స్వాతంత్య్రానికి పూర్వం హైదరాబాద్ రాజ్యంలో సాగునీటి సౌకర్యాల కల్పనలో నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ అనితరసాధ్యమైన కృషి గురించి ఈ 8 ఏండ్లలో విస్తారమైన చర్చ జరిగింది. ఆయన జన్మదినం జూలై 11ను ‘తెలంగాణ ఇంజినీర్స్ డే’గా అధికారికంగా ప్రకటించి ఆయన సేవలకు ఘనమైన శాశ్వత గౌరవాన్ని కల్పించింది తెలంగాణ ప్రభుత్వం.
2014 నుంచి నవాజ్ జంగ్ జన్మదినం సందర్భంగా ఏటా ఇంజినీరింగ్ రంగంలో విశేషమైన సేవలు అందించిన విశ్రాంత ఇంజినీర్లకు ‘నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ స్మారక జీవిత సాఫల్య పురస్కారాలను’ కూడా ప్రదానం చేస్తున్నది. ఈ సందర్భంగా నవాజ్ జంగ్ బహదూర్‌కు నివాళి అర్పిస్తూ.. ఆయన సమకాలీనుడు, అమెరికాలో వ్యవసాయరంగం, జలవిద్యుత్ ఉత్పత్తిలో కీలకంగా మారిన Hoover, Grand coulee, Owyhee వంటి తొలితరం డ్యాంల నిర్మాణంలో ప్రముఖపాత్ర పోషించిన లెజెండ్ ఇంజినీర్ ఎల్వుడ్ మీడ్ సేవలను ఈ వ్యాసంలో స్మరించుకుందాం.
ఎల్వుడ్ మీడ్ 1858 జనవరి 16న అమెరికాలో ఇండియానా రాష్ట్రంలో పేట్రియాట్ అనే చిన్న గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించాడు. ఒహీయో నదీ తీర ప్రాంతంలోని వ్యవసాయ క్షేత్రాలలో, చుట్టూ ఉన్న అడవులలో ఆడుతూ పాడుతూ పెరిగాడు. అమెరికాలో పెద్ద పెద్ద భూస్వాముల వద్ద కౌలుదార్లుగా ఉన్న రైతుల కష్టాలను గమనించాడు. ఈ నేపథ్యంలోనే, తన దేశ రైతాంగానికి ప్రయోజనం కలిగించటానికి జీవితాన్ని అంకితం చేశారు. 1882లో పర్డ్యూ విశ్వవిద్యాలయం నుంచి బీఎస్సీ (అగ్రికల్చర్) పట్టా అందుకున్నారు. అనంతరం అయోవా స్టేట్ యూనివర్సిటీ నుంచి సివిల్ ఇంజినీరింగ్ పూర్తిచేశారు. తిరిగి పర్డ్యూ విశ్వవిద్యాలయం నుంచే సివిల్ ఇంజినీరింగ్‌లో పీజీ చేశారు. 1870వ దశకంలో నీటి హక్కులకు సంబంధించిన చర్చకు కొలరాడో రాష్ట్రం కేంద్రంగా ఉండేది. మీడ్ ఈ చర్చల్లో చురుకుగా పాల్గొన్నారు. 1880వ దశకం నాటికి కొలరాడో, వైయోమింగ్ రాష్ర్టాలలో నీటి హక్కుల మేధావిగా, ఇరిగేషన్ ఇంజినీరింగ్ మేధావిగా మీడ్ పేరు గడించారు. అమెరికాలో కొలరాడో, ఆరిజోనా, నెవేడా, వైయోమింగ్ వంటి కరువు పీడిత ఎడారి ప్రాంతాల్లో వ్యవసాయ విస్తరణ జరగాలంటే నదీజలాల వినియోగం పెరగాలని, అందుకు భారీ స్థాయి జలాశయాల నిర్మాణం అత్యవసరమని మీడ్ భావించారు. ఆయన ఆలోచనలకు ఆనాడే పర్యావరణవేత్తల నుంచి వ్యతిరేకత ఎదురైంది. అయినప్పటికీ, మీడ్ తన ఆలోచనలను విస్తృతంగా ప్రచారం చేయడాన్ని కొనసాగించారు.
