమ్స్ కూడా జరగనున్నాయి. ఆటల సంఖ్య తగ్గడంతో తన టాప్-5 హోదాను నిలబెట్టుకోవడానికి భారత్ బాక్సింగ్, వెయిట్‌లిఫ్టింగ్, అథ్లెటిక్స్ క్రీడాకారులపై ఆధారపడుతోంది. 1994 తర్వాత అతి తక్కువ ఆటలో జరుగుతున్న తాజా ఎడిషన్‌లో మనదేశం మొత్తంగా 125 మంది అథ్లెట్లతో బరిలోకి దిగుతోంది. తొలి రోజు భారత్ లాన్‌బౌల్స్‌లో పోటీ పడనుంది. రాత్రి 10.30 నుంచి ఒవో హైడ్రో స్టేడియంలో గేమ్స్ ప్రారంభోత్సవం జరుగుతుంది.
అటు ఆటలు, ఇటు బడ్జెట్ తగ్గడంతో కామన్వెల్త్ గేమ్స్ ఉనికిని కోల్పోయే ప్రమాదం కనిపిస్తుండగా.. 2002 నుంచి ప్రతి ఎడిషన్‌లోనూ టాప్-5లో నిలుస్తూ వస్తున్న భారత్‌కు ఈసారి కఠిన పరీక్ష ఎదురుకానుంది. భారత్‌కు పతకాలు దక్కే రెజ్లింగ్, బ్యాడ్మింటన్, టేబుల్ టెన్నిస్, షూటింగ్క్రీడలు లేకపోవడం పెద్ద లోటుగా మారింది. బర్మింగ్‌హామ్‌లో జరిగిన గత కామన్వెల్త్లో భారత్ 61 పతకాలు నెగ్గితే అందులో 25 ఈ నాలుగు క్రీడల్లోనే రావడం విశేషం. ఈ లోటును పూడ్చే బాధ్యతను అథ్లెటిక్స్, బాక్సింగ్, వెయిట్‌లిఫ్టింగ్ మోయనున్నాయి. అథ్లెటిక్స్‌లో 22 పతక ఈవెంట్లలో 32 మంది సభ్యులతో కూడిన అతిపెద్ద బృందాన్ని భారత్ బరిలోకి దింపుతోంది. డబుల్ ఒలింపిక్ మెడలిస్ట్, స్టార్ జావెలిన్ త్రోయర్ నీరజ్ చోప్రాపై అందరి ఫోకస్ ఉంది. రోమ్ డైమ్ండ్ లీగ్‌లో 92.62 మీటర్ల త్రోతో అగ్రస్థానంలో నిలిచిన శ్రీలంకకు చెందిన రమేష్ తరంగ, ఒలింపిక్ చాంపియన్ పాకిస్థాన్ అర్షద్ నదీమ్ నుంచి అతడికి సవాల్ ఎదురవనుంది. హైజంపర్ సర్వేష్ కుశారే, లాంగ్ జంపర్ మురళీ శ్రీశంకర్, ట్రిపుల్ జంపర్ ప్రవీణ్ చిత్రవేల్తో పాటు పురుషుల,మహిళల 4×400 మీటర్ల రిలే జట్లపై కూడా అంచనాలున్నాయి.
బాక్సింగ్‌లో టోక్యో ఒలింపిక్ కాంస్య పతక విజేత లవ్లీనా బొర్గోహైన్ (75 కేజీలు) స్వర్ణాన్ని లక్ష్యంగా పెట్టుకుంది. వరల్డ్ చాంప్ జైస్మిన్ లంబోరియా (57 కేజీలు), ఆసియా చాంపియన్ ప్రీతి పవార్ (54 కేజీలు), సాక్షి చౌదరి (51 కేజీలు), అరుంధతి (70 కేజీలు) కూడా బంగారు పతకాలపై గురి పెట్టారు. అబ్బాయిల్లో నరేందర్ బెర్వాల్ (+90 కేజీలు), సచిన్ సివాచ్ (60 కేజీలు) బరిలో ఉన్నారు.బర్మింగ్‌హామ్‌లో స్వర్ణం, రజతం గెలిచిన భారత మహిళల, పురుషుల లాన్ బౌల్స్ జట్లు, మూడు పతకాలు గెలిచిన జుడోకాలు ఈసారి కూడా ఆ ప్రదర్శన పునరావృతం చేయాలని భారత్ ఆశిస్తోంది. ఆరు పారా క్రీడల్లోనూ మెరిసి టాప్-5లో స్థానం సంపాదించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
భారత్‌కు ఎప్పుడూ పతకాలు తెచ్చిపెట్టే వెయిట్‌లిఫ్టింగ్‌లో ఒలింపిక్ రజత పతక విజేత మీరాబాయి చాను ప్రధాన ఆకర్షణగా నిలిచింది. 31 ఏండ్ల ఈ మణిపూర్ లిఫ్టర్ కామన్వెల్త్ గేమ్స్‌లో హ్యాట్రిక్ స్వర్ణం కోసం ప్రయత్నిస్తోంది. అయితే పలువురు నేషనల్ క్యాంపర్లు డోపింగ్ టెస్టుల్లో విఫలమవడంతో వెయిట్‌లిఫ్టింగ్‌లో భారత్ ఈసారి 11 మందితో మాత్రమే బరిలోకి దిగుతోంది.
గత ఎడిషన్‌లో 19 క్రీడల్లో పోటీలు జరగ్గా.. ఈసారి అథ్లెటిక్స్, స్విమ్మింగ్, ట్రాక్ సైక్లింగ్, వెయిట్‌లిఫ్టింగ్, 3×3 బాస్కెట్‌బాల్, లాన్ బౌల్స్, నెట్‌బాల్, ఆర్టిస్టిక్ జిమ్నాస్టిక్స్, జూడో, బాక్సింగ్‌ను మాత్రమే కామన్వెల్త్ ప్రోగ్రామ్‌లో చేర్చారు. పారా గేమ్స్‌లో అథ్లెటిక్స్, 3×3 బాక్సింగ్, బౌల్స్, ట్రాక్ సైక్లింగ్, స్విమ్మింగ్,
పవర్‌లిఫ్టింగ్ మాత్రమే ఉన్నాయి.