ప్రతి పౌరుడికి ప్రాథమికంగా కావాల్సినవి కూడు, గూడు, గుడ్డ.. మనిషి ఆర్థికంగా, సామాజికంగా ఎదగాలంటే ముందుగా మానసికంగా, శారీరకంగా, ఆరోగ్యంగా ఉండాలి. నేటి ఉరుకులు, పరుగుల జీవన విధానంలో ప్రజలు ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారు. వయస్సుతో సంబంధం లేకుండా పలురకాల రుగ్మతల బారినపడటం కొందరికి సర్వసాధారణమైపోయింది.
ఆరోగ్యం విషయంలో మందులు వాడటం కంటే, ముందుగానే రోగాల బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకుంటే మేలు కదా..! ఇది ఆరోగ్యంగా, ఆర్థికంగా ఎంతో ఉపయోగకరం. రోగాల పుట్టగా శరీరం మారిన తర్వాత ఎన్నిమందులు వాడితే ఏం లాభం? మన ఆరోగ్య పరిస్థితి, స్థితిగతులు తెలుసుకోవాలంటే అందుకు కావాల్సిన పరీక్షలు చేయించుకోవడం తప్పనిసరి. అయితే ఇప్పటివరకు ఈ వైద్యపరీక్షలు చేయించుకోవాలంటే సామాన్యుడికి తలకుమించిన భారం. అందుకే ప్రజాసంక్షేమం కోసం తెలంగాణ ప్రభుత్వం దాదాపు ఏడాదికిపైగా అన్నిరకాల కసరత్తులు చేసి రాష్ట్ర ప్రజల ‘హెల్త్ ప్రొఫైల్’ (ఆరోగ్య ముఖచిత్రం) నమోదు చేసే కార్యక్రమాన్ని ప్రారంభించింది.
ఈ కార్యక్రమంలో 18 ఏండ్లు నిండిన ప్రతి పౌరుడికి సంబంధించిన ఆరోగ్య సూచిని సేకరించి ఆన్లైన్లో భద్రపరుస్తారు. రక్త నమూనాలు, మూత్ర నమూనాలను వైద్యసిబ్బంది సేకరించి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పరీక్షిస్తారు. వచ్చిన ఫలితాలను ఆన్లైన్లో భద్రపరచడమే కాకుండా, ఆ వ్యక్తికి ఒక కోడ్‌ను కేటాయిస్తారు. ఈ కోడ్ ద్వారా ఆ వ్యక్తికి సంబంధించిన ఆరోగ్య చరిత్రను భవిష్యత్తులో తెలుసుకోవడానికి సులభమవుతుంది. దీనిద్వారా ఏదైనా అనారోగ్యానికి గురైనప్పుడు.. వెంటనే సరైన వైద్యం అందే అవకాశం ఉంటుంది. మొత్తం 15కు పైగా అత్యాధునిక పరికరాలతో, ఇరువైకి పైగా పరీక్షలు చేసి ప్రతి వ్యక్తి హెల్త్ ప్రొఫైల్‌ను సేకరిస్తారు. ఇందుకోసం కావాల్సిన వైద్య పరికరాలను తెలంగాణ వైద్య సదుపాయాలు, మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (టీఎస్ఎంఎస్ఐడీసీ) ఏర్పాటుచేస్తున్నది. వైద్య సిబ్బందికి కావాల్సిన శిక్షణ అందిస్తున్నది.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలకు తోడుగా, దేశంలోనే తొలిసారిగా ‘హెల్త్ ప్రొఫైల్’ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టడం అభినందనీయం. ఈ పథకం ప్రభుత్వానికి ఆర్థికంగా భారమే అయినా సామాన్యుడికి మాత్రం వరం. అనారోగ్యంతో సతమతమవుతూ వేలకు వేలు ఖర్చుపెట్టి పరీక్షలు చేయించుకోలేని ప్రజానీకానికి ‘హెల్త్ ప్రొఫైల్’ శ్రీరామరక్షగా నిలుస్తుంది.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజలకు అందిస్తున్న సంక్షేమ పథకాలకు తోడుగా, దేశంలోనే తొలిసారిగా ‘హెల్త్ ప్రొఫైల్’ కార్యక్రమాన్ని ప్రభుత్వం చేపట్టడం అభినందనీయం. ఈ పథకం ప్రభు త్వానికి ఆర్థికంగా భారమే అయినా సామాన్యుడికి మాత్రం వరం. అనారోగ్యంతో సతమతమవుతూ వేలకు వేలు ఖర్చుపెట్టి పరీక్షలు చేయించుకోలేని ప్రజానీకానికి ‘హెల్త్ ప్రొఫైల్’ శ్రీరామరక్షగా నిలుస్తుంది. పైలట్ ప్రాజెక్టుగా సిరిసిల్లలో 222 బృందాలను, ములుగులో 197 బృందాలను ప్రభుత్వం ఏర్పాటుచేసింది. ఒక్కో బృందంలో ఒక ఏఎన్ఎం, ముగ్గురు ఆశా కార్యకర్తలుంటారు. శాంపిళ్లను పరీక్షించేందుకు సిరిసిల్ల జిల్లాలో రూ.6.20 కోట్లు, ములుగు జిల్లాలో రూ.9.03 కోట్లు ఖర్చవుతుందని ప్రభుత్వం అంచనా వేసింది. ‘హెల్త్ ప్రొఫైల్’లో భాగంగా మొత్తం 30 రకాల పరీక్షలు నిర్వహిస్తారు. ఇందులో సీబీపీ, థైరాయిడ్, షుగర్, మూత్ర పిండాల పనితీరు పరీక్షలు, లిపిడ్ ప్రొఫైల్, బ్లడ్ గ్రూపింగ్ వంటి పరీక్షలుంటాయి. ఈ ‘హెల్త్ ప్రొఫైల్’ త్వరలోనే రాష్ట్రవ్యాప్తంగా విస్తరిస్తే సామాన్యుడి ఆరోగ్యానికి భరోసాను ప్రభుత్వం ఇచ్చినట్లవుతుంది.
‘హెల్త్ ప్రొఫైల్’ ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ప్రజల ఆరోగ్య పరిస్థితులు ఎలా ఉన్నాయి, కావాల్సిన పరికరాలు, వైద్యారోగ్య సిబ్బంది ఎంత..? భవిష్యత్తులో ప్రజా ఆరోగ్యం కోసం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమిటి..? అనే అంశాలు వైద్యారోగ్య శాఖకూ అర్థమవుతాయి. దీంతో ప్రజారోగ్యం విషయంలో ఎదురయ్యే సవాళ్లను అధిగమించవచ్చు. మొత్తం మీద ఈ ఆరోగ్య ముఖ చిత్రం (హెల్త్ ప్రొఫైల్) రాష్ట్ర ప్రజలకు ఒక భద్రత.. ఒక భరోసా.. ఒక భవిష్యత్తు.
(వ్యాసకర్త: సీనియర్ జర్నలిస్ట్)
నాయిడి మహిపాల్‌రెడ్డి
97000 22554