ఆస్ట్రేలియాలో సాగునీటి ప్రాజెక్టుల ప్రణాళికలను తయారు చేసే అవకాశం మీడ్‌కు వచ్చింది. దీంతో 1907లో ఆస్ట్రేలియా వెళ్లారు. పదేండ్లు అక్కడే పని చేసి సాగునీటి ప్రాజెక్టుల రూపకల్పనలో విశేష అనుభవం గడించి 1917లో తిరిగి అమెరికాకు వచ్చారు. ఆస్ట్రేలియాలో చేసిన ప్రయోగాలు అమెరికాలో కూడా ఉపయోగపడతాయని మీడ్ భావించారు. కాలిఫోర్నియా రాష్ట్ర శాసనసభ సభ్యులతో విస్తృతంగా చర్చలు జరిపారు. డుర్హంలో 10 వేల ఎకరాల వ్యవసాయ కాలనీ ఏర్పాటుకు వారిని ఒప్పించారు. అందుకు 2,60,000 డాలర్లు ఖర్చవుతాయని అంచనా వేశారు. ఇది అమెరికాలో మొట్టమొదటి వ్యవసాయ కాలనీ. ఆనాడు అమెరికాలో ఉన్న భూనిర్వహణ చట్టాలు, ఇమ్మిగ్రేషన్ చట్టాల కారణంగా వ్యవసాయ కాలనీల ఏర్పాటుకు సంబంధించి మీడ్ ఆలోచనలకు ఇతర రాష్ర్టాల నుంచి పెద్దగా ప్రోత్సాహం లభించలేదు.
ఎల్వుడ్ మీడ్ అమెరికాలో చేసిన అనేకానేక ప్రయోగాల తరహాలోనే నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ హైదరాబాద్ రాజ్యంలో ఇంజినీరింగ్ ప్రయోగాలు చేశారు. మొదట ఆయన గోదావరి, కృష్ణా ఉపనదులపై చిన్న చిన్న డ్యాంలను రూపకల్పన చేసి వాటి నిర్మాణాన్ని పూర్తిచేశారు. అప్పర్ మానేరు, పాలేరు, వైరా, పోచారం, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, డిండి, కోయిల్ సాగర్ ప్రాజెక్టుల ద్వారా పొందిన అనుభవంతో నవాజ్ జంగ్ మంజీరా నదిపై నిజాం సాగర్‌కు (1923-33), తుంగభద్ర నదిపై తుంగభద్ర ప్రాజెక్టుకు (1945-54) రూపకల్పన చేసి నిర్మించారు. అవి నాడు భారతదేశంలోనే కాదు ఆసియాలోనే అతి పెద్ద ప్రాజెక్టులు.
అమెరికాలో ఆయనకు ప్రోత్సాహం లభించకపోయినా.. తమకు సలహాలు అందించాలని పలు ఆఫ్రికా, ఆసియా దేశాల నుంచి మీడ్‌కు ఆహ్వానాలు అందాయి. 1923 నుంచి అంతర్జాతీయ స్థాయిలో ఆయన ఆలోచనలపై చర్చ మొదలైంది. మధ్య ఆసియాలో జోర్డాన్ నదీ వ్యాలీలో వ్యవసాయ అభివృద్ధికి సంబంధించి సలహాలు ఇవ్వడానికి మీడ్ పాలస్తీనా వెళ్ళారు. ఈ క్రమంలో అమెరికాలోనూ మీడ్ పట్ల గౌరవం పెరిగింది. ఓహియో, కొలరాడో, కొలంబియా నదీజలాల వినియోగానికి ప్రణాళికలు తయారు చేయడానికి, వివిధ రాష్ర్టాల మధ్య ఉన్న జల వివాదాలు పరిష్కరించడానికి ఆనాటి అమెరికా అధ్యక్షుడు కాల్విన్ కూలిడ్జ్ 1924లో మీడ్‌ను యూఎస్ బ్యూరో ఆఫ్ రిక్లమేషన్ కమీషనర్‌గా నియమించారు. ఈ పదవిలో మీడ్ 1936 వరకు సేవలు అందించారు. అమెరికాలో వివిధ రాష్ర్టాల సహకారంతో సాగునీటి ప్రాజెక్టులు, జల విద్యుత్ ప్రాజెక్టుల రూపకల్పన, నిర్మాణం, నిర్వహణ తదితర వ్యవహారాలు చూసే అత్యున్నత సంస్థ యూఎస్బీఆర్. మన దేశంలో కేంద్ర జలసంఘం లాంటిది. మీడ్ హయాంలో యూఎస్బీఆర్ అమెరికాలో అనేక ప్రాజెక్టులకు రూపకల్పన చేసింది. మీడ్ ప్రత్యక్ష పర్యవేక్షణలో ఓవైహీ (1928-32), హూవర్ (1931-36), గ్రాండ్కూలి (1933-44) డ్యాంల నిర్మాణం జరిగింది. రాష్ర్టాల మద్య నీటి పంపిణీ, విద్యుత్ పంపిణీ ఒప్పందాలను కుదర్చడంలో కూడా ఆయన కీలక పాత్ర పోషించారు. ఆనాడు ప్రపంచంలో ఇటువంటి ఎత్తైన డ్యాంల నిర్మాణానికి అవసరమైన అనుభవం ఎవరికీ లేదు. వీటి నిర్మాణం కోసం యూఎస్బీఆర్ అనేక కొత్త ఆవిష్కరణలు చేయవలసి వచ్చింది. ఈ విధంగా ప్రపంచానికి కొత్త సాంకేతిక పద్ధతులు, పరికరాలు లభించాయి. ఈ ఆవిష్కరణలకు మార్గనిర్దేశనం చేసింది కమీషనర్ మీడ్. 78 ఏండ్ల వయసులో 1936 జనవరి 26న ఎల్వుడ్ మీడ్ కన్ను మూశారు.
ఎల్వుడ్ మీడ్ అమెరికాలో చేసిన అనేకానేక ప్రయోగాల తరహాలోనే నవాబ్ అలీ నవాజ్ జంగ్ బహదూర్ హైదరాబాద్ రాజ్యంలో ఇంజినీరింగ్ ప్రయోగాలు చేశారు. మొదట ఆయన గోదావరి, కృష్ణా ఉపనదులపై చిన్న చిన్న డ్యాంలను రూపకల్పన చేసి వాటి నిర్మాణాన్ని పూర్తిచేశారు. అప్పర్ మానేరు, పాలేరు, వైరా, పోచారం, ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్, డిండి, కోయిల్ సాగర్ ప్రాజెక్టుల ద్వారా పొందిన అనుభవంతో నవాజ్ జంగ్ మంజీరా నదిపై నిజాం సాగర్‌కు (1923-33), తుంగభద్ర నదిపై తుంగభద్ర ప్రాజెక్టుకు (1945-54) రూపకల్పన చేసి నిర్మించారు. అవి నాడు భారతదేశంలోనే కాదు ఆసియాలోనే అతి పెద్ద ప్రాజెక్టులు. పోచంపాడ్, నందికొండ ప్రాజెక్టుల నివేదికలను కూడా నవాజ్ జంగ్ రూపొందించారు. మీడ్ లాగానే నవాజ్ జంగ్ కూడా హైదరాబాద్ రాజ్యానికి ఆవల అనేక స్వదేశీ సంస్థానాలకు సాంకేతిక సలహాలు అందించారు. తుంగభద్ర జలాల వినియోగంలో ఆనాడు రాష్ర్టాల మధ్య ఉన్న వివాదాలను పరిష్కరించి, డ్యాం నిర్మాణానికి మార్గం సుగమం చేశారు. అప్పట్లో మన దేశంలో యూరోపియన్ ఇంజినీర్లే చీఫ్ ఇంజినీర్లుగా నియమితులయ్యేవారు. దీనికి తొలి మినహాయింపు నవాజ్ జంగ్. భారతదేశంలో చీఫ్ ఇంజినీర్‌గా నియమితుడైన మొట్టమొదటి స్వదేశీ ఇంజినీర్ అలీ నవాజ్ జంగ్ బహదూర్. సమకాలీనులైన ఎల్వుడ్ మీడ్, అలీ నవాజ్ జంగ్ బహదూర్ ప్రపంచవ్యాప్తంగా ఇరిగేషన్ ఇంజినీర్లకు ప్రాతఃస్మరణీయులు.
శ్రీధర్‌రావు దేశ్‌పాండే